వరద ప్రభావిత ప్రాంతాల కలెక్టర్లతో జరిగిన సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: వరద ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముమ్మరంగా చేపట్టిన సహాయ చర్యలకు తన పర్యటనల ద్వారా ఆటంకం కలిగించకూడదనే ఉద్దేశంతో కొంత సమయం ఇచ్చి ఆ తరువాత క్షేత్రస్థాయిలో బాధితులకు అందిన సాయం, పునరావాస కార్యక్రమాలను స్వయంగా పరిశీలిస్తున్నట్లు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. విపత్తుల వేళ బాధితులను ఆదుకునేందుకు అవసరమైన నిధులు, వనరులను అధికారులకు ముందుగానే సమకూర్చి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తు చేశారు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విపత్తుల సమయంలో ఎలా వ్యవహరిస్తోందో మీ అందరికీ తెలిసిన విషయమేనని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇప్పుడు కూడా అదే తరహాలో సోమ, మంగళవారాల్లో వరద ప్రాంతాల్లో పర్యటించి బాధితులను తాను స్వయంగా కలుసుకోనున్నట్లు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. వరద బాధిత ప్రాంతాల్లో ఎక్కడా విమర్శలకు తావులేకుండా సహాయ, పునరావాస కార్యక్రమాలను సమర్థంగా నిర్వహించాలని అధికార యంత్రాంగాన్ని సీఎం ఆదేశించారు.
వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, అంబేడ్కర్ కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లుకు వరద ప్రాంతాల్లో సహాయ, పునరావాస కార్యక్రమాలపై సీఎం జగన్ మరోసారి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..
ముందస్తుగానే నిధులిస్తున్నాం..
నేను పాలనా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి విపత్తుల సమయంలో ఏ రకంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నానో మీరంతా గమనించే ఉంటారు. దేశంలోని ఇతర ముఖ్యమంత్రులంతా దాదాపు ఈ రకంగానే కార్యకలాపాలను నిర్వహిస్తుండడం మనం అంతా చూస్తున్నాం. అధికారులకు అవసరమైన నిధులు, వనరులను సమకూర్చి సమర్థంగా సహాయ, పునరావాస కార్యక్రమాలు అమలు జరిగేలా చూస్తున్నాం. విపత్తు సంకేతాలు అందగానే కలెక్టర్లకు ముందస్తుగా నిధులు విడుదల చేస్తున్నాం. మీరు అడిగిన టీఆర్ 27 కింద నిధులు సహా అవసరమైన వనరులను సమకూరుస్తూ అధికారులను ఎంపవర్ చేస్తున్నాం.
సరిపడా సమయం ఇస్తున్నాం
సహాయ, పునరావాస చర్యలను సమర్థంగా చేపట్టేలా ప్రభుత్వం నాలుగేళ్లుగా అన్ని రకాలుగా తోడుగా నిలుస్తోంది. బాధితులకు సరైన విధంగా సహాయం అందించేలా తగిన చర్యలు తీసుకునేందుకు సరిపడా సమయం ఇస్తున్నాం. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా నేను వచ్చి క్షేత్రస్థాయిలో కలెక్టర్లుగా మీరు, అధికారులు, సిబ్బంది సహాయ పునరావాస కార్యక్రమాలను ఏ రకంగా చేపట్టారో స్వయంగా పరిశీలిస్తున్నా. నేరుగా బాధితులను అడిగి వివరాలు తెలుసుకుంటున్నా. ఈసారి కూడా నేను వస్తా. క్షేత్రస్థాయిలో మీరు తీసుకున్న చర్యలు, అందించిన సహాయంపై సమీక్ష చేస్తా.
ఉదార స్వభావంతో ఉండాలి
ఏ ఒక్క బాధిత కుటుంబం కూడా వరదలతో ప్రభావితమైనప్పటికీ తమకు సహాయం అందలేదని చెప్పే పరిస్థితి ఉండకూడదు. వరద సహాయ కార్యక్రమాల్లో ఉదారంగా వ్యవహరించాలని, మానవీయతతో, సానుభూతితో ఉండాలని నేను ఇదివరకే చెప్పా. ఈ విషయం మరోసారి స్పష్టం చేస్తున్నా. ఒకవేళ మనమే ఆ పరిస్థితుల్లో ఉంటే ఎలాంటి సాయాన్ని కోరుకుంటామో ఆ తరహాలోనే అధికారులుగా మీరు స్పందించాలి.
ఇంట్లోకి వరద వస్తే రూ.2 వేలివ్వాలి
ఇంట్లోకి వరదనీరు వస్తే కచ్చితంగా రూ.2 వేలు చొప్పున బాధితులకు అందించాలి. మళ్లీ ఒక్కసారి పరిశీలించి ఎవరికైనా అందకపోతే తగిన చర్యలు తీసుకోండి. అలాగే ఇంట్లోకి వరదనీరు రాకపోయినా వరద కారణంగా సంబంధాలు తెగిపోయిన వారికి కచ్చితంగా నిర్ణయించిన ప్రకారం రేషన్ అందించాలి. 25 కేజీల బియ్యం, పాలు, కేజీ కూరగాయలు, కేజీ వంటనూనె, కేజీ పప్పు లాంటి సరుకులు తప్పనిసరిగా బాధితులకు అందాలి. దీంతోపాటు తాగునీరు కూడా అందించాలి.
