బాధితురాలిని పరామర్శిస్తున్న డీఎంహెచ్‌వో
భీమడోలు: నెల రోజుల క్రితం ఏలూరు నగరాన్ని వణికించిన అంతుచిక్కని వ్యాధి లక్షణాలు రెండు రోజులుగా పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల గ్రామంలోనూ వెలుగు చూస్తున్నాయి. ఫిట్స్ వచ్చి పడిపోవడం, కళ్లు తిరిగి స్పృహ కోల్పోవడం, నోటి వెంట నురగలు రావడం, వాంతులు, మూతి వంకర్లు తిరగడం వంటి లక్షణాలతో మొత్తం 15 మంది ఆస్పత్రి పాలయ్యారు. వీరంతా పూళ్ల పంచాయతీ పరిధిలోని పూళ్ల తూర్పు, పడమర హరిజనపేట, రెడ్డినాయుడుపేట, జంగం వీధికి చెందినవారు. ఈ నెల 15న ఒకరు ఇలాంటి లక్షణాలతో ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. 16న మరో ఇద్దరు, ఆది, సోమవారాల్లో మరో 12 మంది ఇదే లక్షణాలతో పూళ్లలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి చికిత్స పొందారు. బాధితుల్లో ఎక్కువ మంది చేపల పట్టుబడి, ప్యాకింగ్, వ్యవసాయ పనులు చేసుకునే వారే. బాధితులకు పీహెచ్‌సీ వైద్యులు బి.లీలాప్రసాద్, ఇ.కల్యాణి చికిత్స అందించడంతో కోలుకుని ఇళ్లకు వెళ్లారు. సోమవారం రాత్రి తొమ్మిదేళ్ల బాలుడు ఇవే లక్షణాలతో పీహెచ్‌సీకి రాగా.. అతడికి రక్తహీనత ఉండటంతో అంబులెన్స్‌లో ఏలూరులోని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. కేసుల విషయాన్ని విషయాన్ని డీఎంహెచ్‌వో కె.సునంద దృష్టికి తీసుకెళ్లగా ఆమె గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించి లక్షణాలపై ఆరా తీశారు. ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందిన వ్యక్తితోపాటు పీహెచ్‌సీలో చికిత్స పొంది కోలుకున్న 14 మంది బాధితుల రక్త నమూనాలను సేకరించారు. బా«ధితులు నివాసం ఉంటున్న కాలనీల్లో తాగునీటి శాంపిల్స్‌ను సేకరించి పరీక్షలకు పంపించారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డీఎంహెచ్‌వో సునంద భరోసా ఇచ్చారు.
ఉప ముఖ్యమంత్రి ఆరా
పూళ్ల గ్రామంలో అంతు చిక్కని వ్యాధి లక్షణాలు వెలుగు చూసిన ఘటనలపై ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని ఆరా తీశారు. అస్వస్థతకు గురైన వారి వివరాలను అడిగి తెలుసుకున్నారు. తక్షణమే గ్రామానికి వైద్య బృందాలను పంపుతున్నట్టు ప్రకటించారు. అస్వస్థతకు గురైన వారిలో ఎవరికీ ప్రాణాపాయం లేదని, ప్రజలెవరూ ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు. ఫుడ్ పాయిజనింగ్ వల్ల ఇలా జరిగి ఉండవచ్చని భావిస్తున్నామన్నారు. గ్రామంలో వెలుగు చూసిన లక్షణాలు, ఇందుకు గల కారణాలపై పూర్తి విచారణ జరపాలని మంత్రి ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment