
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతి బోధనాస్పత్రిలో 3 కిలోలీటర్ల (3 వేల లీటర్ల) ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 53 ఆస్పత్రుల్లో యుద్ధ ప్రాతిపదికన ఆక్సిజన్ పీఎస్‌ఏ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. తమిళనాడు, గుజరాత్, ఒడిశా మొదలైన రాష్ట్రాల నుంచి ఎప్పటికప్పుడు ఆక్సిజన్‌ను రాష్ట్రానికి తీసుకొచ్చి కరోనా బాధితులకు ప్రాణనష్టం లేకుండా చేస్తున్నామని చెప్పారు.
కోవిడ్ బాధితులకు ఏమేరకు ఆక్సిజన్ అవసరముందో ముందస్తు అంచనాలు ఉంటే కావాల్సినంత తెప్పించుకోవచ్చన్నారు. రాష్ట్రంలో రానున్న రోజుల్లో కరోనా బాధితులకు ఆక్సిజన్ ఇబ్బంది లేకుండా 300 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తికి సీఎం వైఎస్ జగన్ ఆదేశించారని తెలిపారు. కృష్ణపట్నం, శ్రీసిటీ, కడప స్టీల్‌ప్లాంట్, జిందాల్ స్టీల్‌ప్లాంట్‌లలో ఆక్సిజన్ స్టోరేజీలపై దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. బ్లాక్‌ఫంగస్ కేసులకు కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం అందించేందుకు సీఎం ఆదేశించారని చెప్పారు. కరోనా కేసులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రోజుకు 910 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ అవసరం ఉంటుందని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. సమావేశంలో కమాండ్ కంట్రోల్ చైర్మన్ డాక్టర్ జవహర్‌రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment