సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాలతో కూడిన సంక్షేమ క్యాలెండర్‌ను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం శాసనసభలో ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి 2023 మార్చి వరకు ప్రత్యక్ష నగదు బదిలీ పథకాల వివరాలతో ఈ సంక్షేమ క్యాలెండర్‌ను రూపొందించారు. సమాజంలో అన్ని వర్గాలకు ఇది సంక్షేమ క్యాలెండర్ కాగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మాత్రం ఫేర్‌వెల్ క్యాలెండర్ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు ఢంకా భజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5కు ఏమాత్రం రుచించని, గుబులు పుట్టించే క్యాలెండర్‌గా అభివర్ణించారు. శాసనసభలో ఆర్థిక మంత్రి బుగ్గన ద్రవ్య వినిమయ బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడారు. ఆ వివరాలివీ..
విపత్తులోనూ చెదరని సంకల్పం
ఈ బడ్జెట్ మన మేనిఫెస్టోను ప్రతిబింబిస్తోంది. మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్‌గా భావిస్తూ అమలు చేస్తున్నాం. రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాం. ఇది పూర్తిగా ప్రజల బడ్జెట్. గతంలో బడ్జెట్ ఎప్పుడు ప్రవేశపెట్టినా అంకెల గారడీ అని ప్రతిపక్షాలు విమర్శించడం చూస్తూ వచ్చాం. మరో 2 నెలల్లో ప్రభుత్వం ఏర్పడి మూడు సంవత్సరాలు పూర్తవుతుంది. మూడేళ్లలో 95 శాతం వాగ్ధానాల అమలుతో పాటు నవరత్నాల అమలుకు తిరుగులేని ప్రాధాన్యం ఇస్తూ పాలన సాగింది. కరోనా కారణంగా ఆదాయం తగ్గినా మన సంకల్పం ఎక్కడా చెక్కు చెదరలేదు. దీక్ష మారలేదు. ప్రజలకు చేస్తున్న మంచి ఎక్కడా తగ్గనూ లేదు.
ఉనికి కోసం విపక్షం డ్రామాలు
ప్రజలంతా రాష్ట్రంలో జరుగుతున్న మంచిని గమనించారు కాబట్టే ప్రతి ఎన్నికల్లోనూ ప్రభుత్వాన్ని అక్కున చేర్చుకున్నారు. మన ప్రభుత్వాన్ని మరింత బలపరిచారు. గత ఎన్నికల్లో టీడీపీకి ఓటు వేసిన వారు చాలామంది ప్రస్తుతం మన వెంటే ఉన్నారని సగర్వంగా తెలియజేస్తున్నా. విమర్శించే అవకాశం ప్రతిపక్షానికి లభించడం లేదు. అందుకనే ఉనికి కోసం లేని సమస్యలు ఉన్నట్లుగా చిత్రీకరించి, వక్రీకరించి రోజూ డ్రామాలాడుతోంది. వారికి ఢంకా బజాయించే ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5 ప్రతి సందర్భంలోనూ తమ కడుపు మంట చూపిస్తున్నాయి. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి, 44 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు తన హయాంలో ఫలానాది చేశానని చెప్పుకోవడానికి ఏ కోశానా ధైర్యం లేదు.
అందరూ నావాళ్లే
ఈ సంవత్సరం దాదాపు రూ.55 వేల కోట్లు నేరుగా (డీబీటీ) లబ్ధిదారులకు అందించబోతున్నాం. పరోక్షంగా మరో రూ.17,305 కోట్ల మేర ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. దేశ చరిత్రలోనే ఈ స్థాయిలో డీబీటీ, పారదర్శక పాలన ఎక్కడా అందడం లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఎప్పుడు, ఏ నెలలో ఇస్తున్నామో సందేహాలకు తావు లేకుండా ముందే ప్రకటించి సంక్షేమ క్యాలెండర్ అమలు చేస్తున్నాం. లబ్ధిదారులు
వారి కుటుంబ అవసరాలకు అనుగుణంగా ప్లాన్ చేసుకునే వీలు కల్పిస్తున్నాం. పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో కులం, మతం, ప్రాంతం, చివరికి ఏ పార్టీ అనేది కూడా చూడటం లేదు. అందరూ మనవాళ్లే.. అంతా నావాళ్లేనని గట్టిగా నమ్మి ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. పారదర్శకంగా ప్రతి ఒక్కరికీ మేలు జరిగేలా సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్) చేపడుతున్నాం.
రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారు..
నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు, రేపటి కంటే భవిష్యత్తు బాగుండాలనే తపనతో నవరత్నాలను అమలు చేస్తున్నాం. ఈ పథకాలు ఎలా అమలవుతున్నాయో రాష్ట్రంలో ఏ రైతన్నను అడిగినా చెబుతాడు. పిల్లలు, అక్కచెల్లెమ్మలు, ప్రతి అవ్వాతాతను అడిగినా చెబుతారు. సంతోషం వారి కళ్లల్లో కనిపిస్తుంది.
సంక్షేమ క్యాలెండర్ హైలెట్స్
► జూన్‌లో ఒక్క అమ్మఒడి పథకం ద్వారా తల్లుల ఖాతాలకు రూ.6,500 కోట్లు
► సెప్టెంబర్‌లో వైఎస్సార్ చేయూత ద్వారా 25 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.4,500 కోట్లు
► జనవరిలో వైఎస్సార్ ఆసరాతో దాదాపు 79 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.6,700 కోట్లు
► జనవరిలోనే వైఎస్సార్ పెన్షన్ కానుక రూ.2,500 నుంచి రూ.2,750కి పెంచే కార్యక్రమానికి శ్రీకారం
Comments
Please login to add a commentAdd a comment