విజయవాడ భవానీపురానికి చెందిన 42 ఏళ్ల వ్యాపారి శ్రీనివాస్(పేరు మార్చాం) అర్ధరాత్రి వరకూ బిజినెస్ వ్యవహారాలు చూస్తుంటారు. అనంతరం తరచూ స్నేహితులతో కలిసి బయట ఎక్కువగా నాన్‌వెజ్ వంటకాలు తింటుంటారు. ఇటీవల తరచూ కడుపునొప్పి రావడం, అరుగుదల తగ్గడంతో వైద్యుడి వద్దకు వెళ్లారు. వైద్యులు పరీక్షించి జీర్ణాశయ క్యాన్సర్‌గా నిర్ధారించారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామకు చెందిన ఓ ఉద్యోగి వారంలో నాలుగు రోజులు బయట హోటళ్లలో భోజనం చేస్తుంటాడు. నాన్‌వెజ్, బిర్యానీలు ఎక్కువగా తీసుకుంటుంటాడు. ఇటీవల ఆయనకు కడుపు నొప్పితో పాటు విరేచనంలో రక్తం పడటంతో వైద్యుడిని సంప్రదించాడు. పెద్ద పేగు క్యాన్సర్‌గా నిర్ధారణ అయింది. ఇలా వీరిద్దరే కాదు.. కల్తీ ఆహారం కారణంగా ఇటీవల పెద్దపేగు, జీర్ణాశయ, లివర్ క్యాన్సర్ కేసులు పెరుగుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఆహారంలో కల్తీ, జీవనశైలి మార్పులు క్యాన్సర్‌కు దారితీస్తున్నాయి. ఇటీవల నమోదవుతున్న క్యాన్సర్ కేసులు వైద్యులను సైతం ఆందోళనకు గురిచేస్తున్నాయి. మధ్య వయస్సులోనే అన్నవాహిక క్యాన్సర్, జీర్ణాశయ, పెద్దపేగు, గర్భాశయ క్యాన్సర్ల బారిన పడుతున్నారు. అర్ధరాత్రి దాటాక కూడా రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టుల్లో బిర్యానీల వంటివి ఎక్కువగా తీసుకోవడంతో పలువురికి జీర్ణాశయ వ్యాధులు మొదలై.. అనంతరం క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి.
సమయ పాలన లేని ఆహారపు అలవాట్లు కొంపముంచుతున్నాయి. ఇటీవల నగరంలో నమోదవుతున్న క్యాన్సర్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. నాలుగు పదుల వయస్సులోనే జీర్ణాశయ, పెద్దపేగు, లివర్ క్యాన్సర్ సోకుతున్నట్టు చెబుతున్నారు. అప్రమత్తం కాకుంటే రానున్న కాలంలో పెను ముప్పు పొంచి ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
కొంపముంచుతున్న కల్తీలు
నాన్‌వెజ్ వంటకాలు ఆకర్షణీయంగా కనిపించేందుకు రసాయనాలు కలిసిన కారంపొడులను ఎక్కువగా వాడుతుంటారు. అంతేకాకుండా కొన్ని చోట్ల మృత జంతువుల కొవ్వు నుంచి తయారు చేసిన కల్తీ నూనెలను వినియోగించి వంటలు చేస్తుండటంతో జీర్ణకోశ వ్యాధులు పెరుగుతున్నాయని చెపుతున్నారు.
కల్తీ ఆహారం జీర్ణకోశ, పెద్దపేగు, అన్నవాహిక క్యాన్సర్లకు కారణమవుతోందని, బయట ఆహారం తినడం సాధ్యమైనంత తగ్గించడం ఉత్తమమని వైద్యులు చెబుతున్నారు. మహిళల్లో ఒకప్పుడు బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదయ్యేవి. ప్రస్తుతం సర్వైకల్ క్యాన్సర్ కేసులు తగ్గగా.. జీవనశైలి కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు.
అలాగే గర్భాశయ క్యాన్సర్ కేసులూ పెరుగుతున్నాయని చెబుతున్నారు. శారీరక శ్రమ లేకపోవడం, ఒబెసిటీ కారణంగా పట్టణవాసులు ఎక్కువగా గర్భాశయ క్యాన్సర్ల బారినపడుతున్నారని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అత్యవసరమైతేనే బయట తినాలి
ఇటీవల జీర్ణాశయ, పెద్ద పేగు క్యాన్సర్లు పెరిగాయి. కల్తీ ఆహారం, నాన్‌వెజ్ ఎక్కువుగా తీసుకోవడమే దీనికి కారణంగా చెప్పొచ్చు. ఆహార పదార్థాలు కల్తీ అవుతున్న నేపథ్యంలో అత్యవసరమైతేనే బయట తినాలి. మాంసాహారంలో కలిపే రసాయనిక రంగులు క్యాన్సర్‌కు దారి తీస్తున్నాయి.
– డాక్టర్ ఏవై రావు, క్యాన్సర్ వైద్య నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment