krishnamohan
-
తాడేపల్లిగూడెంలో ఏడీజే కోర్టు ప్రారంభం
తాడేపల్లిగూడెం (టీఓసీ): న్యాయవాదుల చిరకాల కోరిక అయిన ఏడీజే కోర్టును పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ప్రారంభించామని, కోర్టును గౌరవప్రదంగా నిర్వహించుకోవాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. నూతనంగా మంజూరైన 11వ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ జడ్జి (ఏడీజే) కోర్టును తాడేపల్లిగూడెం కోర్టు సముదాయం భవనాల్లోని ఒక బిల్డింగ్‌లో ఆదివారం ఉదయం జస్టిస్ కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి, జస్టిస్ నైనాల జైసూర్య, జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్ వి.గోపాలకృష్ణారావు, జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి సి.పురుషోత్తం కుమార్, ఏడీజే కోర్టు ఇన్చార్జి జడ్జి బి.సత్యవతి హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జస్టిస్ కృష్ణమోహన్ మాట్లాడుతూ తాడేపల్లిగూడెం న్యాయవాదుల చిరకాల వాంఛ అయిన ఏడీజే కోర్టు కల నెరవేరిందన్నారు. జూనియర్ న్యాయవాదులకు ఇది చక్కని అవకాశమని, సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కోర్టు పరిధిలోని ప్రజలకు ఏడీజే కోర్టు రావడం వల్ల వ్యయప్రయాసలు తగ్గుతాయన్నారు. బార్ అసోసియేషన్‌కు, న్యాయవాదులకు శుభాకాంక్షలు తెలిపారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏవీ శేషసాయి మాట్లాడుతూ ఇది రెండు దశాబ్దాల కల సాకారమైన రోజని అన్నారు. జస్టిస్ నైనాల జైసూర్య మాట్లాడుతూ యువ న్యాయవాదులు ఉన్నత శిఖరాలకు చేరుకునేందుకు ఏడీజే కోర్టు చక్కగా ఉపయోగపడుతుందన్నారు. జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఏడీజే కోర్టు కల సాకరమైనందుకు తాడేపల్లిగూడెం వాసిగా గర్వపడుతున్నానని చెప్పారు. కార్యక్రమంలో పలువురు న్యాయాధికారులు, న్యాయవాదులు పాల్గొన్నారు. -
బీసీల స్థితిగతులపై ఆర్నెల్లలో నివేదిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని వెనుకబడిన తరగ తుల సామాజిక, ఆర్థిక స్థితిపై అధ్యయన ప్రక్రియ ను తెలంగాణ బీసీ కమిషన్ వేగ వంతం చేసింది. ఇప్పటికే క్షేత్రస్థాయి పర్యటనలు పూర్తి చేసిన కమిషన్... తాజాగా వివిధ ప్రభుత్వ శాఖలతో వరుసగా భేటీలు నిర్వహించి మరింత సమాచారాన్ని సేకరిస్తోంది. పూర్తిస్థాయి నివేదికను 6నెలల్లోగా రాష్ట్ర ప్రభుత్వానికి అందించేందుకు సిద్ధమవుతోంది. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలు, సామాజిక అంశాలు, స్థానిక సంస్థల్లో బీసీలకు అందుతున్న అవకాశాలు తదితరాలపై తెలంగాణ బీసీ కమిషన్ అధ్యయనం చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కమిషన్ ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, మధ్యప్రదేశ్ తదితర రాష్ట్రాల్లో బీసీల స్థితిగతులను పరిశీలించింది. తాజాగా తెలంగాణలో శాఖల వారీగా స్థితిగతులను అధ్యయనం చేస్తోంది. ఈ మేరకు ప్రభుత్వ శాఖల ద్వారా బీసీలకు అందుతున్న లబ్ధి, ఉద్యోగావకాశాలు, ఆర్థిక చేకూర్పు కార్యక్రమాలు, తదితరాలపై ఈనెల 25వ తేదీ నుంచి వరుసగా నాలుగు రోజుల పాటు సమీక్షించింది. వకుళాభరణం అధ్యక్షతన సమీక్ష ఖైరతాబాద్‌లోని రాష్ట్ర బీసీ కమిషన్ కార్యాలయ సమావేశ మందిరంలో శనివారం బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ అధ్యక్షతన స మావేశం జరిగింది. ఈ సమావేశంలో సభ్యులు సీ హెచ్. ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె. కిశోర్గౌ డ్, బీసీ కమిషన్ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కా ర్యదర్శి బుర్రా వెంకటేశం, బీసీ సంక్షేమ శాఖ, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు. బీసీ సంక్షే మ శాఖ ద్వారా అమలవుతున్న సంక్షేమ పథకాలు, రిజర్వేషన్ల అమలు–తీరుతెన్నులు, కులాల వారీగా నిధుల కేటాయింపు, విద్యార్థులు, ఉద్యోగుల వారీ గా లబ్ధిదారుల పూర్తి వివరాలను సమీక్షించారు. బీ సీ సంక్షేమ శాఖ ద్వారానే కాకుండా ఇతర ప్రభుత్వ శాఖల ద్వారా అమలు చేస్తున్న కార్యక్రమాల్లో బీసీ లబ్ధిదారులను తెలుసుకునేందుకు రాష్ట్ర బీసీ కమిష న్ ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించింది. ఈ ఫార్మా ట్ ఆధారంగా ప్రతి ప్రభుత్వ శాఖ సమాచారం ఇ వ్వాల్సి ఉంటుందని బీసీ కమిషన్ స్పష్టం చేసింది. బీసీల్లోని కులాలు, ప్రాధాన్యతలను ప్రస్తావిస్తూ ఏ యే కేటగిరీకి ఎంతమేర అవకాశాలు పొందాయి... ఏమేరకు అవకాశాలు కల్పించాలి, అందుకు సంబంధించి చేయాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన నిర్ణ యాలను సైతం కమిషన్ సూచించనుంది. నివేదిక తయారీ ప్రక్రియను వేగవంతం చేసిన కమిషన్ మ రో ఆరునెలల్లోగా రూపొందించి ప్రభుత్వానికి నివేదించాలని భావిస్తూ ఆ మేరకు చర్యలు చేపట్టింది. -
సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం
కర్నూలు (లీగల్): సాంకేతికతను జోడిస్తే సత్వర న్యాయం సాధ్యమని, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణలో ప్రజలకు సత్వర న్యాయం అందించేలా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ పనిచేయాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి, కర్నూలు జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ బి.కృష్ణమోహన్ అన్నారు. శనివారం కర్నూలులో ఏర్పాటు చేసిన ఏపీ వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌ను జస్టిస్ కృష్ణమోహన్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే కర్నూలులో లోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వంటి సంస్థలు ఏర్పాటయ్యాయని, తాజాగా వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కూడా చేరిందని అన్నారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన జరిగిన తొమ్మిదేళ్ల తర్వాత రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టు ఏర్పాటు కావడం గొప్ప విషయమన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ బాగా పెరిగిందని, న్యాయవాదులు దీనిని బాగా వినియోగించుకోవాలన్నారు. ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి ఎన్.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్‌కు జి.భూపాల్‌రెడ్డి చైర్మన్‌గా, ట్రిబ్యునల్ మెంబర్లుగా నాగేశ్వరరావు, అబ్దుల్ మజీద్ వ్యవహరిస్తారన్నారు. వక్ఫ్ ఆస్తులకు సంబంధించిన వివాదాలు, ప్రశ్నలు, ఇతర విషయాలపై వక్ఫ్ ఆస్తుల నిర్ధారణ హక్కులు, ప్రయోజనాలను సమర్థించేందుకు ట్రిబ్యునల్ కోర్టు పని చేస్తుందని చెప్పారు. విభజన జరిగిన నాటి నుంచి ఇప్పటివరకు రాష్ట్ర వక్ఫ్ బోర్డు ట్రిబ్యునల్ కోర్టులో 213 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. మైనార్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఏఎండీ ఇంతియాజ్, కలెక్టర్ జి.సృజన, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి సీహెచ్ వెంకట నాగ శ్రీనివాసరావు, డీఆర్వో ఎస్వీ నాగేశ్వరరావు, ఫ్యామిలీ కోర్టు జడ్జి ప్రతిభాదేవి, జ్యుడిషియల్ ఫస్ట్‌క్లాస్ మెజిస్ట్రేట్ కల్యాణి పాల్గొన్నారు. -
పర్చూరులో టీడీపీ దొంగ ఓట్లపై ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, బాపట్ల: బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గంలో ఓటర్ల జాబితాలో 2013 నుంచి 2023 వరకు జరిగిన అవకతవకలపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆమంచి కృష్ణమోహన్ సోమవారం రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్కుమార్మీనాను కలిసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమంచి మాట్లాడుతూ.. 2013లో కేవలం మూడునెలల వ్యవధిలోనే సుమారు 20 వేల దొంగ ఓట్లు చేర్చగా.. అప్పటి ఆర్ఓ ఈ అవకతవకలపై విచారణ చేయమని క్రిమినల్ కేసు పెట్టారన్నారు. అప్పటి నుంచీ అది పెండింగ్‌లో ఉందన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం రాగానే ఈ కేసు నుంచి తప్పించుకునేందుకు ఏఆర్ఓ ఆఫీస్ నుంచి నివేదిక లేదంటూ కోర్టుకు అప్పటి ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. 2018లో సుమారు 15 వేల దొంగ ఓట్లు చేర్చారన్నారు. ఇలా ఇప్పటికి 2013 నుంచి 2023 జనవరి 1వ తేదీ కొత్త ఓటరు జాబితా ప్రకారం, సప్లిమెంటరీ ఓటరు జాబితా వరకు సుమారు 40వేల దొంగ ఓట్లు ఇప్పటి టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు చేర్చి అక్రమ పద్ధతిలో స్వల్ప మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యారన్నారని ఆరోపించారు. వీటితోపాటు విదేశాలలో ఉంటున్న వారి ఓట్లు, చనిపోయిన వారి ఓట్లు, దేశంలో ఇతర ప్రాంతాలలో స్థిరపడిన వారి ఓట్లు, పెళ్లి చేసుకుని వేరే ప్రాంతాలకు వెళ్లిన ఆడపడచుల ఓట్లు తొలగించకుండా వాటిపేరుతో దొంగ ఓట్లతో అప్రజాస్వామికంగా ఎన్నికలు పర్చూరులో జరుగుతోందని వివరించారు. మార్టూరు ప్రస్తుత ఏఈఆర్ఓ తన లాగిన్‌లోని డేటాను ఏలూరికి ఎలా ఇచ్చారని ప్రశి్నంచారు. ఒక ప్రత్యేక అధికారి బృందంతో ఇంటింటికి సమగ్ర విచారణ జరిపి ప్రత్యేక ఓటరు ధ్రువీకరణ చేయాలని, ఓట్లు చేర్పు కార్యక్రమాన్ని చేపట్టాలని కోరారు. -
50 మంది విద్యార్థులకు ఇన్స్పైర్ మానక్ అవార్డులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాలయాలకు చెందిన 50 మంది విద్యార్థులు ఇన్స్పైర్ మానక్ అవార్డులకు ఎంపికయ్యారని గురుకుల విద్యాలయాల సంస్థ కార్యదర్శి ఎ.కృష్ణమోహన్ తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం, మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నిర్వహించిన ఇన్స్పైర్ మానక్ అవార్డ్స్–2021–2022కు ఎంపిక కావడం గొప్ప విషయమని పేర్కొన్నారు. ఈ అవార్డును సాధించిన విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ.10వేల చొప్పున పారితోషికం లభించనుందని తెలిపారు. అత్యధికంగా లేపాక్షి బాలుర గురుకులంలో ఐదుగురు, పుంగనూరు(పెదపంజాని) బాలికల గురుకులంలో 4గురు అవార్డులను సాధించారని పేర్కొన్నారు. అవార్డులు సాధించిన విద్యార్థులు, పోత్సహించిన ఉపాధ్యాయులను కృష్ణమోహన్ అభినందించారు. -
ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా పీవీ రమేష్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారుగా జీవీడీ కృష్ణమోహన్ నియమితులయ్యారు. ఆయన కమ్యూనికేషన్ సలహాదారుగా వ్యవహరించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉత్తర్వులిచ్చారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు ఉదయం 8.49 గంటలకు సచివాలయంలోని సీఎం చాంబర్లో అడుగుపెట్టనున్నారు. దీంతో ముఖ్యమంత్రి చాంబర్ మొదటి బ్లాక్‌ను వాస్తుకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్నారు. రేపు జరగనున్న మంత్రుల పదవీ ప్రమాణ కార్యక్రమంలో పాల్గొనేందుకు గవర్నర్ నరసింహన్ శుక్రవారం మధ్యాహ్నం విజయవాడ చేరుకున్నారు. -
బలవంతపు సెలవుపై బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి
సాక్షి, అమరావతి: బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి కృష్ణమోహన్ సెలవుపై వెళ్లడంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. మహాత్మా జ్యోతిబా పూలే ఏపీ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల కార్యదర్శి కృష్ణమోహన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబే బలవంతంగా సెలవుపై పంపినట్లు తెలుస్తోంది. కమిషన్ చైర్మన్‌కు తెలియకుండా హడావుడిగా బీసీ కమిషన్ నివేదిక తీసుకుని, దానిని మంత్రివర్గంలో చర్చించిన పిదప అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయం విదితమే. దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు ఇచ్చింది నివేదికే కాదని, తాము అధికారికంగా నివేదిక సమర్పిస్తామని చెప్పి ఆయన ఆ నెల 2న బెంగళూరు వెళ్లిపోయారు. అయితే అధికారిక నివేదిక అంటే తమ ప్రభుత్వానికి మచ్చ వస్తుందని సీఎం చంద్రబాబు భావించారని సమాచారం. అందుకే ఆ నివేదికపై మళ్లీ చర్చ జరగకుండా ఉండటానికి ప్రభుత్వ అధికారి కృష్ణ మోహన్‌ను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆయన ఆదేశించారు. కాగా, తనకు తెలియకుండా నివేదికను ప్రభుత్వం తీసుకోవడంపైనా, దానికి కమిషన్ సభ్యులు సహకరించడంపైనా కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. తన పేరుపై ఏర్పాటైన కమిటీ రిపోర్టు తనకే తెలియకుండా ప్రభుత్వానికి చేరడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కమిషన్ తీర్మానం చేయకుండానే రిపోర్టును కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లిన సభ్యులపై దొంగతనం కేసుపెట్టే యోచనలో కూడా చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4న కమిషన్ తరఫున సభ్య కార్యదర్శి కృష్ణమోహన్ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తారని జస్టిస్ మంజునాథ్ ఈనెల 2న మీడియాకు తెలిపారు. అయితే నాలుగవ తేదీ నుంచి కృష్ణ మోహన్ సెలవుపై ఉండటం గమనార్హం. హడావుడిగా నివేదికకు అసెంబ్లీ ఆమోదం.. పోలవరం టెండర్లకు కేంద్రం బ్రేక్ వేసిన నేపథ్యంలో ప్రజల్లో మొదలైన చర్చను దారి మళ్లించేందుకు ప్రభుత్వం హడావుడిగా కాపుల రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిందనే విమర్శలు ఉన్నాయి. ఈనెల 1న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీసీ కమిషన్ నివేదికపై చర్చించి ఆమోదించారు. అనంతరం అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టి కాపులకు 5 శాతం రిజర్వేషన్ అంటూప్రకటించారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో మంత్రివర్గ నిర్ణయాలు ప్రకటించకూడదని, అసెంబ్లీలో మాత్రమే చర్చించి ప్రకటించాలనే నిబంధన ఉన్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. అసెంబ్లీలో నివేదిక ప్రవేశ పెట్టిన రోజే కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ మీడియాతో మాట్లాడారు. సభ్యులు ఇచ్చింది నివేదికే కాదని స్పష్టం చేశారు. తాము అధికారిక నివేదిక ఇస్తామన్నారు. అధికారిక నివేదికపై సీఎం అసంతృప్తి చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ప్రకటనపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో నివేదికను ఆమోదించేశామని, మరోసారి నివేదిక అందించడం ఏమిటని మెంబర్ సెక్రటరీ కృష్ణమోహన్ వద్ద ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కమిషన్ చైర్మన్ నిర్ణయమని కృష్ణమోహన్ చెప్పడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధికారిక రిపోర్టు అనే ప్రసక్తి రాకుండా ఉండటానికి కృష్ణమోహన్‌ను సెలవులో వెళ్లాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు సమాచారం. కాగా, నివేదిక సమర్పణపై కమిషన్ చైర్మన్ మంజునాథ్‌ను శనివారం ‘సాక్షి’ సంప్రదించగా.. మెంబర్ సెక్రటరీ సెలవులో ఉన్నారని, ఆయన ఆదివారం నివేదికను అందజేస్తారని చెప్పారు. అయితే గొంతులో ఇన్ఫెక్షన్ కారణంగా మాట్లాడలేకపోతున్నానని మెంబర్ సెక్రటరీ కృష్ణమోహన్ లీవ్లెటర్లో పేర్కొన్నట్లు సమాచారం. ఆయనను సంప్రదించేందుకు ‘సాక్షి’ యత్నించగా అందుబాటులోకి రాలేదు. మరోపక్క అసెంబ్లీలో ఆమోదించాల్సి ఉన్నందున నివేదికను వెంటనే ఇవ్వాలని కమిషన్ చైర్మన్‌ను సీఎం కోరారు. తాను సెలవులో ఉన్నానని, వచ్చిన తరువాత ఇస్తానని జస్టిస్ మంజునాథ్ చెప్పినా సీఎం వినిపించుకోకుండా ముగ్గురు సభ్యుల ద్వారా ఆ నివేదికను తెప్పించుకున్నారు. వారూ తనకు విలువనివ్వకపోవడం కూడా కమిషన్ చైర్మన్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. నిబంధనలు తెలిసీ ఈ విధంగా ఎందుకు చేశారని సభ్యులను జస్టిస్ మంజునాథ్ ప్రశ్నించినట్లు సమాచారం. బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకంపై ‘పిల్’ హైకోర్టును అభ్యర్థించిన బీసీ సాధికారత ఫెడరేషన్ ప్రతినిధి సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్, సభ్యులు వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సత్యనారాయణల నియామకాలను సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వెనుకబడిన తరగతులను గుర్తించే విషయంలో అటు చైర్మన్కుగానీ, ఇటు మిగిలిన సభ్యులకు గానీ ఎటువంటి అనుభవంలేదని, అందువల్ల వారి నియామక ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బీసీ సాధికారిత ఫెడరేషన్ అధికార ప్రతినిధి పామర్తి జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. -
లారీ ఢీకొని యువకుడి దుర్మరణం
కణేకల్లు(రాయదుర్గం) : కణేకల్లు మండలం పెనకలపాడులో గురువారం రాత్రి లారీ ఢీకొని అదే గ్రామానికి చెందిన కృష్ణమోహన్(30) మృతి చెందినట్లు ఎస్ఐ యువరాజు తెలిపారు. కృష్ణమోహన్ తన స్నేహితులతో కలసి మల్లికార్జున ఇంటి వద్ద మాట్లాడుకొంటూ నిలబడి ఉండగా లారీ విపరీతమైన వేగంతో అతనిపై దూసుకెళ్లిందన్నారు. దీంతో అతను అక్కడికక్కడే మరణించినట్లు వివరించారు. లారీ డ్రైవర్ అజాగ్రత్త వల్లే ఘటన జరిగిందని పేర్కొన్నారు. మృతుని భార్య లలితమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. -
బ్యాంకును మోసగించిన ఐదుగురి అరెస్టు
వైఎస్సార్ జిల్లా: నకిలీ ఆస్తి పత్రాలను సృష్టించి బ్యాంకు నుంచి రూ. కోటికి పైగా అప్పుగా తీసుకున్న మోసగాళ్లను, సహకరించిన బ్యాంకు ఉద్యోగిని పోలీసులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. వివరాలు.. కడపకు చెందిన మోడెం శ్రీనివాసులు, అతని తమ్ముడు రమేశ్, బావ బొల్లా నర్సింహులు, స్నేహితుడు వడ్డేపల్లి వెంకట సుబ్బయ్య నకిలీ ఆస్తి పత్రాలను తయారు చేశారు. వాటితో వైఎస్సార్ జిల్లా కడపలోని ఎస్బీఐ ప్రధాన శాఖ నుంచి రూ. కోటి 12 లక్షల 63 వేలను తీసుకున్నారు. వీరికి బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ కృష్ణమోహన్ సాయం చేశాడు. 2012-13 కాలంలో వీరు ఏడు విడతలుగా రుణం తీసుకున్నారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు 24వతేదీ రాత్రి ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.