
సాక్షి, విజయవాడ: పోలవరం ప్రాజెక్ట్ కట్టాల్సిన పూర్తి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని సాగునీరు, జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. పునరావాసం బాధ్యత కూడా కేంద్రానిదేనని ఆయన పేర్కొన్నారు. మంత్రి అనిల్ కుమార్ శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ‘పోలవరంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి లేఖ రాశారు. నిధుల విడుదల విషయంలో జోక్యం చేసుకోవాలని ఆ లేఖలో కోరారు. రాష్ట్ర విభజన చట్టంలో పోలవరాన్ని కేంద్రమే నిర్మిస్తుందని ఉంది. ఇరిగేషన్, భూ సేకరణ, పునరావాసానికి కేంద్రం నిధులు ఇవ్వాలి. ఆలస్యం అయ్యేకొద్దీ ప్రాజెక్ట్ వ్యయం పెరుగుతోంది.
(చదవండి : ‘అరుదైన రాజనీతిజ్ఞుడిగా సీఎం జగన్ నిలిచారు’)
పోలవరంపై కొన్ని మీడియా సంస్థలు, పత్రికలు ఏదేదో రాస్తున్నాయి. చంద్రబాబు నాయుడు హయాంలో పోలవరానికి జరిగిన అన్యాయంపై ఆ పత్రికలు మాట్లాడలేదు. పోలవరం ప్రాజెక్ట్‌ను 2014లో కేంద్ర ప్రాజెక్ట్‌గా చేపట్టారు. ఆ తర్వాత మూడేళ్లు 2016 సెప్టెంబర్ వరకూ చంద్రబాబు ప్రభుత్వం పోలవరాన్ని పట్టించుకోలేదు. ఆరు సమావేశాల్లో రివైజ్డ్ ఎస్టిమేట్స్ అడిగినా చంద్రబాబు సర్కార్ ఇవ్వలేదు. 2015 మార్చి నుంచి తాత్సారం చేశారు. 2016 లో ప్యాకేజి ఒప్పందం చేసుకున్నారు. అందులో 100 శాతం ఇరిగేషన్ కాంపోనెంట్ కి నిదులు ఇస్తాం అని కేంద్రం చెప్పింది.
2017 మార్చ్ 15 న కేంద్ర కేబినెట్ లో తీర్మానం చేశారు. 2014 తర్వాత పెరిగే అంచనాలను కూడా చెల్లించమని చెప్పారు. భూ సేకరణ వ్యయం కూడా 2010 వరకు సేకరించిన వాటికే ఇస్తామన్నారు. అలాంటి కేబినెట్ తీర్మానాన్ని అప్పటి టీడీపీ కేంద్రమంత్రులు.. అశోక్‌గజపతిరాజు, సుజనాచౌదరి ఆమోదించిన మాట వాస్తవం కాదా? చంద్రబాబు ఆరోజు వీటిని ఎందుకు ఆమోదించారు?. ఆ కేబినెట్ తీర్మానాన్ని అసెంబ్లీలో పొగుడుతూ తీర్మానం చేశారు. తిరిగి ఇప్పుడు మా ప్రభుత్వంపై విమర్శలు చేస్తారా? చంద్రబాబు చేసిన పెద్దతప్పు వల్లే ఈ రోజు సమస్య తలెత్తింది.ఇప్పుడు దాన్ని సవరించడానికి సీఎం జగన్ ప్రధానికి లేఖ రాశారు.ప్రాజెక్ట్, పునరావాసం రెండింటికి కేంద్రమే నిధులివ్వాలి. 2021 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి చేస్తాం’ అని ఆయన తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment