ఆపరేషన్ జరిగిన వృద్ధురాలితో కలిసి మీడియాతో మాట్లాడుతున్న సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్
లబ్బీపేట (విజయవాడ తూర్పు): అత్యంత క్లిష్టమైన శస్త్రచికిత్సను విజయవాడ ప్రభుత్వాస్పత్రి వైద్యులు విజయవంతంగా చేశారు. జనరల్ సర్జరీ ప్రొఫెసర్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ యేకుల కిరణ్‌కుమార్, ఇతర వైద్యులు ఈనెల 9న నాలుగు గంటలు శ్రమించి 65 ఏళ్ల వృద్ధురాలు శివపూర్ణమ్మ మెడలోని క్యాన్సర్ గడ్డను తొలగించారు. ఆమె కోలుకోవడంతో మంగళవారం డిశ్చార్జి చేశారు. ప్రభుత్వాస్పత్రిలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్ ఈ వివరాలు తెలిపారు. ఆయన తెలిపిన మేరకు.. కృష్ణాజిల్లా గన్నవరానికి చెందిన శివపూర్ణమ్మ మెడలో కణితితో బాధపడుతూ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లగా క్యాన్సర్ కణితి అని తేలింది. దీంతో ఆమె ప్రభుత్వాస్పత్రికి వచ్చింది.
రక్తనాళాలు, గొంతు నరాలకు హానికలగకుండా ఆమెకు శస్త్రచికిత్స చేసి క్యాన్సర్ కణితిని, దాని చుట్టూ ఉండే శోషరస గ్రంధులను తొలగించారు. పోస్ట్ ఆపరేటివ్ జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు, ఆమె శరీరంలో క్యాల్షియం తగ్గడాన్ని గుర్తించి వైద్యం చేశారు. ప్రస్తుతం ఆమెకు రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్ కిరణ్‌కుమార్ చెప్పారు. శస్త్రచికిత్సను విజయవంతంగా చేయడంలో అనస్థీషియా విభాగాధిపతి డాక్టర్ టి.సూర్యశ్రీ, వారి బృందం, సర్జరీ వైద్యులు డాక్టర్ చందనాప్రియాంక, డాక్టర్ ఉష, డాక్టర్ గాయత్రిల కృషి ఉన్నట్లు తెలిపారు.
ప్రభుత్వాస్పత్రిలో క్యాన్సర్ క్లినిక్
ప్రభుత్వాస్పత్రికి అనుబంధంగా గుంటూరు జిల్లా చినకాకానిలో ఉన్న క్యాన్సర్ ఆస్పత్రి వైద్యులతో విజయవాడ కొత్త ప్రభుత్వాస్పత్రిలో క్యాన్సర్ క్లినిక్‌ను త్వరలో ప్రారంభించనున్నట్లు సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్‌కుమార్ తెలిపారు. అక్కడ ముగ్గురు క్యాన్సర్ నిపుణులు ఉన్నారని, వారు వచ్చి ఇక్కడ వైద్యపరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి కీమో సేవలు అందిస్తారని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment