మాట్లాడుతున్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని
తిరుపతి తుడా: కరోనా సెకండ్ వేవ్‌ను దీటుగా ఎదుర్కొంటున్నామని.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, బెడ్స్ సమస్య లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది రాకుండా కోవిడ్ కేర్ సెంటర్లను కూడా పెంచుతున్నట్లు వెల్లడించారు. కోవిడ్ నియంత్రణ, వ్యాక్సినేషన్‌పై శనివారం చిత్తూరు జిల్లా ప్రజా ప్రతినిధులు, అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కరోనా బాధితులకు ఆక్సిజన్, బెడ్స్ కొరత రాకుండా ప్రణాళికలు సిద్ధం చేసి.. అమలు చేస్తున్నట్లు చెప్పారు. కోవిడ్ కేర్ సెంటర్లు పెంచుతున్నామని.. తద్వారా ఆస్పత్రులపై ఒత్తిడి తగ్గడంతో పాటు తగినన్ని బెడ్స్ అందుబాటులో ఉంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వం 500 టన్నుల ఆక్సిజన్‌ను రాష్ట్రానికి కేటాయించిందని.. అందులో నుంచే జిల్లాల వారీగా సరఫరా చేస్తున్నట్టు చెప్పారు.
45 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. ఆ మేరకు సరఫరా కావడం లేదన్నారు. ఒక్క రోజులోనే 6 లక్షల డోస్‌లు పూర్తి చేసిన రాష్ట్రంగా ఏపీ నిలిచిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ప్రైవేటు కోవిడ్ ఆస్పత్రుల్లో 50 శాతం బెడ్స్‌ను ఆరోగ్యశ్రీకి కేటాయించాల్సిందేనని స్పష్టం చేశారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయాలంటే ప్రజల భాగస్వామ్యం కూడా అవసరమని.. సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కర్ఫ్యూకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి.. భౌతిక దూరం పాటించాలని సూచించారు. సమావేశంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ విప్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డితో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment