
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచార ఘటనను చంద్రబాబు నీచ రాజకీయానికి వాడుకుంటున్నారని హోంమంత్రి తానేటి వనిత మండిపడ్డారు. రాజమహేంద్రవరంలో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు బాధితురాలి వివరాలు బహిర్గతం చేయరాదని చట్టాలున్నా చంద్రబాబు ప్రచారం కోసం మీడియా ముందు అన్నీ బహిర్గతం చేయడం దారుణమన్నారు.
ఈ కేసులో నిందితుల్ని మూడు గంటల్లోనే పట్టుకున్నట్లు గుర్తుచేశారు. బాధితురాలికి ప్రభుత్వం తరఫున రూ.10 లక్షల పరిహారం అందజేశామన్నారు. ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కోసం సిఫార్సు చేశామని, ఇంటిస్థలాన్ని, ఇంటిని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎంపీ భరత్‌రామ్ మాట్లాడుతూ దిశ చట్టానికి కేంద్ర మహిళా మంత్రిత్వశాఖ సానుకూలంగా స్పందించి, హోంశాఖకు సిఫార్సు చేసిందని తెలిపారు.