సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు, లాక్‌డౌన్ అమలవుతున్న తీరు, రాష్ట్రంలో వాలంటీర్లు, ఏఎన్‌ఎం, ఆశా వర్కర్లు నిర్వహించిన ఇంటింటికీ సర్వే, ప్రజల సహకారం, నిత్యావసర సరుకుల ధరలు, క్వారంటైన్‌లు, వృద్ధాశ్రమాలు, శిశు సదనాల్లో అందుతున్న మెనూపై చర్చ జరిగింది. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు బొత్స సత్య నారాయణ, ఆళ్ల నాని, మోపిదేవి వెంకట రమణ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని, వైద్యారోగ్య స్పెషల్ సీఎస్ జవహర్‌రెడ్డి , డీజీపీ గౌతం సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని మీడియాకు వివరాలు వెల్లడించారు.
ఏపీలో మొత్తం 161 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఈ 161 కేసుల్లో 140 మంది ఢిల్లీలోని జమాతే సదస్సుకు వెళ్లినవారేనని చెప్పారు. ఢిల్లీ నుంచి వచ్చినవారు ఏపీలో ప్రస్తుతం 946 మంది ఉన్నారని మంత్రి వెల్లడించారు. 946 మందికి గాను 881 మందికి పరీక్షలు చేయగా 108 మందికి పాజిటివ్ అని తేలిందని అన్నారు. జమాతేకు వెళ్లొచ్చినవారితో కాంటాక్ట్ అయిన 613 మందికి పరీక్షలు చేయగా 32 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. ఆయన మాట్లాడుతూ..
‘ఇంటింటి సర్వేపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆరా తీశారు. ఇప్పటివరకు 1.28 కోట్ల కుటుంబాల సర్వే అయింది. కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లను పెంచాం. గుంటూరు, కడపలో కూడా కరోనా టెస్టింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. సోమవారం నుంచి ఏడు ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు నిర్వహిస్తాం. అవసరమైతే ప్రైవేట్ ల్యాబ్‌ల సాయం కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. రేషన్ షాపులు, రైతుబజార్ల వద్ద సోషల్ డిస్టెన్స్ మరింత పెంచుతాం. ప్రతి షాపు వద్ద పెద్ద సైజులో ధరల పట్టిక పెట్టాలి. షెల్టర్లలో ఉన్నవాళ్లందరికి అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నాం. ప్రతి పేదవాడికి రూ.వెయ్యి అందిస్తాం. రేషన్ కార్డు లేకున్నా అర్హులై ఉంటే రూ.వెయ్యి ఇస్తాం. పంటలకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు’ అని ఆళ్ల నాని పేర్కొన్నారు. రైతులు నష్టపోకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మత్స్యశాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment