నెల్లూరు (స్టోన్‌హౌస్‌పేట) : టీడీపీ తన 14ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఒక్క సాగునీటి ప్రాజెక్టునైనా పూర్తిచేసిందా అని జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనికుమార్ యాదవ్ ప్రశ్నించారు. ‘ఈనాడు’లో వచ్చిన కథనంపై సోమవారం నెల్లూరులో ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రామోజీ డ్రామోజీలా ఇష్టమొచ్చిన రాతలు రాయడాన్ని మంత్రి తీవ్రంగా తప్పుబట్టారు. బాబు రెండు కళ్ల సిద్ధాంతమే రామోజీ సిద్ధాంతమని ఎద్దేవా చేశారు. టీడీపీ హయాంలో వైఫల్యాలు ఈనాడు రామోజీకి కనిపించవా అని మండిపడ్డారు. ‘బాబు ఏది రాయమంటే అది రాసేయడమేనా? పాత్రికేయ విలువలు అవసరంలేదా?’.. అని ప్రశ్నించారు.
ఉమ్మడి రాష్ట్రంలో తొమ్మిదేళ్లు.. విభజన ఆంధ్రప్రదేశ్‌లో ఐదేళ్లు పాలించిన టీడీపీ.. ఆ కాలంలో పూర్తిచేసిన సాగునీటి ప్రాజెక్టు పేరొక్కటి చెప్పాలని డిమాండ్ చేశారు. రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చుచేశామని చెప్పే ఆ పార్టీ.. నిజానికి ఏ ప్రాజెక్టు పనినీ పూర్తిచేయలేదన్నారు. నీరు–చెట్టు పేరుతో రూ.20 వేల కోట్లు దుర్వినియోగం, దోపిడీ చేశారన్నారు. ఒక నిర్దిష్టమైన ప్రణాళిక లేకపోవడంతో ఏదీ పూర్తిచేయలేకపోయారని అనిల్‌కుమార్ చెప్పారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సాగునీటి ప్రాజెక్టులపై ఒక ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రం కోర్టు కేసులు వేస్తుంటే ఇక్కడి ప్రభుత్వానికి మద్దతు పలకని టీడీపీ.. సాగునీటి ప్రాజెక్టుల పేరుతో ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే రాతలు, మాటలను ‘ఈనాడు’ ఆపాలని మంత్రి హితవు పలికారు.
కమీషన్ల కక్కుర్తివల్లే ‘పోలవరం’ రీడిజైన్
ఇక పోలవరం ప్రాజెక్టు సాంకేతిక తప్పిదం టీడీపీది కాదా అని అనిల్‌కుమార్ ప్రశ్నించారు. కేబినెట్‌లో ఒప్పుకుని ప్యాకేజీ కోసం లాలూచీ పడడంవల్ల నిధులు రాకపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడడంవల్లే మళ్లీ రీడిజైన్ చేయాల్సిన అవసరం రావడం.. ప్రాజెక్టు ఆలస్యానికి టీడీపీ నిర్వాకమే కారణమన్నారు. చిత్తూరు జిల్లా ప్రాజెక్టులపై కోర్టు కేసులు వేసింది టీడీపీ నేతలు కాదా అని నిలదీశారు. వెలిగొండ, రాయలసీమ ఎత్తిపోతలపై అవాంతరాలు.. ఇలా ప్రతి ప్రాజెక్టును అభివృద్ధికి దూరంగా పెట్టింది టీడీపీనేనని ఆయన ఆరోపించారు. పోతిరెడ్డిపాడుపై చంద్రబాబు వైఖరి ఏమిటో స్పష్టం చేయాలని మంత్రి డిమాండ్ చేశారు.
ఐదేళ్లలో చంద్రబాబు నెల్లూరుకు మూడుసార్లు వచ్చి పెన్నా, సంగం బ్యారేజీ పనులను పూర్తిచేస్తామని చెప్పడం అందరికీ తెలుసన్నారు. తమ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి సీఎం వైఎస్ జగన్ ప్రణాళికాబద్ధంగా ప్రతి ప్రాజెక్టునూ పూర్తిచేస్తున్నారని.. వెలిగొండలో ఒక టన్నెల్ పూర్తయిందని, రెండో టన్నెల్ కూడా పూర్తవుతుందన్నారు. గండికోట, చిత్రావతి ఎక్స్‌టెన్షన్ పనులు జరుగుతున్నాయన్నారు. కరోనా నేపథ్యంలోనే పనులకు అంతరాయం ఏర్పడిన విషయం అందరికీ తెలిసిందేనని మంత్రి చెప్పారు. ఇది చెప్పకుండా పనులు జరగడంలేదని రాతలు రాయడం ఎంతవరకు సమంజసమని మంత్రి అనిల్‌కుమార్ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చెప్పినట్లుగా ప్రతి ప్రాజెక్టునూ పూర్తిచేస్తామని ఆయన స్పష్టంచేశారు.
చదవండి: పదవి కోసమే ఆదినారాయణరెడ్డి ఆరోపణలు: గడికోట శ్రీకాంత్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment