సాక్షి, అమరావతి: కరోనా కట్టడిలో భాగంగా పరీక్షల సంఖ్యను భారీగా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ఆర్‌టీపీసీఆర్ పరీక్షల కోసం 113 మంది సాంకేతిక సిబ్బంది నియామకానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఆమోదం తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 12 ప్రభుత్వ మెడికల్ కాలేజీలతోపాటు రెండు ప్రైవేటు కాలేజీల్లో ఉన్న వీఆర్‌డీఎల్ కేంద్రాల్లో ఎక్కువ కరోనా పరీక్షలు నిర్వహించడమే కాకుండా రిపోర్టులను వేగంగా అందించడం కోసం వీరిని ఆరు నెలల కాలానికి తీసుకోనున్నారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందని.. ప్రతి వీఆర్‌డీఎల్ కేంద్రంలో కరోనా పరీక్షలు నిర్వహించడానికి ఒక రీసెర్చ్ సైంటిస్ట్, రీసెర్చ్ అసిస్టెంట్, ల్యాబ్ టెక్నీషియన్, డేటా ఎంట్రీ ఆపరేటర్, ఆఫీస్ సబార్డినేట్ ఉంటారని పేర్కొంది. ఇప్పటివరకు కరోనా పరీక్షల కోసం మొత్తం 533 మంది సిబ్బందిని తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో రోజుకు 40 వేలకు పైబడి ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నారని, కొత్త సిబ్బంది రాకతో ఈ సంఖ్య 60 వేలు దాటుతుందని ఆళ్ల నాని తెలిపారు. మరో మూడు రోజుల్లో ట్రూనాట్ పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలతోపాటు ఏలూరు ఆశ్రం మెడికల్ కాలేజీ, విజయనగరం మహారాజా మెడికల్ కాలేజీల్లో కూడా ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
ఇక రాష్ట్రంలో భారీగా ఆర్‌టీపీసీఆర్ పరీక్షలు
Published Sat, Apr 24 2021 3:55 AM | Last Updated on Sat, Apr 24 2021 3:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment