సాక్షి,తాడేపల్లి: రాష్ట్రంలో కరోనా నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం చేపట్టారు. కరోనా నివారణకు సంబంధించి ముఖ్యమంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ అదిత్యానాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ''కోవిడ్ ఆస్పత్రుల్లో రోగులకు ఏలోటూ లేకుండా చూడాలి. ఆరోగ్యశ్రీ కింద ఎక్కువ మంది రోగులు చికిత్స పొందుతున్నారు. వారికి వైద్య సేవల్లో ఏ మాత్రం లోపం ఉండకూడదు. బ్లాక్ ఫంగస్ రోగులకు అవసరమైన ఇంజక్షన్లు..ఇతర మందులు ఎక్కడ అందుబాటులో ఉన్నా సేకరించాలి. కోవిడ్‌తో అనాథలైన పిల్లలకు ప్రతి నెలా ఆర్థిక సాయం అందాలి. వారికి ప్రభుత్వం ఇస్తున్న రూ.10 లక్షలను వీలైనంత వరకు ఎక్కువ ఆదాయం వచ్చే చోట డిపాజిట్ చేయాలి'' అని తెలిపారు.
రాష్ట్రంలో కోవిడ్ కేసులు తగ్గుతున్నాయి
అనంతరం రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుతున్నాయని సీఎం జగన్‌కు అధికారులు వివరించారు. గత నెల 16న పాజిటివిటి రేటు 25.56 శాతంగా ఉంటే.. ప్రస్తుతం 13.02 శాతానికి తగ్గిందన్నారు. ఏపీలో యాక్టివ్ కేసులు మే 17న 2.11 లక్షలు ఉంటే.. జూన్ ప్రారంభం నాటికి 1.43 లక్షలు ఉందని తెలిపారు. రాష్ట్రంలో కోవిడ్ సమస్యలు ఎదుర్కొంటున్నవారి సంఖ్య కూడా తగ్గిందని.. ఐసీయూ బెడ్స్ మే 15న కేవలం 380 ఖాళీగా ఉంటే .. జూన్ 2 వరకు చూసుకుంటే 1,582 అందుబాటులో ఉన్నాయన్నారు.
7 వారాల డేటాను పరిశీలిస్తే అన్ని జిల్లాల్లో కరోనా కేసులు తగ్గాయన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లలోనూ రోగులు తగ్గారు.. ప్రస్తుతం 14,057 మంది రోగులు మాత్రమే ఉన్నారని తెలిపారు. ఏపీలో మొత్తం 557 కోవిడ్ ఆస్పత్రుల్లో 45,324 బెడ్లు ఉన్నాయన్నారు. వాటిలో 25,220 బెడ్లు ఆక్యుపైడ్‌గా ఉన్నాయని.. ఆక్యుపైడ్ బెడ్లలో 20,073 బెడ్లు ఆరోగ్యశ్రీ కింద చికిత్స పొందుతున్నారని వివరించారు.
ఏపీ వ్యాప్తంగా ఇప్పటి వరకు 51,03,821 మందికి తొలి డోస్ వేశామని.. మొత్తంగా 25,47,784 మందికి రెండు డోస్‌లు ఇచ్చామని తెలిపారు. నెలకు సంబంధించి కేంద్రం మొత్తం 36,94,210 వాక్సిన్లు కేటాయించగా.. ఇప్పటి వరకు 5,08,710 వ్యాక్సిన్లు పంపిణీ చేశామని.. ఇంకా 20,74,730 వాక్సిన్లు సేకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment