ప్రభుత్వాస్పత్రిలో ఆరుద్ర నుంచి వివరాలు తెలుసుకుంటున్న కలెక్టర్ డిల్లీరావు, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ, సీపీ కాంతిరాణా టాటా
లబ్బీపేట(విజయవాడతూర్పు): తన కుమార్తె వైద్య ఖర్చుల కోసం ఏనాడు ప్రభుత్వాన్ని సాయం కోరలేదని, ముఖ్యమంత్రిని కలవలేక పోతున్నాననే ఆవేదన, క్షణికావేశంలో మాత్రమే చేతికి గాయం చేసుకున్నట్లు కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలేనికి చెందిన ఆరుద్ర తనను కలిసిన ఉన్నతాధికారులకు తెలిపారు.
గుంటూరు జిల్లా తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయం సమీపాన తన చేతికి గాయం చేసుకుని విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న రాజులపూడి ఆరుద్రను సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు గురువారం ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి ఎం.హరికృష్ణ, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు, సీపీ కాంతి రాణా టాటా పరామర్శించారు. ఆరుద్ర, ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితి, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం న్యాయం చేస్తుందని ధైర్యంగా ఉండాలని సీఎం చెప్పారని, ఆయన ఆదేశాల మేరకే తాము వచ్చినట్లు తెలిపారు. కాగా నిస్సహాయురాలైన ఓ మహిళ తన సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడంకోసం ప్రయత్నిస్తే ఆ ఉదంతాన్ని కూడా రాజకీయంగా ఉపయోగించుకోవడానికి ఎల్లో మీడియా ప్రయత్నించడం చూసి జనం విస్తుపోతున్నారు. ఆరుద్రను కలసిన అనంతరం కలెక్టర్ డిల్లీరావు మాట్లాడుతూ ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగ్గా ఉందని చెప్పారు.
ఆరుద్ర కుమార్తె సాయి లక్ష్మికి మూడు నెలల వయసులోనే స్పైనల్ వ్యాధికి ఆపరేషన్ జరిగిందని, కొంతకాలం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉన్నా, తర్వాత తిరిగి అనారోగ్యానికి గురవడంతో వెల్లూరు, లక్నో వంటి అనేక ప్రాంతాల్లో వైద్యం చేసినా మెరుగుపడలేదన్నారు. అమెరికాలో అధునాతన వైద్యం చేయిస్తే కోలుకోవచ్చని కొందరు వైద్యులు చెప్పినట్లు తెలిపారు.
కుమార్తె వైద్య ఖర్చుల కోసం అమలాపురంలో ఉన్న తమ ఆస్తులను రూ.62 లక్షలకు విక్రయించినట్లు ఆరుద్ర చెప్పారని కలెక్టర్ పేర్కొన్నారు. శంఖవరం మండలం అన్నవరంలోని తన ఇంటిని అమ్మడానికి ప్రయత్నిస్తే ఇరువైపులా ఉన్న కానిస్టేబుళ్లు శివయ్య, కన్నయ్య, ముత్యాలరావులు అడ్డుపడటమే కాకుండా, న్యాయపరమైన చిక్కులు సృష్టించారని, వారిపై 2020లో జిల్లా ఎస్పీకి, ఆ తర్వాత కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, చర్యలు తీసుకున్నారని తెలిపినట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో తన కుమార్తెకు విదేశాల్లో వైద్యం అందించలేక పోతున్నాననే బాధతో సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని ప్రయత్నించినట్లు ఆరుద్ర తెలిపారని పేర్కొన్నారు. గత నెల 31న ఎ–కన్వెన్షన్ హాలు వద్ద సీఎంను కలిసేందుకు ప్రయత్నించగా, భద్రతా కారణాల వలన పోలీసులు అనుమతించలేదన్నారు.
ఈ నెల 2న కుమార్తెతో కలిసి సీఎం క్యాంపు కార్యాలయానికి చేరుకుని అధికారులను కలవగా, సమస్య కోర్టు పరిధిలో ఉందని, పౌర సమస్యలను స్థానికంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారని ఆమె తెలిపినట్లు కలెక్టర్ పేర్కొన్నారు.
ముఖ్యమంత్రిని కలవలేక పోయాననే మనస్తాపంతోనే ఆవేశంలో చేతికి గాయం చేసుకున్నానని ఆరుద్ర వివరించిందని తెలిపారు. కుమార్తె అనారోగ్యం వల్ల 2018లో గ్రూప్–2 ఉద్యోగానికి ఎంపికైనా చేరలేక పోయానని, తన ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మానవతా దృక్ఫథంతో మరొకసారి అవకాశం కల్పించాలని ఆరుద్ర కోరినట్లు కలెక్టర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment