సాక్షి ప్రతినిధి, ఏలూరు/సాక్షి, అమరావతి: ఏలూరు నగరంలో అస్వస్థతకు గురైన బాధితులకు సత్వరమే మెరుగైన వైద్య చికిత్స అందించటం, ఆస్పత్రిలో సౌకర్యాలు, వైద్యుల నిరంతర పర్యవేక్షణ ఉండేలా పటిష్ట చర్యలు చేపట్టాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బాధితుల ఆరోగ్య పరిస్థితి, పరీక్షల నివేదికలపై మంగళవారం ఆయన ఆరా తీ«శారు. ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానితో పాటు వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు చెందిన వైద్య బృందాలు నిర్వహించిన పరీక్షల వివరాలను అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఏలూరు నగరంలో ఎయిమ్స్ వైద్య నిపుణుల బృందం నిర్వహించిన పరీక్షల్లో సీసం, నికెల్ వంటి మూలకాలు ఉన్నట్లు గుర్తించారని, మరిన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారని, పరీక్ష రిపోర్టులు రావాల్సి ఉందని సీఎంకు వివరించారు.
అధిక సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్న ప్రాంతాల్లో తాగునీరు, పాలు తదితర పరీక్షలకు సంబంధించి తుది ఫలితాల నివేదికను తనకు అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. ప్రాథమిక పరీక్షల్లో వెల్లడైన అంశాల మేరకు సీసం, నికెల్ లాంటి మూలకాలు ఆ ప్రాంతంలోని ప్రజల శరీరాల్లోకి ఏ విధంగా చేరాయో.. వాటికి కారణాలు ఏమిటో? పూర్తి స్థాయిలో పరిశోధన చేసి నివేదిక ఇవ్వాలన్నారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించి ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. అనారోగ్యానికి సంబంధించిన కారణాలు తెలుసుకునేందుకు నిశితంగా పరిశీలన చేయాలని, అధ్యయనం చేయటం ద్వారా అస్వస్థతకు దారితీసిన కారణాలు గుర్తించవచ్చన్నారు.
ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో బాధితులకు అందిస్తున్న వైద్య చికిత్సలు, సేవలపై ఆరా తీశారు. బాధితులకు మెరుగైన సదుపాయాలు కల్పించి వైద్య సేవలు కొనసాగించాలని, ఎక్కడా ప్రజలు ఇబ్బందులు పడకుండా ముందస్తు ప్రణాళికతో పని చేయాలని సూచించారు. బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏలూరు నగరంలోని పరిస్థితిని సమీక్షిస్తానని, అప్పటికి పూర్తి స్థాయి నివేదికలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.
ఏలూరులో పరిస్థితిపై గవర్నర్ ఆరా
ఏలూరులో అంతుచిక్కని రీతిలో ప్రజలు అస్వస్థతకు గురవుతున్న విషయమై రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో మాట్లాడారు. మంగళవారం ఆయన వైఎస్ జగన్‌కు ఫోన్ చేసి ఏలూరు ఘటన, తదనంతర పరిస్థితిపై ఆరా తీశారు. ఆస్పత్రిలో చేరిన వారందికీ పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తున్నామని, అత్యవసర వైద్యం అవసరమైన వారిని తక్షణం విజయవాడ తరలిస్తున్నామని సీఎం చెప్పారు. వ్యాధి మూలాలను తెలుసుకునేందుకు జాతీయ స్థాయి వైద్య పరిశోధనా సంస్థల సహకారం తీసుకుంటున్నామని కూడా వివరించారు. ఎయిమ్స్, ఐఐసీటీ, సీసీఎంబీ, ఎన్‌ఐఎన్ వంటి ప్రముఖ సంస్థలు బాధితుల రక్త నమూనాలతోపాటు ఇతర నమూనాలు సేకరించి పరిశీలిస్తున్నాయని సీఎం గవర్నర్‌కు తెలిపారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment