vijayawada government hospital
-
ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘ప్రత్యేక ఓపీ’
లబ్బీపేట(విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ప్రత్యేక ఓపీ కౌంటర్ ఏర్పాటుచేశారు. ఈ కౌంటర్‌ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక ఓపీ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి సోమవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మంగళవారం మానసిక వ్యాధులు, జనరల్ మెడిసిన్, బుధవారం గుండె, కిడ్నీ వ్యాధులు, గురువారం ఆర్థోపెడిక్, న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, శుక్రవారం చర్మ వ్యాధులు, జనరల్ మెడిసిన్, శనివారం ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేసి మందులు అందజేస్తారని తెలియజేశారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. రక్తపోటు, హైపో థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటీస్, నెఫ్రోటిక్ సిండ్రోమ్, క్రానిక్ కిడ్నీ వ్యాధులు వంటి వాటికి పరీక్షలు చేసి మందులు అందిస్తారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విఠల్‌రావు, జిల్లా ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ జె.సుమన్, ఆర్‌ఎంఓలు శోభ, మంగాదేవి, ఎన్జీవో నాయకులు పాల్గొన్నారు. -
అధైర్య పడొద్దు.. అన్ని విధాల ఆదుకుంటాం
లబ్బీపేట(విజయవాడతూర్పు): తన కుమార్తె వైద్య ఖర్చుల కోసం ఏనాడు ప్రభుత్వాన్ని సాయం కోరలేదని, ముఖ్యమంత్రిని కలవలేక పోతున్నాననే ఆవేదన, క్షణికావేశంలో మాత్రమే చేతికి గాయం చేసుకున్నట్లు కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలేనికి చెందిన ఆరుద్ర తనను కలిసిన ఉన్నతాధికారులకు తెలిపారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం సమీపాన తన చేతికి గాయం చేసుకుని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజులపూడి ఆరుద్రను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, సీపీ కాంతి రాణా టాటా పరామర్శించారు. ఆరుద్ర, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం న్యాయం చేస్తుందని ధైర్యంగా ఉండాలని సీఎం చెప్పారని, ఆయన ఆదేశాల మేరకే తాము వచ్చినట్లు తెలిపారు. కాగా నిస్సహాయురాలైన ఓ మహిళ తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంకోసం ప్రయత్నిస్తే ఆ ఉదంతాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఎల్లో మీడియా ప్రయత్నించడం చూసి జనం విస్తుపోతున్నారు. ఆరుద్రను కలసిన అనంతరం కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు. ఆరుద్ర కుమార్తె సాయి లక్ష్మికి మూడు నెలల వయసులోనే స్పైనల్ వ్యాధికి ఆపరేషన్ జరిగిందని, కొంతకాలం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా, తర్వాత తిరిగి అనారోగ్యానికి గురవడంతో వెల్లూరు, లక్నో వంటి అనేక ప్రాంతాల్లో వైద్యం చేసినా మెరుగుపడలేదన్నారు. అమెరికాలో అధునాతన వైద్యం చేయిస్తే కోలుకోవచ్చని కొందరు వైద్యులు చెప్పినట్లు తెలిపారు. కుమార్తె వైద్య ఖర్చుల కోసం అమలాపురంలో ఉన్న తమ ఆస్తులను రూ.62 లక్షలకు విక్రయించినట్లు ఆరుద్ర చెప్పారని కలెక్టర్ పేర్కొన్నారు. శంఖవరం మండలం అన్నవరంలోని తన ఇంటిని అమ్మడానికి ప్రయత్నిస్తే ఇరువైపులా ఉన్న కానిస్టేబుళ్లు శివయ్య, కన్నయ్య, ముత్యాలరావులు అడ్డుపడటమే కాకుండా, న్యాయపరమైన చిక్కులు సృష్టించారని, వారిపై 2020లో జిల్లా ఎస్పీకి, ఆ తర్వాత కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకున్నారని తెలిపినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో తన కుమార్తెకు విదేశాల్లో వైద్యం అందించలేక పోతున్నాననే బాధతో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని ప్రయత్నించినట్లు ఆరుద్ర తెలిపారని పేర్కొన్నారు. గత నెల 31న ఎ–కన్వెన్షన్ హాలు వద్ద సీఎంను కలిసేందుకు ప్రయత్నించగా, భద్రతా కారణాల వలన పోలీసులు అనుమతించలేదన్నారు. ఈ నెల 2న కుమార్తెతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని అధికారులను కలవగా, సమస్య కోర్టు పరిధిలో ఉందని, పౌర సమస్యలను స్థానికంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆమె తెలిపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిని కలవలేక పోయాననే మనస్తాపంతోనే ఆవేశంలో చేతికి గాయం చేసుకున్నానని ఆరుద్ర వివరించిందని తెలిపారు. కుమార్తె అనారోగ్యం వల్ల 2018లో గ్రూప్–2 ఉద్యోగానికి ఎంపికైనా చేరలేక పోయానని, తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్ఫథంతో మరొకసారి అవకాశం కల్పించాలని ఆరుద్ర కోరినట్లు కలెక్టర్ తెలిపారు. -
బందరులో టీడీపీ రౌడీ రాజకీయం
మచిలీపట్నం టౌన్: కృష్ణాజిల్లా బందరు మండలంలో టీడీపీ రౌడీ మూకలు రెచ్చిపోయారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై కత్తులు, రాళ్లతో దాడికి తెగబడ్డారు. ఆదివారం అర్థరాత్రి జరిగిన దాడిలో వైఎస్సార్సీపీ శ్రేణులు తీవ్రంగా గాయపడ్డారు. దాడికి సంబంధించి 12 మంది టీడీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం మేరకు.. మచిలీపట్నం మండల పరిధిలోని గరాలదిబ్బలో కొంతకాలంగా ఇరువర్గాల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక జీర్ణించుకోలేని టీడీపీ శ్రేణులు తరచూ గొడవలకు దిగేవారు. పలుమార్లు ఘర్షణలు జరిగి కేసులు నమోదయ్యాయి. శనివారం రాత్రి ఒడుగు రాజ్‌కుమార్ బైక్‌పై వెళ్తున్నాడు. బహిర్భూమికి వెళ్లిన బొడ్డు నాగరాజు అటుగా వెళ్తుండగా అలికిడి వినిపించి రాజ్‌కుమార్ బైక్ లైట్‌ని అటువైపుగా తిప్పాడు. బహిర్భూమికి వస్తే నావైపు బైక్ లైట్ వేస్తావా? అంటూ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం నడిచింది. ఆ తరువాత ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు. పాతకక్షలను మనసులో పెట్టుకున్న నాగరాజు తన వర్గీయులతో ఆదివారం రాత్రి కత్తులు, ఇనుపరాడ్లు, బరిసెలు, రాళ్లతో రాజ్‌కుమార్, ఆయన వర్గీయులపై దాడికి తెగబడ్డారు. మహిళలు, చిన్న పిల్లలని కూడా చూడకుండా రెచ్చిపోయినట్లు స్థానికులు చెప్పారు. నిరీక్షణరావు (24) భోజనం చేస్తుండగానే టీడీపీ శ్రేణులు బరిసెతో పొడిచారు. ఆ బరిసె కన్ను మీదుగా ముఖంపై గుచ్చుకుంది. అదే విధంగా ఒడుగు నాగరాజు, శివరాజు, రాజ్‌కుమార్, ఏడుకొండలు, శివ గాయాలపాలయ్యారు. పరిస్థితి విషమించడంతో నిరీక్షణరావును విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మిగిలిన ఐదుగురిని మచిలీపట్నంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. దాడికి పాల్పడిన బొడ్డు వీరవెంకటేశ్వరరావు (నాని), బొడ్డు నాగబాబు (చిన్నా), బొడ్డు దుర్గారావు, బొడ్డు నాగేశ్వరరావు, బొడ్డు బాల, బొడ్డు నాగరాజు, బొడ్డు ఏసురాజు, బొడ్డు వెంకటేశ్వరరావు (వెంకన్న), బొడ్డు ఏడుకొండలు (చంటి), బొడ్డు అభిరామ్ (రాజు), బొడ్డు వేణుగోపాలరావు (వేణు), బొడ్డు మోషేరాజుపై సెక్షన్ 307, 148, 143, 149 కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపినట్లు ఎస్ఐ జి.వాసు వెల్లడించారు. -
అత్యాచార ఘటనపై చంద్రబాబు రాజకీయం
సీటీఆర్ఐ (రాజమహేంద్రవరం): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచార ఘటనను చంద్రబాబు నీచ రాజకీయానికి వాడుకుంటున్నారని హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధితురాలి వివరాలు బహిర్గతం చేయరాదని చట్టాలున్నా చంద్రబాబు ప్రచారం కోసం మీడియా ముందు అన్నీ బహిర్గతం చేయడం దారుణమన్నారు. ఈ కేసులో నిందితుల్ని మూడు గంటల్లోనే పట్టుకున్నట్లు గుర్తుచేశారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం అందజేశామన్నారు. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కోసం సిఫార్సు చేశామని, ఇంటిస్థలాన్ని, ఇంటిని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎంపీ భరత్‌రామ్ మాట్లాడుతూ దిశ చట్టానికి కేంద్ర మహిళా మంత్రిత్వశాఖ సానుకూలంగా స్పందించి, హోంశాఖకు సిఫార్సు చేసిందని తెలిపారు. -
ఆ కుటుంబానికి ప్రభుత్వ అండ
కళ్యాణదుర్గం: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె మాట్లాడారు. ఘటన జరిగిన వెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి.. మంత్రులను బాధితురా లి వద్దకు పంపి ఆమెకు భరోసానిచ్చినట్టు చెప్పా రు. అలాగే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించారని తెలిపారు. బాధిత కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి సహకారం అందించడంతో పాటు, కుటుంబానికి ఆసరా కల్పిస్తామని భరోసా ఇచ్చినట్టు వివరించారు. అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. బాధి తురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై చంద్రబాబు, ఆయన అనుచరులు దాడి చేయడం దారుణమని, రాజకీయం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. -
నిందితులకు కఠిన శిక్ష పడేలా చేస్తాం: హోంమంత్రి తానేటి వనిత
సాక్షి, విజయవాడ: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జరిగిన ఘటన హేయనీయమని హోంమంత్రి తానేటి వనిత అన్నారు. ఘటనకు సంబంధించిన నిందితులు ముగ్గురిని అరెస్ట్ చేశామని తెలిపారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఇలాంటి సంఘటనలు జరిగినపుడు ప్రభుత్వం ఉపేక్షించదని తెలిపారు. నిందితులను ఉరి తీయడం న్యాయస్థానం పరిధిలో ఉందని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించారని పేర్కొన్నారు. బాధితురాలికి ఇల్లు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అన్ని విధాలుగా ఆదుకుంటామని, యువతి చేస్తానంటే ఉద్యోగం కూడా ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు సూచించామని హోంమంత్రి పేర్కొన్నారు. యువతి ఆరోగ్యం నిలకడగా ఉందని, నిందితులను కఠినంగా శిక్షించాలని సీఎం జగన్ ఆదేశించారని తానేటి వనిత తెలిపారు. పెస్టిసైడ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఉద్యోగిని తొలగించామని తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన సీఐ, ఎస్సైలను సస్పెండ్ చేశారని అన్నారు. చంద్రబాబు మానసికంగా బాధపడుతున్న యువతి విషయంలోనూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఘటనలు జరిగినపుడు ఇంత వేగంగా చర్యలు తీసుకోలేదని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఒంగోలు పర్యటన దృష్టి మరల్చేందుకు చంద్రబాబు కుయుక్తులు పన్నుతున్నారని మండిపడ్డారు. చదవండి👉: బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు వెళ్తే టీడీపీ దౌర్జన్యం చేసింది: వాసిరెడ్డి పద్మ -
మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి
పాయకాపురం (విజయవాడ రూరల్)/లబ్బీపేట (విజయవాడ తూర్పు)/సాక్షి, అమరావతి: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో మానసిక వికలాంగురాలిపై ముగ్గురు యువకులు లైంగికదాడికి పాల్పడ్డ ఘటన కలకలం రేపింది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు.. నిందితులు ముగ్గురిని అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఘటన వివరాలు.. విజయవాడ వాంబే కాలనీకి చెందిన ఒక మహిళ.. మానసిక వికలాంగురాలు (23) అయిన తన కూతురు కనిపించడం లేదంటూ ఈ నెల 19న నున్న పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు చిన్న క్లూ ఆధారంగా ప్రభుత్వాస్పత్రిలో చెదల నివారణ కాంట్రాక్టర్ వద్ద పనిచేసే దారా శ్రీకాంత్ శేఖర్‌ను ఫోన్లో విచారించారు. యువతి తన వద్దకు వచ్చిందని.. అయితే ఈ సమయంలో ఎందుకు వచ్చావంటూ ఆటో ఎక్కించి పంపించేశానని శ్రీకాంత్ తొలుత చెప్పాడు. తదుపరి విచారణలో బాధిత యువతి ఆస్పత్రి ఎ–బ్లాక్ రెండో అంతస్తులో చెదల నివారణ సామగ్రి ఉంచే గదిలో ఉన్నట్లు తెలుసుకుని పోలీసులు అక్కడకు వెళ్లారు. ప్రభుత్వాస్పత్రిలో తనకు ఉద్యోగం ఇప్పిస్తానంటూ మాయమాటలు చెప్పి శ్రీకాంత్ లైంగికదాడి చేశాడని యువతి ఆవేదన వ్యక్తం చేసింది. మరుసటి రోజు అదే గదిలో శ్రీకాంత్ వదిలివెళ్లిపోగా మరో వర్కర్ బాబూరావు, అతడి స్నేహితుడు పవన్ కళ్యాణ్ తనపై లైంగికదాడికి పాల్పడ్డారని బోరుమంది. దీంతో పోలీసులు యువతి మిస్సింగ్ కేసును రేప్ కేసుగా మార్చి వైద్య పరీక్షల కోసం ప్రభుత్వాస్పత్రికి పంపారు. తర్వాత దిశ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాల ద్వారా ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా, లైంగిక దాడికి పాల్పడ్డ ఇద్దరు కార్మికులను తొలగించడంతోపాటు ఘటన జరిగిన ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సెక్యూరిటీ గార్డులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి కాంట్రాక్టర్‌ను ఆదేశించారు. కాంట్రాక్టును కూడా రద్దు చేస్తున్నట్లు ఆమె ప్రకటించారు. స్టాఫ్ నర్సుతోపాటు నైట్ డ్యూటీ హెడ్ నర్సుకు మెమోలు ఇవ్వనున్నట్లు తెలిపారు. -
మహిళ కడుపులో 4.5 కిలోల కణితి తొలగింపు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): మహిళ కడుపులోని గర్భసంచికి అతుక్కుని ఉన్న 4.5 కిలోల కణితిని విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి తొలగించారు. రక్తస్రావం, కడుపునొప్పితో విజయవాడకి చెందిన సీహెచ్ ఆదిలక్ష్మి పాత ప్రభుత్వాస్పత్రిలోని ప్రసూతి విభాగానికి ఇటీవల వచ్చింది. ఆమెకు పరీక్ష చేసిన వైద్యులు కడుపులో పెద్దగడ్డ ఉన్నట్లు గుర్తించారు. శస్త్ర చికిత్స చేయాని నిర్ణయించారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యేకుల కిరణ్‌కుమార్, గైనకాలజీ నిపుణులు డాక్టర్ విజయశీల, డాక్టర్ కరుణలతో కలిసి లేపరోటమీ విధానంతో అతి క్లిష్టమైన శస్త్ర చికిత్స నిర్వహించి కడుపులోని గడ్డను తొలగించారు. లేపరోటమీ, రిలీజ్ ఆఫ్ అథిషన్స్, టీఏహెచ్ విధానం అవలంభించి ఈ శస్త్రచికిత్స చేసినట్లు డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. రోగి ఆదిలక్ష్మి ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. శస్త్ర చికిత్సలో మత్తు నిపుణులు డాక్టర్ పీఎన్‌రావు, డాక్టర్ రాంబాబు, గైనిక్ పీజీ డాక్టర్ శాంత్రలు పాల్గొన్నారు. -
ప్రభుత్వాస్పత్రిలో అరుదైన శస్త్రచికిత్స
లబ్బీపేట (విజయవాడ తూర్పు): అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు విజయవంతంగా చేశారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యేకుల కిరణ్‌కుమార్, ఇతర వైద్యులు ఈనెల 9న నాలుగు గంటలు శ్రమించి 65 ఏళ్ల వృద్ధురాలు శివపూర్ణమ్మ మెడలోని క్యాన్సర్ గడ్డను తొలగించారు. ఆమె కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జి చేశారు. ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్ ఈ వివరాలు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన శివపూర్ణమ్మ మెడలో కణితితో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా క్యాన్సర్ కణితి అని తేలింది. దీంతో ఆమె ప్రభుత్వాస్పత్రికి వచ్చింది. రక్తనాళాలు, గొంతు నరాలకు హానికలగకుండా ఆమెకు శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ కణితిని, దాని చుట్టూ ఉండే శోషరస గ్రంధులను తొలగించారు. పోస్ట్ ఆపరేటివ్ జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, ఆమె శరీరంలో క్యాల్షియం తగ్గడాన్ని గుర్తించి వైద్యం చేశారు. ప్రస్తుతం ఆమెకు రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్ కిరణ్‌కుమార్ చెప్పారు. శస్త్రచికిత్సను విజయవంతంగా చేయడంలో అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి.సూర్యశ్రీ, వారి బృందం, సర్జరీ వైద్యులు డాక్టర్ చందనాప్రియాంక, డాక్టర్ ఉష, డాక్టర్ గాయత్రిల కృషి ఉన్నట్లు తెలిపారు. ప్రభుత్వాస్పత్రిలో క్యాన్సర్ క్లినిక్ ప్రభుత్వాస్పత్రికి అనుబంధంగా గుంటూరు జిల్లా చినకాకానిలో ఉన్న క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులతో విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో క్యాన్సర్ క్లినిక్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. అక్కడ ముగ్గురు క్యాన్సర్ నిపుణులు ఉన్నారని, వారు వచ్చి ఇక్కడ వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కీమో సేవలు అందిస్తారని చెప్పారు. -
డయాప్రెమాటిక్ హెర్నియా.. హైరిస్క్ సర్జరీ సక్సెస్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): అరుదుగా వచ్చే డయాప్రెమాటిక్ హెర్నియాకు విజయవాడ జీజీహెచ్ వైద్యులు విజయవంతంగా శస్త్ర చికిత్స నిర్వహించారు. కార్పొరేట్, ప్రైవేటు వైద్యులు సైతం హైరిస్క్ అని చెప్పిన అత్యంత అరుదైన శస్త్ర చికిత్సను నైపుణ్యం కలిగిన ప్రభుత్వాస్పత్రి వైద్యుల బృందం సుసాధ్యం చేసి చూపించారు. విజయవాడ జీజీహెచ్‌లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ యేకుల కిరణ్‌కుమార్, సర్జరీలో పాల్గొన్న వైద్యులు శస్త్ర చికిత్స వివరాలను తెలియజేశారు. అత్యంత అరుదు.. ప్రతి ఒక్కరికీ పొట్టకి, ఊపిరితిత్తులకు మధ్య కండరం గోడలా ఉంటుంది. ఆ కండరానికి చిల్లు పడటాన్ని డయాప్రెమాటిక్ హెర్నియా అంటారు. గోడలా ఉన్న కండరానికి ఎడమ వైపున చిల్లు పడటం సహజం, కుడివైపున చిల్లుపడటం అత్యంత అరుదు. పశ్చిమగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పాలంగి గ్రామానికి చెందిన వి.జోగిరాజు (48) ఈ రకమైన సమస్యతో బాధ పడుతున్నాడు. ఇతడికి కుడివైపున చిల్లు పడటంతో ఊపిరితిత్తుల్లోకి లివర్, పేగులు చొచ్చుకుని వెళ్లాయి. దీంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడ్డాడు. ఛాలెంజ్‌గా తీసుకుని.. పలు ప్రైవేటు ఆస్పత్రులు తిరిగిన జోగిరాజు అక్కడి వైద్యులు హై రిస్క్ కేసు అని చెప్పడంతో చివరగా విజయవాడ ప్రభుత్వాస్పత్రికి వచ్చాడు. ఈ కేసును ఛాలెంజ్‌గా తీసుకున్న ప్రభుత్వ వైద్యులు శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఊపిరితిత్తుల్లోకి చొచ్చుకు వెళ్లిన లివర్, చిన్న పేగులను సాధారణ స్థితికి తీసుకొచ్చి, కండరానికి మెస్ వేసి రిపేరు చేసినట్లు సూపరింటెండెంట్ కిరణ్‌కుమార్ తెలిపారు. దీంతో రోగి పూర్తిగా కోలుకున్నట్లు చెప్పారు. ఈ సమావేశంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ కందుల అప్పారావు, అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి.సూర్యశ్రీ అనస్థీషియన్ డాక్టర్ గీతాపద్మజ తదితరులు పాల్గొన్నారు. దేవుళ్లలా కాపాడారు.. వారికి నేను పాదాభివందనం చేస్తున్నా. అనేక ఆస్పత్రులు తిరిగాను. హైదరాబాద్‌లోని ప్రముఖ ఆస్పత్రులకూ వెళ్లాను. అక్కడ ఆపరేషన్‌కు రూ.5 లక్షలు అవుతాయని, అయినా హై రిస్క్ అని చెప్పారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వచ్చిన నన్ను విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు దేవుళ్లలాగా కాపాడారు. ఇక్కడి వైద్యులు, సిబ్బంది సేవలు చూశాక ప్రభుత్వాస్పత్రిలో సరిగా చూడరనే భావన తప్పని తెలిసింది. – జోగిరాజు, సర్జరీ చేయించుకున్న వ్యక్తి -
బ్లాక్ ఫంగస్ చికిత్సకు రూ.22 లక్షలు తీసుకున్నారు!
లబ్బీపేట (విజయవాడ తూర్పు): బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం ప్రభుత్వాస్పత్రిలో చేరితే, ఇంజక్షన్ల కొరత ఉందంటూ ఓ డ్యూటీ వైద్యురాలు తమ వద్ద నుంచి రూ.22 లక్షలు వసూలు చేసిందని ఓ వ్యక్తి వైద్యాధికారులకు ఫిర్యాదు చేశారు. తాము చెల్లింపులన్నీ డ్యూటీ డాక్టర్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకు జమ చేసినట్లు ఆధారాలతో సహా ఫిర్యాదుకు జత చేయడంతో దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పొట్టెం విజయలక్ష్మి శరన్ ఈ ఏడాది మే 28న బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరారు. ఆ సమయంలో ఆ వార్డులో డ్యూటీ డాక్టర్‌గా ఉన్న (కోవిడ్ నియామకం) తోట వాణి సుప్రియ లయోఫిలైజుడ్ యాంఫోటెరిసిన్ బి అనే యాంటి ఫంగల్ ఇంజెక్షన్స్ కొరత ఉందని, డిమాండ్ కూడా ఎక్కువగా ఉందని, ముడుపులు చెల్లిస్తే కానీ ఇంజెక్షన్లు సమకూర్చలేమని చెప్పినట్లు విజయలక్ష్మి భర్త రఘుకులేశ శరన్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో విడతల వారీగా తాము రూ.22 లక్షలు డ్యూటీ డాక్టర్ వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. అందుకు సంబంధించిన ఆధారాలను కూడా ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్‌కు ఇచ్చిన ఫిర్యాదుతో జత చేసినట్లు తెలిసింది. ప్రభుత్వం ఉచితంగా యాంటీ ఫంగల్ మందులను ఇస్తుంటే, ఇలా బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని సొమ్ము చేసుకోవడం దారుణమని, తమని మోసం చేసిన డ్యూటీ డాక్టర్‌పై చర్యలు తీసుకుని, ఆమె వెనుక ఉన్న సూత్రధారులపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ సీరియస్.. బ్లాక్ ఫంగస్ రోగి నుంచి రూ.22 లక్షలు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలపై జిల్లా జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఎల్.శివశంకర్ సీరియస్ అయినట్లు తెలిసింది. ఈ మేరకు ఆస్పత్రి అధికారులను తమ కార్యాలయానికి పిలిపించుకుని బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో పాటు, ఇతర వివరాలను సేకరించారు. కాగా ఈ విషయమై బాధితులు వారం కిందటే జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారికి ఫిర్యాదు చేసినా, దానిని ఆస్పత్రి అధికారులకు పంపకుండా వారి వద్దే ఉంచుకున్నట్లు తెలిసింది. ఇప్పుడు ఘటన వెలుగులోకి రావడంతో హడావుడిగా తమకు వచ్చిన ఫిర్యాదును ఆస్పత్రి అధికారులకు పంపారు. విచారణ జరుగుతోంది రోగి నుంచి రూ.22 లక్షలు తీసుకున్నట్లు వచ్చిన ఫిర్యాదుపై జేసీ నేతృత్వంలో విచారణ జరుపుతున్నాం. తమకు ఇచ్చిన ఫిర్యాదు వివరాలు మొత్తం జేసీకి ఇచ్చాము. రోగి ప్రభుత్వాస్పత్రి నుంచి వెళ్లిన తర్వాత ఇంటి వద్ద కూడా ఈ వైద్యురాలు చికిత్స చేసినట్లు తెలిసింది. అన్ని విషయాలు విచారణలో తేలుతాయి. – డాక్టర్ ఎం జగన్మోహనరావు, సూపరింటెండెంట్ -
నీట మునిగి 8 మంది దుర్మరణం
కవిటి/కొత్తపట్నం/పెనమలూరు: నాలుగు వేర్వేరు ఘటనల్లో 8 మంది యువకులు నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. సముద్రంలో మునిగి ఐదుగురు మృతిచెందగా, కృష్ణా నదిలో మునిగి ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఆదివారం జరిగిన ఈ ఘటనలు మృతుల కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. ముగ్గురిని మింగేసిన సుడిగుండం.. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలానికి చెందిన బొర్ర సాయిలోకేష్ పుట్టిన రోజు సందర్భంగా 15 మంది స్నేహితులు పుక్కళ్లపాలెం తీరం వద్ద సముద్ర స్నానానికి వెళ్లారు. అంతలో ఉవ్వెత్తున వచ్చిన కెరటం తాకిడిని తట్టుకోలేక నలుగురు యువకులు అక్కడే ఉన్న సుడిగుండంలో చిక్కుకుపోయారు. వారిని రక్షించేందుకు ఎవ్వరూ సాహసించలేకపోవడంతో మారిడి తిరుమల(21), బొర్ర మనోజ్(24), బొర్ర సాయిలోకేష్(20)లు ప్రాణాలు విడిచారు. కాసేపటికి వారి మృతదేహాలు ఒడ్డుకు చేరాయి. బొర్ర గోపీచంద్ ఆచూకీ లభించకపోవడంతో పోలీసులు గాలిస్తున్నారు. ఇద్దరి ఉసురు తీసిన అల ప్రకాశం జిల్లా ఒంగోలు గోపాల్‌నగరానికి చెందిన ఈర్ల సుజిత్(21), టంగుటూరు మండలం సర్వేరెడ్డిపాలేనికి చెందిన శనగపల్లి శ్రీనివాస్(21), పేర్నమిట్టకు చెందిన ఆకుల అనుదీప్, ఒంగోలుకు చెందిన షేక్ ఆలీష్‌లు పదో తరగతి చదివేప్పుడు స్నేహితులు. ప్రస్తుతం వివిధ కాలేజీల్లో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు. ఈ నలుగురూ కలిసి కొత్తపట్నం బీచ్‌కు వెళ్లారు. సముద్రంలోకి దిగి ఈర్ల సుజీత్, శనగపల్లి శ్రీనివాస్‌లు కొద్దిగా ముందుకెళ్లారు. ఒక్కసారిగా అల రావడంతో ఇద్దరూ లోనికి కొట్టుకుపోయారు. ఒడ్డునే ఉన్న అనుదీప్, ఆలీష్‌లు పెద్దగా కేకలు వేశారు. మత్స్యకారులు వారిని కాపాడేందుకు చేసిన ప్రయత్నం ఫలించలేదు. సుజీత్, శ్రీనివాస్‌లు శవాలై ఒడ్డుకు కొట్టుకొచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. ఊపిరి తీసిన ఊబి కృష్ణా జిల్లా తాడిగడప కార్మికనగర్‌కు చెందిన ఆటోడ్రైవర్ పోతార్లంక జయసాయిశ్రీనివాస్(25), గురునానక్ కాలనీకి చెందిన కె.గోవిందు(22) రామవరప్పాడు బల్లెంవారి వీధికి చెందిన కార్పెంటర్ కె.సతీష్(21), పటమట ఆటోనగర్‌కు చెందిన పొలగాని శివ(20)లు చేపలు పట్టేందుకు పెదపులిపాక ఘాట్ వద్ద కృష్ణా నదిలోకి దిగారు. జయసాయిశ్రీనివాస్, గోవిందు, సతీష్ నదిలోకి దిగగా, శివ ఒడ్డున కూర్చున్నాడు. నదిలోకి దిగిన కొద్ది సమయానికే ఊబిలో పడి ముగ్గురూ మునిగిపోయారు. ఫైర్ సిబ్బంది సాయంతో మూడు మృతదేహాలనూ వెలికి తీసి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆయా ఘటనల్లో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గోదావరిలో నలుగురు గల్లంతు పి.గన్నవరం: తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండలం ఎల్.గన్నవరం సమీపాన ఆదివారం గోదావరిలో స్నానానికి వెళ్లిన పదో తరగతి విద్యార్థులు బండారు నవీన్‌కుమార్ (15), యర్రంశెట్టి రత్నసాగర్ (15), పంతాల పవన్ (15), ఖండవిల్లి వినయ్ (15) గల్లంతయ్యారు. స్థానికులు, పోలీసులు వారికోసం గాలిస్తున్నారు. -
అంత్యక్రియలయ్యాక.. ఆమె తిరిగొచ్చింది
జగ్గయ్యపేట అర్బన్/లబ్బీపేట (విజయ వాడ తూర్పు): చనిపోయిందనుకున్న మనిషి కళ్లెదుట నిక్షేపంలా కనిపిస్తే ఎలా ఉంటుంది. ఒళ్లు జలదరిస్తుంది. సరిగ్గా ఇలాంటి అనుభవమే కృష్ణా జిల్లా జగ్గయ్యపేట క్రిస్టియన్‌పేట వాసులకు బుధవారం ఎదురైంది. అదే పేటకు చెందిన ముత్యాల గిరిజమ్మ కూరగాయల వ్యాపారం చేసేది. ఆమె భర్త ముత్యాల గడ్డయ్య కొలిమి పని చేసేవాడు. మానసికంగా అమాయకంగా ఉంటాడు. ఆ దంపతులకు రమేష్ (దావీదు) అనే కుమారుడు ఉన్నాడు. గత నెల 12న గిరిజమ్మ కరోనాతో విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చేరింది. అప్పటికే కరోనాతో ఆమె కుమారుడు దావీదు కూడా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. మే 15న గిరిజమ్మ చనిపోయిందని విజయవాడ ఆస్పత్రి సిబ్బంది ఓ మృతదేహాన్ని ప్యాక్ చేసి భర్త గడ్డయ్యకు అప్పగించారు. గడ్డయ్య మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అది గిరిజమ్మేనా కాదా అనేది గుర్తించలేకపోయాడు. బంధువులు మృతదేహం వద్దకు వెళ్లే సాహసం చేయలేకపోయారు. అనంతరం ఆ భౌతిక కాయానికి అంత్యక్రియలు పూర్తి చేయించారు. ఆ తర్వాత మే 23న కుమారుడు దావీదు కూడా చనిపోవడంతో గిరిజమ్మ, దావీదులకు కలిపి పెద్దకర్మను మే 31న నిర్వహించారు. నిక్షేపంగా ఆటోలో వచ్చింది విచిత్రంగా బుధవారం గిరిజమ్మ ఆటోలో నిక్షేపంగా ఇంటికి చేరింది. దీంతో స్థానికులు అవాక్కయ్యారు. తొలుత ఆమెను చూసి భీతిల్లారు. నింపాదిగా ఆమెతో మాట్లాడగా ఆస్పత్రి సిబ్బంది తనను బాగా చూసుకున్నారని, తాను పూర్తిగా కోలుకున్నానని, సిబ్బందే తనను జగ్గయ్యపేటకు ఆటోలో పంపారని గిరిజమ్మ వివరించింది. ఆమె ఇంకా బలహీనంగా ఉండటంతో కుమారుని మరణ వార్తను ఆమెకు చెప్పలేదు. కాగా, అంత్యక్రియలు పూర్తి చేసిన మృతదేహం ఎవరిదా అనేది స్థానికులకు అంతుబట్టడం లేదు. గిరిజమ్మ, దావీదుల జ్ఞాపకార్థం బంధువులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ మరో వార్డుకు మార్చడం వల్లే.. మే 12న ఆస్పత్రిలో చేరిన గిరిజమ్మను మెరుగైన వైద్యం కోసం సిబ్బంది మరో వార్డుకు మార్చారు. ఆ తర్వాత 15న గిరిజమ్మ భర్త గడ్డయ్య ఆస్పత్రికి వచ్చి భార్య కోసం ఆరా తీయగా.. తొలుత చేరిన బెడ్‌పై ఆమె లేదని అప్పుడు డ్యూటీలో ఉన్న సిబ్బంది సమాచారం ఇచ్చారు. దీంతో చనిపోయిందేమోనని భావించి గడ్డయ్య మార్చురీకి వెళ్లాడు. అక్కడ 60 ఏళ్ల మహిళ మృతదేహం ఉండటంతో అది గిరిజమ్మదేనేమో చూడాలని సిబ్బంది గడ్డయ్యకు సూచించారు. ఆ మృతదేహాన్ని చూసిన అతడు అది తన భార్యదేనని చెప్పి తీసుకెళ్లాడని ఆస్పత్రి సిబ్బంది చెబుతున్నారు. బంధువులు గుర్తిస్తేనే ఇస్తున్నాం మార్చురీలో మృతదేహాలను బంధువులు గుర్తించిన తర్వాతే అప్పగిస్తున్నాం. మృతదేహం తన భార్యదేనని గడ్డయ్య చెప్పడంతో ఇచ్చాం. ఆస్పత్రిలో మరో వార్డులో చికిత్స పొందుతున్న గిరిజమ్మను ఈ రోజు డిశ్చార్జ్ చేశాం. – డాక్టర్ ఎ.హనుమంతరావు, ఆర్ఎంవో -
పోలీసుల స్పందనతో 693 మందికి ఊపిరి
సాక్షి, అమరావతి/సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్ర పోలీసులు సకాలంలో.. వేగంగా స్పందించి 693 మందికి ఊపిరి అందేలా చేశారు. విజయవాడ గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రి (జీజీహెచ్)లో ఆక్సిజన్ విభాగంలో చికిత్స పొందుతున్న 693 మందికి ముప్పు తప్పించారు. ఆక్సిజన్ ట్యాంకర్‌ను వేగంగా రప్పించి వారిని ఆదుకున్నారు. ఈ ఆస్పత్రికి 18 టన్నుల ఆక్సిజన్‌తో ఒడిశాలోని జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ట్యాంకర్‌కు గురువారం అర్ధరాత్రి దాటాక ట్రాకింగ్ వ్యవస్థతో సంబంధాలు తెగిపోయాయి. ట్యాంకర్ సకాలంలో రాకపోతే ఆస్పత్రిలోని 693 మందికి ప్రాణాపాయమని కలవరపడిన వైద్యులు.. విజయవాడ నగర పోలీస్ కమిషనర్ బి.శ్రీనివాసులుకు సమాచారం అందించారు. వెంటనే ఆయన ఒడిశా నుంచి విజయవాడ వరకు అన్ని జిల్లాల ఎస్పీలను అప్రమత్తం చేశారు. ఒడిశా నుంచి వస్తున్న ఆక్సిజన్ ట్యాంకర్ తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు సమీపంలోని ధర్మవరం వద్ద ఓ దాబాలో ఉన్నట్టు ఆ జిల్లా పోలీసులు గుర్తించారు. ఇక్కడ ఎందుకు ఆపేశావని ట్యాంకర్ డ్రైవర్‌ను ప్రశ్నించారు. తాను బయలుదేరిన చోటునుంచి విజయవాడ దాదాపు 878 కిలోమీటర్ల దూరం ఉందని, ఏకధాటిగా డ్రైవింగ్ చేయడం వల్ల తీవ్రంగా అలసిపోయి ఆపినట్లు డ్రైవర్ తెలిపారు. అరక్షణం ఆలస్యం చేయకుండా మెరుపువేగంతో స్పందించిన పోలీసులు డ్రైవింగ్ అనుభవం ఉన్న హోంగార్డుతో ట్యాంకర్‌ను అక్కడి నుంచి విజయవాడకు పంపించారు. ఆ ట్యాంకర్ సకాలంలో విజయవాడ చేరుకునేలా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో పోలీసులు ప్రత్యేక బందోబస్తుతో గ్రీన్‌చానల్ ఏర్పాటు చేసి ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. ట్యాంకర్ విజయవాడ చేరుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సకాలంలో స్పందించి ఆక్సిజన్ ట్యాంకర్ వేగంగా వచ్చేలా చేసి వందలమంది ప్రాణాలు కాపాడిన పోలీసులకు సెల్యూట్ చేస్తున్నట్లు డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ చెప్పారు. రాష్ట్ర పోలీసులు కోవిడ్ ఆస్పత్రులకు సకాలంలో ఆక్సిజన్ అందేలా గ్రీన్ చానల్ ఏర్పాటు, ఎస్కార్ట్ వంటి సేవల్ని అందిస్తున్నారని అభినందించారు. -
ఏలూరులో పలువురికి అస్వస్థత
సాక్షి ప్రతినిధి, ఏలూరు/లబ్బీపేట (విజయవాడ తూర్పు): ఏలూరు నగరంలో పలువురు అస్వస్థతకు గురికావడం కలకలం రేపింది. ఒక్కసారిగా ఫిట్స్ రావడం, కిందపడిపోయి నోటి వెంట నురగలు కక్కడం వంటి లక్షణాలతో శనివారం అనేకమంది ఆస్పత్రుల పాలయ్యారు. మొదట దక్షిణపు వీధి, పడమర వీధిలో ప్రారంభమైన కేసులు ఆ తరువాత తూర్పు వీధి, కొత్తపేట, మాదేపల్లి రోడ్డులోని ప్రేమాలయం ప్రాంతం, కొబ్బరి తోట, అశోక్‌నగర్, గన్ బజార్, తంగెళ్లమూడి, మరడాని రంగారావు కాలనీ, వంగాయగూడెం, శనివారపు పేట వరకూ విస్తరించాయి. శనివారం మధ్యాహ్నం నుంచి రాత్రి 11.30 గంటలకు సుమారు 95 మందికి పైగా ఇలాంటి లక్షణాలతో ప్రభుత్వాస్పత్రిలో చేరారు. వీరిలో ఆరేళ్ల చిన్నారి ప్రభ పరిస్థితి విషమంగా ఉండటంతో విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. 95 మందిని ఆస్పత్రిలో చేర్చుకుని చికిత్స అందిస్తుండగా.. ఇప్పటివరకు 30 మంది వైద్య సేవల అనంతరం కోలుకోవడంతోడిశ్చార్జ్ చేశారు. మరికొందరు తమకూ సమస్య వచ్చిందనే అనుమానంతో ఆందోళనకు గురై ఆస్పత్రికి వచ్చారు. బాధితులను ఆస్పత్రికి తరలించడం కోసం 10 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. విషయం తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను అప్రమత్తం చేశారు. ఆ వెంటనే విజయవాడ నుంచి ఏలూరు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. అనంతరం బాధిత ప్రాంతాలలో పర్యటించి ప్రజలకు ధైర్యం చెప్పారు. వైద్యులు నిత్యం పర్యవేక్షించాలని, బాధితులకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని ప్రభుత్వాస్పత్రిలో బాధితుల కోసం ప్రత్యేకంగా వార్డును కేటాయించి చికిత్సకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని అనుక్షణం అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. జేసీ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్‌వో డాక్టర్ సునంద, వైద్యులు శ్రీనివాస్, విజయభాస్కర్‌తో మంత్రి సమీక్షించారు. అంతు చిక్కని వైనం ప్రజలు కళ్లు తిరిగి పడిపోవడం, ఫిట్స్ బారిన పడటానికి కారణం ఏమిటనేది ఇంకా తెలియరాలేదని వైద్యులు చెబుతున్నారు. సీటీ స్కాన్‌లో అందరికీ నార్మల్ రిపోర్టులు వస్తున్నాయని తెలిపారు, పూర్తిస్థాయి పరీక్షల అనంతరమే కారణం ఏమిటనేది నిర్ధారించగలమని పేర్కొంటున్నారు. ఇదిలావుండగా.. నగర వాసులకు అంతుచిక్కని వ్యాధి సోకుతోందనీ, తాగునీటి కాలుష్యమే ఇందుకు కారణమంటూ వార్తలు వ్యాప్తి చెందటంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. విజయవాడలో స్పెషల్ ఐసీయూ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని ఆదేశాలతో విజయవాడ జీజీహెచ్ వైద్యులు అప్రమత్తమయ్యారు. ఏలూరు నుంచి ఏ సమయంలో కేసులు వచ్చినా తక్షణమే మెరుగైన వైద్యం అందించేందుకు అప్పటికప్పుడు 30 పడకలతో ప్రత్యేక ఐసీయూను సిద్ధం చేశారు. వెంటిలేటర్లు, పల్స్ ఆక్సీమీటర్లు వంటివి కూడా అందుబాటులో ఉంచారు. 20 మంది నిపుణులతో కూడిన వైద్య బృందాన్ని 24 గంటలూ అందుబాటులో ఉండేలా నియమించారు. వారిలో జనరల్ మెడిసిన్, పల్మనాలజీ, క్రిటికల్ కేర్, పీడియాట్రిక్, న్యూరాలజీ నిపుణులు ఉన్నారు. బాధితులకు పరీక్షలు చేసేందుకు సీటీ స్కాన్, ఎంఆర్ఐ సిబ్బంది, రేడియాలజిస్ట్, ల్యాబ్ టెక్నీషియన్లను అందుబాటులో ఉంచారు. స్థిరంగా బాలిక ఆరోగ్యం ఏలూరు నుంచి తీసుకొచ్చిన ఆరేళ్ల చిన్నారి ప్రభను విజయవాడ పాత ప్రభుత్వాస్పత్రిలోని పీడియాట్రిక్ ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. బాలిక ఆరోగ్యం స్థిరంగా ఉన్నట్టు వైద్యులు చెప్పారు. ఆమెకు ఎందుకు అలా జరిగిందో తేలాల్సి ఉందని సూపరింటెండెంట్ శివశంకరరావు పేర్కొన్నారు. -
స్వైన్ ఫ్లూ, సార్స్ కన్నా ప్రమాదమేమి కాదు
సాక్షి, విజయవాడ : కరోనా వైరస్ గురించి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు. స్వైన్ ఫ్లూ, సార్స్ కన్నా ఇది ప్రమాదకరమైన వ్యాధి కాదని అన్నారు. సోమవారం విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య నిపుణులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్పతి సూపరిండెంట్ నాంచారయ్య మాట్లాడుతూ.. కరోనా వైరస్ వల్ల బాధితుడికి తొలుత జ్వరం లక్షణాలు వస్తాయని చెప్పారు. పేషెంట్‌కు కరోనా వల్ల జ్వరం పెరిగితే దాని ప్రభావం మెదడుపై ఉంటుందన్నారు. అందుకే ముందుగా జ్వరం నియంత్రించేందుకు పారాసిటమాల్ వాడుతూ.. తర్వాత యాంటీబయాటిక్ వాడతామని వివరించారు. ఈ వైరస్ నివారణకు ప్రపంచ ఆరోగ్య సంస్థ మందులను సూచించలేదని గుర్తుచేశారు. వ్యాధి లక్షణాలను బట్టి నిపుణులైన వైద్యులు మందులను వాడుతున్నారని చెప్పారు. పారాసిటమాల్ అనేది చాలా సేఫ్ డ్రగ్ అని.. అది కిడ్నీ మీద ఎటువంటి ప్రభావం చూపించదని తెలిపారు. అంతకు మించిన డ్రగ్స్ వాడితే అవి కిడ్నీలపై ప్రభావం చూపుతాయని అన్నారు. జ్వరానికి పారాసిటమాల్ సంజీవనిలా ఉపయోగపడుతుందని చెప్పారు. కరోనా వల్ల ప్రారంభమయ్యే జ్వరానికి కూడా ఇదే మందు చక్కగా పనిచేస్తుందన్నారు. కరోనా వైరస్ వల్ల ఏపీలో భయానక పరిస్థితులు లేవని వెల్లడించారు. ఇటలీ, దుబాయ్, మస్కట్ నుంచి విజయవాడ వచ్చినవారికి పరీక్షలు చేశామని తెలిపారు. కాకినాడ, ఒంగోలు నుంచి కరోనా పరీక్షల కోసం విజయవాడలోని వైరాలజీ ల్యాబ్‌కు శాంపిళ్లు వస్తున్నాయన్నారు. ఇక్కడ ముందుగా మూడు గంటల పరీక్షలో వైరస్‌ను గుర్తిస్తామని.. దానిని నిర్ధారించడానికి మరో మూడు గంటల సమయం పడుతుందని వివరించారు. విదేశాల నుంచి వచ్చిన 40 మందికి విజయవాడలో పరీక్షలు చేశామని తెలిపారు. వీరిలో ఎవరికీ పాజిటివ్ రాకపోవడంతో వారిని ఇళ్లకు పంపించామన్నారు. ఇంటివద్ద ఉన్న పేషెంట్‌ను ప్రతి రోజు ఆరోగ్య కార్యకర్తలు పరీక్షిస్తారని చెప్పారు. విజయవాడకు ఇప్పటివరకు ఒక్క పాజిటివ్ కేసు కూడా రాలేదని స్పష్టం చేశారు. ప్రభుత్వం పరంగా కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. విజయవాడ ఆస్పత్రిలో కరోనా బాధితులకు హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేశామన్నారు. వ్యాధి లక్షణాల లేకపోయినా అనుమానితులు ఇల్లు కదిలి వెళ్లకుండా ఉండాలని సూచిస్తున్నట్టు చెప్పారు. 28 రోజులపాటు జిల్లా వైద్యాధికారుల పర్యవేక్షణలో ఇంటి వద్దే ఉండేలా చూస్తున్నామని వివరించారు. యాభై ఏళ్లు పైబడినవారికి, రోగ నిరోధకత తక్కువగా ఉన్నవారికి, మధుమేహం ఉన్నవారికి కరోనా వైరస్ సోకడం ప్రమాదమని అన్నారు. మిగిలిన వారికి ఈ వైరస్ వల్ల అంతగా ప్రమాదం లేదని తెలిపారు. వైరస్ బాధితులకు పారాసిటామల్, యాంటీబయాటిక్ ఇవ్వడం వల్ల తీవ్రతను తగ్గించవచ్చని అన్నారు. విజయవాడ ఐసోలేషన్ వార్డులో 46 బెడ్లతో అత్యాధునిక ఐసీయూలను ఏర్పాటు ఏశామని అన్నారు. -
నాకొద్దు ఈ పెద్దకొడుకు!
సాక్షి, విజయవాడ : విజయవాడ ప్రభుత్వాసుపత్రి సమీపంలో యాచిస్తున్న ఈ వృద్ధురాలి పేరు బత్తుల అనువాయమ్మ. ఆమె చేతి సంచిని ఒకసారి గమనించండి. చంద్రబాబు ఫొటోతో పాటు ‘పెన్షన్ పెద్దకొడుకు’ అని దానిపై ఉంది. ఆ సంచిపై ఏముందో కూడా నిజానికి ఆమెకు తెలియదు. రోజూ యాచన కోసం ఆ చేతి సంచినే వాడుతుంది. ఇబ్రహీంపట్నం సమీపంలోని అడ్డరోడ్డు వద్ద నివసిస్తున్న అనువాయమ్మను ‘సాక్షి’ పలకరించింది. వృద్ధాప్య పింఛన్ వస్తుందా? అని అడగ్గా.. పింఛన్ కోసం ఎన్నిసార్లు తిరిగినా టీడీపీ ప్రభుత్వం కనికరించలేదని వాపోయింది. ఆ సంచిపై ఏముందో ఆమెకు చెప్పగా.. ‘ప్రచారానికి మాత్రమే ఆయన పెద్ద కొడుకు.. అలాంటి పెద్దకొడుకు నా కొద్దు’ అంది. -
త్వరలోనే బాలుడిని గుర్తిస్తాం : సీఐ
విజయవాడ: బెజవాడ ప్రభుత్వాసుపత్రిలో అదృశ్యమైన బాలుడిని త్వరలోనే గుర్తిస్తామని గవర్నర్‌పేట సీఐ పవన్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఈ కేసు విషయంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ...దర్యాప్తులో ఎవరినైనా అనుమానితులుగానే పేర్కొంటామన్నారు. దర్యాప్తు జరిగే క్రమంలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతాయని సీఐ చెప్పారు. ఎవరిని ఉద్దేశపూర్వకంగా దోషులుగా చూపించే ప్రయత్నం చేయలేదని వివరణ ఇచ్చారు. అదృశ్యమైన బాలుడి కోసం దర్యాప్తు కొనసాగుతూనే ఉందన్నారు. కొన్నిసార్లు దర్యాప్తులో నిర్దోషులుంటే వారిని తొలగించుకుంటూ దర్యాప్తును ముందుకు తీసుకెళ్తామని సీఐ పవన్‌కుమార్‌రెడ్డి చెప్పారు. -
బాబు అదృశ్యం కేసులో ట్విస్టులు కంటిన్యూ
విజయవాడ: బెజవాడ ప్రభుత్వాసుపత్రిలో ఐదు రోజుల పసికందు అదృశ్యం కేసులో పోలీసులకు ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు ఎదురవుతున్నాయి. నెహ్రూ బస్టాండ్‌లోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా బాబు అదృశ్యానికి సంబంధించిన అనుమానితుల దృశ్యాలను పోలీసులు హడావుడిగా విడుదల చేశారు. దీంతో ఆ దృశ్యాల్లో ఉన్న మహిళ శుక్రవారం పోలీసులను ఆశ్రయించడంతో కంగుతిన్నారు. పోలీసులు తమ తప్పును కప్పిపుచ్చుకునే పనిలో పడ్డారు. గుంటూరుకు చెందిన ధాన్యశబరి అనే మహిళ శుక్రవారం విజయవాడ పోలీసులను ఆశ్రయించారు. బాబు కిడ్నాప్‌తో మాకెలాంటి సంబంధం లేదని... ఫిబ్రవరి 27న గుంటూరు ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చానని చెప్పారు. నిందితులను నిర్థారించుకోకుండా పోలీసులు ఫోటోలను ఏ విధంగా విడుదల చేస్తారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పరువు గల కుటుంబాన్ని రోడ్డుకీడ్చారని, సంబంధిత పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని ధాన్యశబరి డిమాండ్ చేశారు. ధాన్యశబరి వాదనతో పోలీసులు విభేదిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ఉన్న వారు, పోలీసులను ఆశ్రయించిన వారు ఒక్కరు కాదని పోలీసులు చెబుతున్నారు. గురువారం విడుదల దృశ్యాలకు కట్టుబడి ఉన్నామని.. ఆ దృశ్యాల్లో ఉన్న వారే బాబుని కిడ్నాప్ చేసి ఉంటారని చెబుతున్నారు. గుంటూరుకు చెందిన మహిళలు మీడియా ముందుకు వచ్చిన వారు ఎందుకు వచ్చారో తెలియదంటున్నారు. బాబు ఆచూకీ కోసం ఆరు బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. అదృశ్యమైన చిన్నారి బంధువులు ప్రభుత్వాసుపత్రి వద్ద ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బాబు అదృశ్యం కేసులో నిందితులను పట్టుకోక పోవడంపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ప్రభుత్వాస్పత్రి సిబ్బంది పాత్ర ఉందని ఆరోపిస్తున్నారు. -
ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఘెరావ్
విజయవాడ: విజయవాడలో ప్రభుత్వాసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంగా కారణంగా చీమలు కుట్టి నాలుగు రోజుల పసికందు మరణించడంపై ప్రజా సంఘాలు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పరామర్శించేందుకు వచ్చిన ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌ను ఘెరావ్ చేశారు. ఎమ్మెల్యే డౌన్, డౌన్.. గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఆస్పత్రిలో సౌకర్యాలు కల్పించకుండా పరామర్శకు వస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆస్పత్రి వద్ద ప్రజా సంఘాలు, మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత ఏర్పడింది. పసికందు మృతికి వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ బాధ్యత వహించి, మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. -
ఆస్పత్రిలో చీమలు కుట్టి.. పసికందు మృతి
మొన్నామధ్య గుంటూరు ప్రభుత్వాస్పత్రిలో ఎలుకలు కరిచి 21 రోజుల బాలుడు మరణించగా.. ఇప్పుడు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చీమలు కుట్టి నాలుగు రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయాడు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని పిల్లల విభాగంలో లక్ష్మి అనే మహిళకు నాలుగు రోజుల క్రితం సిజేరియన్ ఆపరేషన్ చేశారు. పండంటి మగబిడ్డ పుట్టడంతో అందరూ సంతోషించారు. కానీ సోమవారం తెల్లవారుజామున లేచి చూడగా.. శిశువు ఛాతీ, వీపు భాగాల్లో చీమలు కుట్టి తీవ్ర రక్తస్రావం జరిగింది. అప్పటికే శిశువు మరణించాడు. గుంటూరు జిల్లా పెనుమాక గ్రామానికి చెందిన అంజయ్య ఆటోడ్రైవర్‌గా పనిచేస్తాడు. అతడి భార్య లక్ష్మికి నెలలు నిండటంతో, ప్రభుత్వాస్పత్రిలో అయితే క్షేమంగా ప్రసవం జరుగుతుందని విజయవాడ తీసుకొచ్చారు. కానీ నాలుగు రోజుల తర్వాత తెల్లారి లేచి చూసేసరికి బాబు చనిపోయి ఉన్నాడని వాపోతున్నారు. పిల్లాడిని మొత్తం చీమలు కుట్టినట్లు స్పష్టంగా కనిపిస్తున్నా వైద్యులు మాత్రం తమ బాధ్యత నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. గుండె, ఊపిరితిత్తుల సమస్య ఉందని, అందుకే మరణించాడని వైద్యులు చెబుతున్నారు. తెల్లవారి 5.40 గంటలకు కూడా బిడ్డ బతికే ఉన్నాడని, తర్వాతే ఇదంతా జరిగిందని బాధితుల బంధువులు అంటున్నారు. అయితే ఆ తర్వాత బాలుడి తరఫు వాళ్లే అతడిని తీసుకెళ్లారని, అందువల్ల ఈ మరణంతో తమకు సంబంధం లేదని డాక్టర్ అన్నారు. వార్డులో మిగిలిన పిల్లలను చీమలు ఎందుకు కుట్టలేదని ఎదురు ప్రశ్నించారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేత పార్థసారథి తీవ్రంగా మండిపడ్డారు. కావాలని బాలుడి బంధువులే తీసుకెళ్లి చీమల పుట్టలో పడుకోబెడతారా అని వైద్యులను ప్రశ్నించారు. పార్టీ నాయకుడు నివాస్‌రెడ్డితో కలిసి ప్రభుత్వాస్పత్రి వద్దకు వెళ్లిన పార్థసారథి.. ఈ వ్యవహారంపై నిలదీశారు. -
కుక్క ఉన్నది జాగ్రత్త
* ఏపీ, తెలంగాణలో పెరిగిపోతున్న కుక్క కాట్లు * అందుబాటులో లేని యాంటీరేబిస్ వ్యాక్సిన్ * పాము కాటు బాధితులు ఎనిమిది వేలు * ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇదే పరిస్థితి * విజయవాడ పెద్దాసుపత్రిలోనూ చికిత్స కరువు * మంత్రి సమక్షంలో వెల్లడైన చేదు నిజం సాక్షి, హైదరాబాద్: వీధి కుక్కల వీరంగంతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు వణికిపోతున్నారు. కుక్కకాట్లలో దేశంలోనే తెలంగాణ రెండో స్థానంలో ఉందంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. వీటి కాటుకు గురయ్యే వారు, మరణాల సంఖ్య ఇరు రాష్ట్రాల్లోనూ ఏడాదికేడాది పెరుగుతోంది. గ్రామాల్లో, పట్టణాల్లో రాత్రి, పగలు అనే తేడా లేకుండా బైకులపై, సైకిళ్లపై వెళ్లే వారితోపాటు పాదచారులనూ వదలడంలేదు. పిల్లలపై దాడులు మరింత అధికమయ్యాయి. ప్రభుత్వాసుపత్రుల్లో కుక్కకాటుకు వైద్యం అందడం లేదు. యాంటీరేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేక అనేక మంది మృత్యువాతపడుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ పెద్దాసుపత్రిలోనే చికిత్స లభించకపోవడం పరిస్థితికి అద్దంపడుతోంది. మరోవైపు రెండు రాష్ట్రాల్లోనూ పాముకాట్లు విపరీతంగా పెరిగిపోయాయి. గ్రామాల్లో రాత్రివేళ వీధిలైట్లు వెలగకపోవడం, చీకట్లో రైతులు పంటలకు వెళ్లాల్సిరావడం, మరుగుదొడ్లు లేక రాత్రివేళ ఆరుబయటకు వెళ్లడంవల్ల అనేకమంది పాముకాట్లకు గురై చనిపోతున్నారు. 11 నెలల్లో కుక్కకాట్లు 1.63 లక్షలు... పాముకాట్లు 8,215 తెలంగాణలో ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ వరకు 11 నెలల కాలంలో 1,63,726 కుక్కకాటు బాధిత కేసులు నమోదు అయ్యాయి. ఈ సంఖ్య అంతకుముందు సంవత్సరాల కంటే అత్యధికమని అధికారులు చెబుతున్నారు. నల్లగొండ జిల్లాలో ఎక్కువగా 32,793 కేసులు, మహబూబ్‌నగర్ జిల్లాలో 24,177 కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ నెలల్లో పాముకాట్ల కేసులు రాష్ట్ర వ్యాప్తంగా 8,215 నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 1,899 పాముకాట్లు సంభవించగా, మెదక్ జిల్లాలో 1,325 కేసులు నమోదై రెండోస్థానంలో నిలిచింది. మరణాలను రికార్డు చేయడంలో ప్రభుత్వ శాఖలు విఫలమయ్యాయని పలువురు ఆరోపిస్తున్నారు. జిల్లా కేంద్రాల వరకే కుక్క, పాముకాటు మందులను తక్కువమోతాదులో సరఫరా చేసి చేతులు దులుపుకుంటున్నారు. దీంతో ఆసుపత్రుల్లో మందులు లేక ఈ కాట్లకు గురైన వారు సరైన చికిత్స అందక మరణిస్తున్నారు. అయితే, కుక్కలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయకపోవడం వల్ల వాటిసంఖ్య అనూహ్యంగా పెరిగిందని, దీనికి స్థానిక సంస్థలే కారణమని ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అంటోంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇదే పరిస్థితి.... రాష్ర్టంలో కుక్క, పాము కాటుకు గురైన బాధితుల పరిస్థితి ఘోరంగా ఉంది. గత రెండేళ్లలో 500 మందికి పైగా పాముకాటుతో మృతి చెందారు. ఏటా 15 లక్షల మంది కుక్క కాటు బారినపడుతున్నట్లు అంచనా. పెద్దాసుపత్రుల్లోనే యాంటీ రేబిస్ వ్యాక్సిన్లకు కొరత ఏర్పడింది. విజయవాడ పెద్దాసుపత్రిలోనే కుక్క కాటు బాధితులకు యాంటీరేబిస్ వ్యాక్సిన్ అందుబాటులో లేక గుంటూరు ఆసుపత్రికి వెళ్లమని చెబుతున్నారు. కుక్క కాటుకు గురైన ఓ బాలుడిని విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో యాంటి రేబిస్ టీకా లేకపోవటంతో గుంటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించటాన్ని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాసరావు ఆదివారం స్వయంగా చూశారు. ఇక్కడే ఇలా ఉంటే ఇక జిల్లా ఆస్పత్రులు, ఏరియా ఆసుపత్రుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. కుక్కకాట్లు పెరిగాయి తెలంగాణలో గతంలో కంటే కుక్కకాట్లు పెరిగిన మాట వాస్తవమే. కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయాల్సిన బాధ్యత స్థానిక సంస్థలు, మున్సిపాలిటీలదే. గతంలో కుక్క కరిస్తే బొడ్డు చుట్టూ ఇంజెక్షన్లు వేసేవారు. ఇప్పుడా అవసరం లేదు. సాధారణ ఇంజక్షన్ల మాదిరిగా వేయించుకొని రావచ్చు. ప్రభుత్వం వాటిని ఉచితంగా సరఫరా చేస్తుంది. - డాక్టర్ సాంబశివరావు, డెరైక్టర్, ప్రజారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మందులకు కొరత లేదు ‘ఏపీలో ఏఆర్వీ, ఏఎస్వీ మందులకు కొరత లేదు. 1.29 లక్షల వయెల్స్ ఏఆర్వీ సిద్ధంగా ఉంది. పాముకాటు మందు కూడా అందుబాటులో ఉంది. కుక్కలు ముఖానికి దగ్గరగా కరచినప్పుడు ఏఆర్వీతో పాటు రేబిస్ ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్ ఇవ్వాలి. అది మాత్రమే అందుబాటులో లేదు’ - ఎం.రవిచంద్ర (ఏపీ మౌలిక వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ) -
వైద్యులపై మంత్రి కామినేని ఆగ్రహం
విజయవాడ : విజవాడ విద్యాధరపురంలోని కబేళా సెంటర్లో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. ఓ అయిదేళ్ల బాలుడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. చికిత్స కోసం బాలుడి తల్లిదండ్రులు బెజవాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకు వెళ్లారు. అయితే, తమ వద్ద కుక్కకాటుకు వ్యాక్సిన్ అందుబాటులో లేదని బాలుడుని గుంటూరుకు తీసుకెళ్ళమని వైద్యులు సూచించారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో మంత్రి కామినేని శ్రీనివాస్ ప్రభుత్వాసుపత్రికి చేరుకుని, వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనకు బాధ్యులైన ఇద్దరు వైద్యులకు ఛార్జ్ మెమో ఇచ్చారు. అలాగే చంద్రశేఖర్ అనే వైద్యుడిని సస్పెండ్ చేశారు. ప్రభుత్వాసుపత్రిలో వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై ఆయన మండిపడ్డారు. మరోవైపు కాబోయే రాజధానిలోని ప్రభుత్వాసుపత్రిలో కుక్కకాటుకు వ్యాక్సిన్ లేకపోవడంపై విపక్ష నేతలు మండిపడ్డారు. బాధ్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవడం బాగానే ఉన్నా.. ఇంత పెద్ద ఆసుపత్రిలో మందుల కొరతకు మంత్రితో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.