సాయం పొందని బాధిత కుటుంబం ఉండకూడదు
ఈ సహాయం పొందని వరద బాధిత కుటుంబం అంటూ ఉండకూడదు. సహాయ శిబిరాల్లో గడిపిన వారు తిరిగి ఇళ్లకు వెళ్లేటప్పుడు ప్రతి కుటుంబానికి రూ.2,000 చొప్పున, వ్యక్తులైతే రూ.1,000 చొప్పున ఇచ్చి పంపించాలి. క్యాంపులు కొనసాగుతున్న చోట ఆహారం, తాగునీరు, సదుపాయాల విషయంలో ఒక్క ఫిర్యాదు కూడా రాకూడదు. మనం ఏ రకమైన సదుపాయాలను ఆశిస్తామో శిబిరాల్లో కూడా అలాంటి సౌకర్యాలే ఉండాలి. మా కలెక్టర్ మమ్మల్ని బాగా చూసుకున్నారనే మాట వినిపించాలి.
కచ్చా ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నా రూ.10 వేలు సాయం
వరద కారణంగా కచ్చా ఇల్లు పాక్షికంగానైనా, పూర్తిగానైనా ధ్వంసమైతే ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణ చేయవద్దు. బాధితులందరికీ రూ.10 వేలు చొప్పున సహాయం అందించాలి. ఆ డబ్బులు వారు తమ ఇంటిని బాగు చేసుకోవడానికి ఉపయోగపడతాయి. వైద్య శిబిరాలను కొనసాగించండి. వరదనీరు తగ్గగానే పారిశుద్ధ్య కార్యక్రమాలు కొనసాగించండి. ఇది చాలా ముఖ్యమైన అంశం. మిగిలిన చోట్ల నుంచి వరద బాధిత ప్రాంతాలకు పారిశుద్ధ్య కార్మికులను తరలించండి. పీహెచ్‌సీలు, విలేజ్ క్లినిక్స్‌లలో సరిపడా మందులు ఉండేలా చూసుకోండి. పాము కాట్లకు సంబంధించిన మందులను కూడా అందుబాటులో ఉంచాలి.
వరద తగ్గగానే పంట, ఆస్తి నష్టంపై ఎన్యుమరేషన్
వరద ప్రభావం తగ్గిన వెంటనే పంట నష్టం, ఆస్తి నష్టంపై ఎన్యుమరేషన్ చేపట్టి గ్రామ, వార్డు సచివాలయాల్లో సోషల్ ఆడిట్ కోసం జాబితాను ఉంచండి. ఆ తర్వాత కూడా ఎవరైనా తమకు నష్టం జరిగిందని వస్తే మరోసారి క్షేత్రస్ధాయిలో పర్యటించి అంచనా వేయండి. పంట నష్టం, ఆస్తి నష్టానికి సంబంధించి అత్యంత పారదర్శకంగా పరిహారం అందించండి.
అవసరమైన చోట వెంటనే కొత్త ఇళ్లు
అవసరమైన చోట వెంటనే కొత్త ఇళ్లను మంజూరు చేయండి. ఏటి గట్లమీద ఉన్నవారికి పక్కా ఇళ్లను మంజూరు చేయండి. వరద వచ్చిన ప్రతిసారి వారు ఇబ్బంది పడకుండా ఇళ్లను మంజూరు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. అలాంటి ప్రమాదకర ప్రాంతాల్లో ఉండేవారికి సురక్షిత ప్రాంతంలో ఇళ్లు ఇవ్వాలి. వారి కష్టాలకు శాశ్వతంగా పరిష్కారం చూపాల్సిన బాధ్యత మనదే. అవసరమైన స్థలాన్ని సేకరించి ఇళ్ల పట్టాలిచ్చి ఇళ్లను కూడా మంజూరు చేయండి.
పోలవరం ఎగువ ముంపు ప్రాంతాలకు పునరావాసంలో ప్రాధాన్యం
పోలవరం ఎగువన తరచూ ముంపునకు గురయ్యే ప్రాంతాలకు ఆర్ అండ్ ఆర్ కార్యక్రమాల్లో మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. పశువులకు గ్రాసం కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. దెబ్బతిన్న రోడ్లు, కల్వర్టులు తదితరాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి. వరద ప్రభావం తగ్గి పరిస్థితి మెరుగుపడేంతవరకూ రక్షిత తాగునీటిని అందించాలి. వరద బాధిత ప్రాంతాలకు నేను వచ్చినప్పుడు ఈ అంశాలకు సంబంధించి ఎవరూ ఫిర్యాదు చేసే పరిస్థితి రాకూడదు.
ఆ మాటే రాకూడదు..
వరద బాధిత ప్రాంతాల్లో సోమ, మంగళ వారాల్లో నా పర్యటనకు సంబంధించి సీఎంవో అధికారులు ఆదివారం సాయంత్రం వివరాలను ప్రకటిస్తారు. క్షేత్రస్థాయిలో బాధితులకు అందిన సహాయ, పునరావాస కార్యక్రమాలను నేను స్వయంగా పరిశీలిస్తా. నేను ఏ జిల్లాలో పర్యటించినప్పటికీ మా కలెక్టర్ సరిగా చేయలేదనే మాటే రాకూడదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి.
– సమీక్షలో రెవెన్యూశాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ కేవీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి.సాయిప్రసాద్, గ్రామ, వార్డు సచివాలయాలశాఖ స్పెషల్ సీఎస్ అజయ్‌జైన్, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ గోపాలకృష్ణ ద్వివేది, పౌరసరఫరాలశాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్, ఆర్ అండ్ బి కార్యదర్శి పీఎస్ ప్రద్యుమ్న, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ పి.కోటేశ్వరరావు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ జె.నివాస్, విపత్తు నిర్వహణశాఖ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment