
సాక్షి, పశ్చిమగోదావరి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి మామ, ప్రముఖ వైద్యులు ఈసీ గంగిరెడ్డి మృతి పట్ల డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎలాంటి ఫీజు తీసుకోకుండా ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించి పేదల డాక్టర్‌గా మంచి గుర్తింపు పొందారని తెలిపారు. కడప జిల్లాలో వైఎస్సార్‌సీపీ బలోపేతానికి ఆయన అవిశ్రాంతంగా కృషి చేసి ఆ ప్రాంతంలో పార్టీకి పెద్దదిక్కుగా నిలిచారన్నారు. గంగిరెడ్డి మరణం తీరని లోటన్నారు. కరోనా కష్టకాలంలో కూడా వైద్య సేవలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారని తెలిపారు. నిత్యం అందుబాటులో ఉండి పేదలకు అండగా ఉండేవారని మంత్రి ఆళ్ల నాని అన్నారు.
పేదల వైద్యుడిగా గుర్తింపు పొందిన డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మరణం చాలా బాధాకరమని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. గంగిరెడ్డి రాయలసీమ పేద ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని పేర్కొన్నారు.
గంగిరెడ్డి మరణం తీరని లోటు: ఎమ్మెల్యే తోపుదుర్తి
పులివెందుల పేదల డాక్టర్ ఈసీ గంగిరెడ్డి మరణం పట్ల అనంతపురం జిల్లా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంతాపం తెలిపారు. పులివెందుల వచ్చిన ఆయన ఈసీ గంగిరెడ్డి మరణం తీరని లోటని స్పష్టం చేశారు. ఓవైపు పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తూనే రైతుల సమస్యలపై ఈసీ గంగిరెడ్డి పోరాటాలు చేశారని చెప్పారు. (సీఎం జగన్ మామ ఈసీ గంగిరెడ్డి మృతి)
Comments
Please login to add a commentAdd a comment