విజయవాడలోని ఇరిగేషన్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతున్న మంత్రి అనిల్‌కుమార్
సాక్షి, అమరావతి: పోలవరం ప్రాజెక్టు పనుల్లో రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తే టీడీపీ అవినీతి బయటపడుతుందనే భయంతోనే చంద్రబాబు, ఆయన బృందం అవాస్తవాలను ప్రచారం చేస్తోందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ అనిల్‌కుమార్ యాదవ్ విమర్శించారు. జూలై నుంచి అక్టోబర్ వరకూ గోదావరిలో 120 రోజులకు పైగా వరద ఉంటుందని.. ఆ సమయంలో పనులు ఎలా చేస్తారనే ఆలోచన లేకుండా పోలవరం పనులు ఆగిపోయాయని టీడీపీ నేతలు.. ఆ వర్గం మీడియా అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. విజయవాడలోని జలవనరుల శాఖ కార్యాలయంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో సీఎంగా బాధ్యతలు స్వీకరించగానే 70 శాతం భూసేకరణ, కాలువలను దాదాపుగా పూర్తిచేశారని.. హెడ్ వర్క్స్ పనులను కొలిక్కి తెచ్చే సమయంలోనే ఆయన హఠాన్మరణం చెందారన్నారు. ఆ తర్వాత వచ్చిన టీడీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును కమీషన్లు కురిపించే కామధేనువుగా మార్చుకుందని దుయ్యబట్టారు.
శంకుస్థాపనలకు రూ.కోట్లు ఖర్చు చేసిన బాబు
కాంట్రాక్టు ఒప్పందం అమల్లో ఉండగా.. ధరల సర్దుబాటు నిబంధన ఒప్పందంలో భాగంగా 2015–16 ధరలను వర్తింపజేస్తూ అంచనా వ్యయాన్ని పెంచేసి.. కాంట్రాక్టర్‌కు రూ.1,400 కోట్లు దోచిపెట్టారా? లేదా?.. ట్రాన్స్‌ట్రాయ్‌తో ఈపీసీ ఒప్పందాన్ని రద్దు చేసుకోకుండా నవయుగకు పనులు అప్పగించడం అక్రమం కాదా? నవయుగ కేవలం లేబర్ కాంట్రాక్టు మాత్రమే చేస్తోందన్నది వాస్తవం కాదా? జలవిద్యుదుత్పత్తి కేంద్రానికి సంబంధించి ఎలాంటి పనులు చేయకుండానే రూ.787.20 కోట్లను దోచిపెట్టడం నిజం కాదా? అని ప్రశ్నిస్తే చంద్రబాబు, టీడీపీ మాజీమంత్రులు నోరుమెదపడం లేదని మంత్రి అనిల్‌కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల్లో రూ.మూడు వేల కోట్లకుపైగా దోచేశారన్నారు. విడతల వారీగా శంకుస్థాపనలు చేసి.. అందుకు ప్రకటనల నిమిత్తం రూ.200 కోట్లకు పైగా చంద్రబాబు ఖర్చు చేశారని.. సగం కట్టిన కాఫర్ డ్యామ్, స్పిల్ వేను చూపించడానికి రూ.వంద కోట్లకు పైగా తగలేశారని మంత్రి ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు దోచేసిన సొమ్ము, ప్రచార పిచ్చికి దుబారా చేసిన మొత్తంతో 20వేల మందికి పునరావాసం కల్పించే అవకాశం ఉండేదన్నారు. టీడీపీ నేతలు ఎన్నో తప్పులుచేసి ఇప్పుడు నీతులు చెబుతున్నారని దుయ్యబట్టారు.
అంచనా వ్యయం పెరగదు
పోలవరం పనులపై నిపుణుల కమిటీ విచారణ పూర్తిచేసి నివేదిక ఇచ్చిందని.. దాని ఆధారంగానే రివర్స్ టెండరింగ్ నిర్వహిస్తున్నామని అనిల్‌కుమార్ చెప్పారు. ఇదే అంశాన్ని కేంద్రానికి, పోలవరం ప్రాజెక్టుకు వివరించామన్నారు. రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజాధనం ఆదా అవుతుందన్నారు. సెప్టెంబర్ ఆఖరు నాటికి కొత్త కాంట్రాక్టర్‌ను ఎంపిక చేసి.. నవంబర్ 1 నుంచి పనులు ప్రారంభిస్తామని ఆయన స్పష్టంచేశారు. సుజనాచౌదరి బీజేపీలో ఉండి టీడీపీకి గొడుగు పట్టడం హేయమన్నారు.
Comments
Please login to add a commentAdd a comment