బీసీ కమిషన్ చైర్మన్ మంజునాథ్
సాక్షి, అమరావతి: బీసీ కమిషన్ సభ్య కార్యదర్శి కృష్ణమోహన్ సెలవుపై వెళ్లడంతో పలు సందేహాలు తలెత్తుతున్నాయి. మహాత్మా జ్యోతిబా పూలే ఏపీ బీసీ రెసిడెన్షియల్ పాఠశాలల కార్యదర్శి కృష్ణమోహన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబే బలవంతంగా సెలవుపై పంపినట్లు తెలుస్తోంది. కమిషన్ చైర్మన్‌కు తెలియకుండా హడావుడిగా బీసీ కమిషన్ నివేదిక తీసుకుని, దానిని మంత్రివర్గంలో చర్చించిన పిదప అసెంబ్లీలో ఆమోదం తెలిపిన విషయం విదితమే. దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ్యులు ఇచ్చింది నివేదికే కాదని, తాము అధికారికంగా నివేదిక సమర్పిస్తామని చెప్పి ఆయన ఆ నెల 2న బెంగళూరు వెళ్లిపోయారు. అయితే అధికారిక నివేదిక అంటే తమ ప్రభుత్వానికి మచ్చ వస్తుందని సీఎం చంద్రబాబు భావించారని సమాచారం.
అందుకే ఆ నివేదికపై మళ్లీ చర్చ జరగకుండా ఉండటానికి ప్రభుత్వ అధికారి కృష్ణ మోహన్‌ను సెలవుపై వెళ్లాల్సిందిగా ఆయన ఆదేశించారు. కాగా, తనకు తెలియకుండా నివేదికను ప్రభుత్వం తీసుకోవడంపైనా, దానికి కమిషన్ సభ్యులు సహకరించడంపైనా కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ తీవ్ర ఆగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. తన పేరుపై ఏర్పాటైన కమిటీ రిపోర్టు తనకే తెలియకుండా ప్రభుత్వానికి చేరడంపై ఆయన విస్మయం వ్యక్తం చేశారు. కమిషన్ తీర్మానం చేయకుండానే రిపోర్టును కార్యాలయం నుంచి బయటకు తీసుకువెళ్లిన సభ్యులపై దొంగతనం కేసుపెట్టే యోచనలో కూడా చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 4న కమిషన్ తరఫున సభ్య కార్యదర్శి కృష్ణమోహన్ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి అందజేస్తారని జస్టిస్ మంజునాథ్ ఈనెల 2న మీడియాకు తెలిపారు. అయితే నాలుగవ తేదీ నుంచి కృష్ణ మోహన్ సెలవుపై ఉండటం గమనార్హం.
హడావుడిగా నివేదికకు అసెంబ్లీ ఆమోదం..
పోలవరం టెండర్లకు కేంద్రం బ్రేక్ వేసిన నేపథ్యంలో ప్రజల్లో మొదలైన చర్చను దారి మళ్లించేందుకు ప్రభుత్వం హడావుడిగా కాపుల రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చిందనే విమర్శలు ఉన్నాయి. ఈనెల 1న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో బీసీ కమిషన్ నివేదికపై చర్చించి ఆమోదించారు. అనంతరం అసెంబ్లీలో నివేదిక ప్రవేశపెట్టి కాపులకు 5 శాతం రిజర్వేషన్ అంటూప్రకటించారు. అయితే అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో మంత్రివర్గ నిర్ణయాలు ప్రకటించకూడదని, అసెంబ్లీలో మాత్రమే చర్చించి ప్రకటించాలనే నిబంధన ఉన్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. అసెంబ్లీలో నివేదిక ప్రవేశ పెట్టిన రోజే కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్ మీడియాతో మాట్లాడారు. సభ్యులు ఇచ్చింది నివేదికే కాదని స్పష్టం చేశారు. తాము అధికారిక నివేదిక ఇస్తామన్నారు.
అధికారిక నివేదికపై సీఎం అసంతృప్తి
చైర్మన్ జస్టిస్ మంజునాథ్ ప్రకటనపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మంత్రివర్గ సమావేశంలో నివేదికను ఆమోదించేశామని, మరోసారి నివేదిక అందించడం ఏమిటని మెంబర్ సెక్రటరీ కృష్ణమోహన్ వద్ద ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. కమిషన్ చైర్మన్ నిర్ణయమని కృష్ణమోహన్ చెప్పడంతో సీఎం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అధికారిక రిపోర్టు అనే ప్రసక్తి రాకుండా ఉండటానికి కృష్ణమోహన్‌ను సెలవులో వెళ్లాల్సిందిగా సీఎం ఆదేశించినట్లు సమాచారం. కాగా, నివేదిక సమర్పణపై కమిషన్ చైర్మన్ మంజునాథ్‌ను శనివారం ‘సాక్షి’ సంప్రదించగా.. మెంబర్ సెక్రటరీ సెలవులో ఉన్నారని, ఆయన ఆదివారం నివేదికను అందజేస్తారని చెప్పారు. అయితే గొంతులో ఇన్‌ఫెక్షన్ కారణంగా మాట్లాడలేకపోతున్నానని మెంబర్ సెక్రటరీ కృష్ణమోహన్ లీవ్‌లెటర్‌లో పేర్కొన్నట్లు సమాచారం. ఆయనను సంప్రదించేందుకు ‘సాక్షి’ యత్నించగా అందుబాటులోకి రాలేదు. మరోపక్క అసెంబ్లీలో ఆమోదించాల్సి ఉన్నందున నివేదికను వెంటనే ఇవ్వాలని కమిషన్ చైర్మన్‌ను సీఎం కోరారు. తాను సెలవులో ఉన్నానని, వచ్చిన తరువాత ఇస్తానని జస్టిస్ మంజునాథ్ చెప్పినా సీఎం వినిపించుకోకుండా ముగ్గురు సభ్యుల ద్వారా ఆ నివేదికను తెప్పించుకున్నారు. వారూ తనకు విలువనివ్వకపోవడం కూడా కమిషన్ చైర్మన్ ఆగ్రహానికి కారణమని తెలుస్తోంది. నిబంధనలు తెలిసీ ఈ విధంగా ఎందుకు చేశారని సభ్యులను జస్టిస్ మంజునాథ్ ప్రశ్నించినట్లు సమాచారం.
బీసీ కమిషన్ చైర్మన్, సభ్యుల నియామకంపై ‘పిల్’
హైకోర్టును అభ్యర్థించిన బీసీ సాధికారత ఫెడరేషన్ ప్రతినిధి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ జస్టిస్ మంజునాథ్, సభ్యులు వెంకటేశ్వర సుబ్రహ్మణ్యం, మల్లెల పూర్ణచంద్రరావు, శ్రీమంతుల సత్యనారాయణల నియామకాలను సవాలు చేస్తూ ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. వెనుకబడిన తరగతులను గుర్తించే విషయంలో అటు చైర్మన్‌కుగానీ, ఇటు మిగిలిన సభ్యులకు గానీ ఎటువంటి అనుభవంలేదని, అందువల్ల వారి నియామక ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ బీసీ సాధికారిత ఫెడరేషన్ అధికార ప్రతినిధి పామర్తి జయప్రకాశ్ నారాయణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment