సాక్షి, తాడేపల్లి: కరోనా నివారణ చర్యలపై వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్ సవాంగ్, హెల్త్ స్పెషల్ సీఎస్ జవహర్ రెడ్డి, టాస్క్ ఫోర్స్ చైర్మన్ కృష్ణబాబు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయిలో ఉన్న కోవిడ్ ఆస్పత్రుల సంఖ్యను 5 నుంచి 10కి పెంచాలని సీఎం అధికారులను ఆదేశించారు. వైద్యులపై పని భారం లేకుండా నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. జిల్లాల్లో ఉన్న 84 కోవిడ్ ఆస్పత్రుల్లో నాణ్యమైన సేవలపైనా ప్రత్యేక దృష్టి సాధించాలని ఆదేశించారు. ఈ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రభుత్వం రాయితీలు అందించాలన్నారు. ఆయా ఆస్పత్రుల్లో ఏం చేయాలనే దానిపై రెండు రోజుల్లో నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. రాష్ట్రస్థాయి కోవిడ్ ఆస్పత్రుల మాదిరిగా ఈ ఆస్పత్రులు కూడా పూర్తిస్థాయి సేవలు అందించడంపై దృష్టి పెట్టాలన్నారు. ప్రస్తుతం ఉన్న 5 రాష్ట్రస్థాయి ఆస్పత్రుల్లోనూ నాణ్యమైన సేవలకోసం సత్వర చర్యలు చేపట్టాలని.. వీలైనంత త్వరగా వైద్యులు, సిబ్బంది నియామకం చేయాలని ఆదేశాలు జారీ చేశారు. చదవండి: 'బలహీన వర్గాలకు బలం సీఎం జగన్'
కోవిడ్ సోకిందన్న అనుమానం వస్తే ఏంచేయాలి? ఎవర్ని కలవాలన్న దానిపై అవగాహనకు భారీ ప్రచారం నిర్వహించాలన్నారు. కోవిడ్ ఎవరికైనా వస్తుంది, ఆందోళన వద్దు. 85 శాతం మందికి ఇళ్లల్లోనే ఉంటూ నయం అవుతుంది. జాగ్రత్తలు పాటిస్తూ సకాలంలో వైద్యం తీసుకోవాలి. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవాళ్లు, వయసులో పెద్దవాళ్లు వైద్య సహాయంలో ఆలస్యం వద్దు. క్షేత్రస్థాయిలో ఈ సమాచారాన్ని తెలియజేస్తూ హోర్డింగ్స్ పెట్టాలి. గ్రామ సచివాలయాల్లో కూడా ఈ హోర్డింగ్స్ ఉండాలి. క్వారంటైన్ సెంటర్ల సంఖ్య కన్నా క్వాలిటీ మీద దృష్టి పెట్టాలి. కోవిడ్ ఉందా? లేదా? అన్నది తెలుసుకోవడానికి ర్యాపిడ్ టెస్టులు అందుబాటులోకి వచ్చినందున ఎవరిని ఎక్కడ పెట్టాలన్న దానిపై స్పష్టత వస్తుందని, ఆ తర్వాత వారికి మంచి సేవలు అందించాలని సూచించారు.
అలాగే కాల్ సెంటర్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు, వినతుల మీద ప్రత్యేక దృష్టి వహించాలన్నారు. టెలి మెడిసిన్‌పై ఎప్పటికప్పుడు రివ్యూ చేయాలి. మందులు ఇంటికి సరఫరా చేస్తున్నారా? లేదా? మరోసారి పర్యవేక్షణ చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య రంగంలో చేపట్టనున్న నాడు–నేడు కార్యక్రమాలపై ఫోకస్ పెంచాలన్నారు. వచ్చే మూడు, నాలుగు నెలలపాటు నిర్దేశించుకున్న కార్యాచరణను పటిష్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఇవన్నీ పూర్తయితేనే కోవిడ్‌లాంటి విపత్తులను సమర్థవంతంగా ఎదుర్కోగలమని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. చదవండి: ఆ పోస్టులు నెలాఖరుకల్లా భర్తీ: సీఎం జగన్
కరోనా నివారణ చర్యలపై సీఎం జగన్ సమీక్ష
Published Mon, Jul 20 2020 7:17 PM | Last Updated on Mon, Jul 20 2020 7:48 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment