ఆశా వర్కర్‌ మృతి: 50 లక్షల సాయం | Alla Nani, Sucharitha Met Asha Worker Vijayalakshmi Family Members | Sakshi
Sakshi News home page

ఆశా వర్కర్‌ మృతి: రూ. 50 లక్షల సహాయం

Published Mon, Jan 25 2021 1:56 PM | Last Updated on Mon, Jan 25 2021 8:06 PM

Alla Nani, Sucharitha Met Asha Worker Vijayalakshmi Family Members - Sakshi

సాక్షి, గుంటూరు : ఆశా వర్కర్‌ విజయలక్ష్మి కరోనా వ్యాక్సిన్‌ వల్లే చనిపోయిందని ఇంకా నిర్ధారణ కాలేదని ఏపీ ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని పేర్కొన్నారు. తాడేపల్లి మండలం పెనుమాకలో ఆశా వర్కర్ బొక్కా విజయ లక్ష్మి కుటుంబ సభ్యులను మంత్రి ఆళ్ల నాని, హోం మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ, ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కాటంనేని భాస్కర్, జిల్లా అధికారులు సోమవారం పరామర్శించారు. కాగా గుంటూరులోని తాడేపల్లి మండలం పెనుమాక గ్రామానికి చెందిన ఆశా వర్కర్‌ బొక్కా విజయలక్క్క్ష్మీ ఆదివారం మరణించిన విషయం తెలిసిందే. ఈమె ఈనెల 19న కరోనా వ్యాక్సిన్‌ వేయించుకున్నారు. చదవండి: వ్యాక్సిన్: బ్రెయిన్‌ డెడ్‌ అయిన ఆశా వర్కర్‌ మృతి

ఈ సందర్భంగా మంత్రి ఆళ్ల నాని మాట్లాడుతూ.. విజయలక్ష్మి చనిపోవడం దురదృష్టకరమన్నారు. అయితే పోస్టుమార్టం రిపోర్టు వస్తే గాని ఆమె మరణానికి సంబంధించిన కారణాలు తెలుస్తాయన్నారు. పోస్టుమార్టం రిపోర్టు త్వరగా వచ్చేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. విజయలక్ష్మి మరణానికి కారణాలు ఏమైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి వెంటనే స్పందించారని తెలిపారు. విజయలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పమని తమను పంపినట్లు పేర్కొన్నారు. విజయలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి చెప్పిన మాటలన్నీ కుటుంబ సభ్యులకు వివరించామని తెలిపారు. కుటుంబ సభ్యులు ఒక ఉద్యోగం అడిగారని, అలాగే ఇళ్ల స్థలం, ఇన్సూరెన్స్ కింద వచ్చే యాభై లక్షలు అడిగారని తెలిపారు. విజయలక్ష్మి మరణానికి 50 లక్షల ఇన్సూరెన్స్ వర్తించదన్నారు. కరోనా విధులు అందించేటప్పుడు మాత్రమే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని, వ్యాక్సినేషన్‌కు వర్తించదని తెలిపారు. 

అయితే సీఎం వైఎస్‌ జగన్‌ మానవత్వంతో ఇన్సూరెన్స్‌తో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం తరపున యాభై లక్షల రూపాయలు ఇస్తామన్నారని మంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా  వ్యాక్సిన్ వేయించుకోవడానికి 3 లక్షల 88 వేల మంది  రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని, ఇప్పటివరకు లక్షా యాభై వేల మంది కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారని తెలిపారు. ఇప్పటివరకు 39 మందికి మాత్రమే తల తిరగటం, జలుబు, జ్వరం లాంటి లక్షణాలు కనిపించాయని, రిజిస్ట్రేషన్ చేయించుకున్న అంతమాత్రాన వ్యాక్సిన్ వేయించుకోవాలనే అవసరం లేదని స్పష్టం చేశారు. ఏమైనా అనారోగ్య కారణాలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించి డాక్టర్ సలహాలు తీసుకుని వ్యాక్సిన్ వేయించుకోవచ్చని సూచించారు. 

ఆశా వర్కర్ విజయలక్ష్మి మరణించడం బాధకరమని హోంమంత్రి మేకతోటి సుకరిత ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. సమాచారం తెలియగానే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వెంటనే స్పందించారని, విజయలక్ష్మి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారన్నారు. విజయలక్ష్మి కుటుంబానికి ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసానిచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement