సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు విషయంలో కమీషన్ల కక్కుర్తితో రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన నాటి సీఎం చంద్రబాబు.. ఇప్పుడు తమపై నిందలేస్తున్నారని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి పి.అనిల్‌కుమార్ యాదవ్ మండిపడ్డారు. వాస్తవాలను వక్రీకరిస్తూ చంద్రబాబు, లోకేష్, టీడీపీ నేతలకు కొన్ని పత్రికలు వంతపాడుతూ అసత్య కథనాలు వండివార్చుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును వంద శాతం ఖర్చుతో పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని గుర్తు చేశారు. శనివారం ఆయన విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కమీషన్ల కోసం పోలవరం నిర్మాణ బాధ్యతలను రాష్ట్రానికి దక్కించుకున్న చంద్రబాబు.. భూసేకరణ, సహాయ పునరావాస ప్యాకేజీ అమలుకు 2010–11 ధరల ప్రకారం రూ.16,010.45 కోట్లు ఇస్తామన్న కేంద్రం షరతుకు అంగీకరించారన్నారు. 2014 ఏప్రిల్ 1 నాటి ధర మేరకు నీటి పారుదల విభాగానికి అయ్యే ఖర్చును మాత్రమే ఇస్తామంటూ కేంద్రం విధించిన షరతుకు తలొగ్గారని ఎత్తిచూపారు.
నాడు అంగీకరించి బాబు తప్పు చేశారు
► 2016 సెప్టెంబర్ 7 అర్ధరాత్రి రాష్ట్రానికి కేంద్రం ప్రకటించిన ప్రత్యేక సహాయానికి చంద్రబాబు అంగీకరించారు. దాని అమలుకు సంబంధించి 2016 సెప్టెంబర్ 30న కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన మెమోరాండంలోనూ 2014 ఏప్రిల్ 1 నాటి ధరల ప్రకారం నీటిపారుదల విభాగానికి అయ్యే వ్యయాన్ని మాత్రమే ఇస్తామని స్పష్టం చేశారు.
► ఇదే అంశంపై 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది. ఆ కేబినెట్‌లో టీడీపీ నుంచి ఇద్దరు మంత్రులు అశోక గజపతి రాజు, సుజనా చౌదరి ఉన్నారు. ప్రాజెక్టుకు అన్యాయం జరుగుతుంటే వారు ఎందుకు ప్రశ్నించలేకపోయారు?
► కేంద్ర కేబినెట్ తీర్మానం బ్రహ్మాండంగా ఉందంటూ 2017 మార్చి 17న అసెంబ్లీ, మండలిలో చంద్రబాబు ప్రశంసించారు. వాటికి కొన్ని పత్రికలు బాకాలు ఊదాయి. ఆ కేబినెట్ తీర్మానాన్ని ఎత్తిచూపుతూ 2013–14 ధరల ప్రకారం ప్రాజెక్టుకు నీటి పారుదల విభాగం వ్యయం రూ.20,398.61 కోట్లుగా నిర్ధారించి, ఆమోదిస్తే రూ.2,234.77 కోట్లను రీయింబర్స్ చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ ఇటీవల కొర్రీ వేసింది.
అంచనా వ్యయం చెప్పడానికి ఎందుకు జాప్యం చేశారు?
► పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సవరించిన అంచనాల ప్రకారం పోలవరం ప్రాజెక్టు అంచనా వ్యయం ఎంతో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆరుసార్లు కోరింది. సమాధానం చెప్పకుండా జాప్యం చేసిన మాట వాస్తవం కాదా?
► 2017 మార్చి 15న కేంద్ర కేబినెట్ ఆమోదించిన తీర్మానంలో సగ భాగం అసెంబ్లీలో చదివిన చంద్రబాబు.. పోలవరం ప్రాజెక్టు శరవేగంగా పూర్తి చేస్తామని ప్రకటించిన మాట వాస్తవం కాదా? శాసనమండలిలో అప్పటి ఎమ్మెల్సీ చంద్రశేఖరరావు ప్రాజెక్టుకు రూ.40 వేల కోట్లు వ్యయం అవుతుందని అంటున్నారని.. అంత డబ్బులు కేంద్రం ఇస్తుందా అని అడిగితే చంద్రబాబు దానిని తోసివేశారు. శాసనమండలి ప్రొసీడింగ్స్‌ను పరిశీలిస్తే ఇది స్పష్టమవుతుంది.
► అంటే.. రూ.20,398 కోట్లు మాత్రమే పోలవరం ప్రాజెక్టుకు ఇస్తామని కేంద్రం స్పష్టం చేసినప్పుడు చంద్రబాబు ఎందుకు మౌనం దాల్చారు?
► కేంద్ర ఆర్థిక శాఖ కొర్రీల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందిస్తుందని ఆశిస్తున్నాం. నిధులు రాబట్టి పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తాం.
Comments
Please login to add a commentAdd a comment