సాక్షి ప్రతినిధి, ఏలూరు/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఏలూరు నగరంలో పలువురు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఒక్కసారిగా ఫిట్స్ రావడం, కిందపడిపోయి నోటి వెంట నురగలు కక్కడం వంటి లక్షణాలతో శనివారం అనేకమంది ఆస్పత్రుల పాలయ్యారు. మొదట దక్షిణపు వీధి, పడమర వీధిలో ప్రారంభమైన కేసులు ఆ తరువాత తూర్పు వీధి, కొత్తపేట, మాదేపల్లి రోడ్డులోని ప్రేమాలయం ప్రాంతం, కొబ్బరి తోట, అశోక్‌నగర్, గన్ బజార్, తంగెళ్లమూడి, మరడాని రంగారావు కాలనీ, వంగాయగూడెం, శనివారపు పేట వరకూ విస్తరించాయి. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11.30 గంటలకు సుమారు 95 మందికి పైగా ఇలాంటి లక్షణాలతో ప్రభుత్వాస్పత్రిలో చేరారు. వీరిలో ఆరేళ్ల చిన్నారి ప్రభ పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
95 మందిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తుండగా.. ఇప్పటివరకు 30 మంది వైద్య సేవల అనంతరం కోలుకోవడంతోడిశ్చార్జ్ చేశారు. మరికొందరు తమకూ సమస్య వచ్చిందనే అనుమానంతో ఆందోళనకు గురై ఆస్పత్రికి వచ్చారు. బాధితులను ఆస్పత్రికి తరలించడం కోసం 10 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను అప్రమత్తం చేశారు. ఆ వెంటనే విజయవాడ నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం బాధిత ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. వైద్యులు నిత్యం పర్యవేక్షించాలని, బాధితులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డును కేటాయించి చికిత్సకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని అనుక్షణం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జేసీ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్‌వో డాక్టర్ సునంద, వైద్యులు శ్రీనివాస్, విజయభాస్కర్‌తో మంత్రి సమీక్షించారు.
అంతు చిక్కని వైనం
ప్రజలు కళ్లు తిరిగి పడిపోవడం, ఫిట్స్ బారిన పడటానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదని వైద్యులు చెబుతున్నారు. సీటీ స్కాన్‌లో అందరికీ నార్మల్ రిపోర్టులు వస్తున్నాయని తెలిపారు, పూర్తిస్థాయి పరీక్షల అనంతరమే కారణం ఏమిటనేది నిర్ధారించగలమని పేర్కొంటున్నారు. ఇదిలావుండగా.. నగర వాసులకు అంతుచిక్కని వ్యాధి సోకుతోందనీ, తాగునీటి కాలుష్యమే ఇందుకు కారణమంటూ వార్తలు వ్యాప్తి చెందటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.
విజయవాడలో స్పెషల్ ఐసీయూ
ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశాలతో విజయవాడ జీజీహెచ్ వైద్యులు అప్రమత్తమయ్యారు. ఏలూరు నుంచి ఏ సమయంలో కేసులు వచ్చినా తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకు అప్పటికప్పుడు 30 పడకలతో ప్రత్యేక ఐసీయూను సిద్ధం చేశారు. వెంటిలేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు వంటివి కూడా అందుబాటులో ఉంచారు. 20 మంది నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని 24 గంటలూ అందుబాటులో ఉండేలా నియమించారు. వారిలో జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, క్రిటికల్ కేర్, పీడియాట్రిక్, న్యూరాలజీ నిపుణులు ఉన్నారు. బాధితులకు పరీక్షలు చేసేందుకు సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ సిబ్బంది, రేడియాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లను అందుబాటులో ఉంచారు.
స్థిరంగా బాలిక ఆరోగ్యం
ఏలూరు నుంచి తీసుకొచ్చిన ఆరేళ్ల చిన్నారి ప్రభను విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని పీడియాట్రిక్ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలిక ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఆమెకు ఎందుకు అలా జరిగిందో తేలాల్సి ఉందని సూపరింటెండెంట్ శివశంకరరావు
పేర్కొన్నారు.
ఏలూరులో పలువురికి అస్వస్థత
Published Sun, Dec 6 2020 3:21 AM | Last Updated on Sun, Dec 6 2020 3:21 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment