సాక్షి అమరావతి బ్యూరో: ఆంధ్రప్రదేశ్‌లో సీజనల్ వ్యాధులను నియంత్రించడానికి ప్రభుత్వం పూర్తి సన్నద్ధంగా ఉందని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లో సీజనల్ వ్యాధులపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి వర్షాకాలంలో మలేరియా, డెంగీ, చికున్‌గున్యాలను ప్రజలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఎక్కువగా ఐదు జిల్లాల్లో సీజనల్ వ్యాధులు నమోదవుతున్నాయన్నారు. ప్రధానంగా.. గుంటూరు, విశాఖ, తూర్పు, పశ్చిమగోదావరి,కృష్ణా జిల్లాల్లో 1,575 డెంగీ కేసులు నమోదయ్యాయని తెలిపారు. గుంటూరు జిల్లాలో కూడా 276 డెంగీ కేసులు, 13 మలేరియా కేసులు నమోదయ్యాయన్నారు.
ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ వైద్య ఆరోగ్య శాఖతోపాటు మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారన్నారు. ఆయా జిల్లాలకు వెళ్లి ఎక్కువ కేసులు నమోదైన చోట నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారని చెప్పారు. ఈ నేపథ్యంలోనే గుంటూరులో సమీక్ష నిర్వహించామని.. మంగళవారం విశాఖలో సమీక్ష నిర్వహించనున్నామని ఆళ్ల నాని తెలిపారు. దోమల వల్ల ఈ వ్యాధులు వస్తున్న నేపథ్యంలో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వైద్య సేవల పరంగా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
కోవిడ్ మూడో వేవ్‌కు సంబంధించి కేంద్రం నుంచి స్పష్టమైన సంకేతాలు ఏమీ రాలేదని చెప్పారు. అయినా సీఎం వైఎస్ జగన్ పూర్తి సన్నద్ధంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారన్నారు. అన్ని ఆస్పత్రుల్లో సీఎస్‌ఐ, ఆక్సిజన్ ప్లాంట్‌లు ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వైద్యుల నియామకం పూర్తి చేశామన్నారు. చిన్న పిల్లలకు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. సమావేశంలో హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత పాల్గొన్నారు.
సీజనల్ వ్యాధులను నిరోధిస్తాం
Published Tue, Sep 7 2021 3:48 AM | Last Updated on Tue, Sep 7 2021 3:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment