అప్రోచ్ చానల్ ద్వారా స్పిల్‌వే మీదుగా దూసుకువెళ్తున్న గోదావరి
సాక్షి, అమరావతి, పోలవరం రూరల్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పోలవరం పనుల్లో శుక్రవారం మరో కీలక ఘట్టాన్ని పూర్తి చేసింది. గోదావరి వరద ప్రవాహాన్ని అప్రోచ్ చానల్ ద్వారా స్పిల్‌వే మీదుగా వర్చువల్ విధానంలో డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి పేర్ని నానిలతో కలిసి జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్, ఆ శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు మళ్లించారు. స్పిల్ వే రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా సుమారు పది వేల క్యూసెక్కుల ప్రవాహం స్పిల్ చానల్, పైలట్ చానల్‌ల మీదుగా నదిలో కలిసి ధవళేశ్వరం బ్యారేజీ వైపు పరవళ్లు తొక్కుతోంది. స్పిల్ వే మీదుగా వరద మళ్లింపు దిగ్విజయంగా పూర్తి చేయడంతో ఈనెల 15 నుంచి గోదావరి డెల్టాకు నీటిని విడుదల చేసేందుకు జలవనరుల శాఖ అధికారులు చర్యలు చేపట్టారు.
రికార్డు వేగంతో స్పిల్ వే పూర్తి..
కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదించిన డిజైన్ మేరకు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం రామయ్యపేట వద్ద 194.6 టీఎంసీల సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టును ప్రభుత్వం నిర్మిస్తోంది. గోదావరి గర్భంలో ఇసుక తిన్నెల 2,454 మీటర్ల పొడవున నీటిని నిల్వ చేసే ప్రధాన డ్యామ్(ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్)ను నిర్మించి ప్రవాహాన్ని దిగువకు విడుదల చేయడానికి నదికి 1128.4 మీటర్ల పొడవున స్పిల్ వే నిర్మాణాన్ని చేపట్టారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ స్పిల్ వేను రికార్డు సమయంలో పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ గురువారం ప్రశంసించారు. ప్రాజెక్టును గడువులోగా పూర్తి చేసే లక్ష్యంతో ఈసీఆర్‌ఎఫ్ నిర్మాణానికి వీలుగా గోదావరి ప్రవాహాన్ని మళ్లించేందుకు చేపట్టిన ఎగువ కాఫర్ డ్యామ్ ఖాళీలను ఇటీవల భర్తీ చేశారు. కాఫర్ డ్యామ్ రీచ్–1లో 28, రీచ్–2లో 38, రీచ్–3లో 28, రీచ్–4లో 35 మీటర్ల ఎత్తుకు కాఫర్ డ్యామ్‌ను పూర్తి చేశారు. ప్రవాహాన్ని స్పిల్ వే మీదుగా మళ్లించేందుకు నది నుంచి 2.18 కి.మీ. పొడవున అప్రోచ్ ఛానల్‌ను తవ్వారు. ఎగువ కాఫర్ డ్యామ్ ఎత్తు పెరగడంతో నదిలో నీటి మట్టం 23.8 మీటర్లకు చేరింది.
సకాలంలో గోదావరి డెల్టాకు నీరు..
అప్రోచ్ ఛానల్ పనులు కొలిక్కి రావడంతో శుక్రవారం మంత్రులు వర్చువల్ విధానంలో పర్యవేక్షిస్తుండగా నదీ ప్రవాహాన్ని స్పిల్ వే వైపు మళ్లించారు. ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి, సీఈ కె.సుధాకర్‌బాబు, ఎస్‌ఈ కె.నరసింహమూర్తి, మేఘ ఇంజనీరింగ్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ రంగరాజన్, జీఎంలు ముద్దుకృష్ణ, దేవ్‌మణి మిశ్రాలు గోదారమ్మకు పసుపు, కుంకుమ, పూలు, పట్టువస్త్రాలను సమర్పించి శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్పిల్ వే రివర్ స్లూయిజ్ గేట్ల ద్వారా సుమారు పది వేల క్యూసెక్కులు 4.42 కి.మీ.ల పొడవున స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్ మీదుగా గోదావరిలో కలుస్తున్నాయి. ఈ ప్రవాహం ధవళేశ్వరం బ్యారేజీ వైపు పోటెత్తుతుండటంతో సకాలంలో గోదావరి డెల్టాకు నీటి విడుదలకు మార్గం సుగమమైంది. ఈనెల 15 నుంచి డెల్టాకు నీటిని విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. గోదావరిలో నీటి మట్టం 25 మీటర్ల కంటే ఎక్కువ స్థాయికి చేరితే పోలవరం స్పిల్ వే గేట్ల ద్వారా ప్రవాహం దిగువకు చేరేలా ఇప్పటికే గేట్లను ఎత్తివేశారు. అప్రోచ్ ఛానల్, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్‌తో కలసి మొత్తం 6.6 కి.మీ. పొడవున గోదావరి వరదను మళ్లించినట్లు స్పష్టమవుతోంది. దేశంలో ఇంత పొడవున వరద మళ్లించిన దాఖలాలు ఇప్పటిదాకా లేవని అధికారులు చెబుతున్నారు.
రికార్డు సమయంలో స్పిల్ వే పూర్తి..
పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే టీడీపీ సర్కార్ పాల్పడిన అక్రమాలను ప్రక్షాళన చేసి రివర్స్ టెండరింగ్ ద్వారా ఖజానాకు రూ.838 కోట్లను ఆదా చేశారు. ప్రాజెక్టును శరవేగంగా పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందించి అమలును పర్యవేక్షిస్తున్నారు. కరోనా ప్రతికూల పరిస్థితుల్లోనూ, గత ఏడాది వరద ఉద్ధృతిలోనూ స్పిల్ వే పనులు కొనసాగేలా చర్యలు తీసుకున్నారు. దీనివల్లే పోలవరం స్పిల్ వే రికార్డు సమయంలో పూర్తయింది. షెడ్యూల్ ప్రకారం ఈ సీజన్‌లో చేయాల్సిన పనులను పూర్తి చేసి స్పిల్ వే మీదుగా వరదను మళ్లించారు. నెలాఖరునాటికి ఎగువ కాఫర్ డ్యామ్‌ను 38 మీటర్లకు, జూలై ఆఖరుకు 42.5 మీటర్ల ఎత్తుకు పూర్తి చేసేలా అధికారులు చర్యలు చేపట్టారు. స్పిల్ వే ఇప్పటికే పూర్తవడంతో గోదావరికి ఎంత వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేయడానికి మార్గం సుగమం చేశారు. దీంతో వరదల్లోనూ ఎగువ కాఫర్ డ్యామ్, దిగువ కాఫర్ డ్యామ్‌ల మధ్య ఈసీఆర్‌ఎఫ్ పనులు చేపట్టడానికి అవకాశం ఉంటుంది.
సీఎం సంకల్ప బలంతో సాకారం..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్ప బలంతో ఈ మహత్తర కార్యం సాకారమైందని ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో లోపభూయిష్టంగా చేపట్టిన పనుల వల్ల మెయిన్ డ్యామ్ ఫౌండేషన్‌కు కొంత నష్టం వాటిల్లిందన్నారు. ప్రస్తుతం 23 టీఎంసీల నిల్వ ఉందన్నారు. వచ్చే ఖరీఫ్ సీజన్‌కు గ్రావిటీ ద్వారా నీటి విడుదలకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రాజెక్టు వద్ద నీటి విడుదల కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండలాధ్యక్షుడు బుగ్గా మురళీకృష్ణ, ప్రాజెక్టు ఈఈ మల్లికార్జునరావు, ఆదిరెడ్డి, బాలకృష్ణమూర్తి, మేఘ ఇంజనీరింగ్ సంస్థ సీజీఎం రవీంద్రరెడ్డి, ఏజీఎం రాజేష్, డీజీఎం శ్యామలరావు, మేనేజర్ మురళి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment