వేగంగా.. ఉదారంగా.. | Andhra Pradesh Govt responded quickly in Godavari floods | Sakshi
Sakshi News home page

వేగంగా.. ఉదారంగా..

Published Mon, Sep 5 2022 3:11 AM | Last Updated on Mon, Sep 5 2022 3:11 AM

Andhra Pradesh Govt responded quickly in Godavari floods - Sakshi

(ఫైల్‌)

సాక్షి, అమరావతి: ఇటీవల గోదావరిని వరదలు రెండుసార్లు ముంచెత్తినా రాష్ట్ర ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి సహాయక చర్యలు చేపట్టడం ద్వారా ప్రాణనష్టాన్ని భారీగా తగ్గించగలిగింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా వరద బాధితులకు ఆపన్న హస్తం అందించి అందరి మన్ననలు అందుకుంది. వరద హెచ్చరికలు జారీ అయిన మరుక్షణం నుంచే అప్రమత్తమై పక్కాగా సహాయక చర్యలు ప్రారంభించింది. ముంపు బాధితుల్ని పునరావాస కేంద్రాలకు తరలించడం నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వరకు బాధ్యతగా అన్ని సౌకర్యాలు కల్పించింది.

ఈ సంవత్సరం జులై, ఆగస్టు నెలల్లో రెండుసార్లు గోదావరి మహోగ్ర రూపం దాల్చింది. అల్లూరి సీతారామరాజు, అంబేద్కర్‌ కోనసీమ, ఏలూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది. సీఎం జగన్‌ సూచనలతో అధికార యంత్రాంగం లక్షలాది మందిని ఆదుకుంది. గతంలో విపత్తులు వచ్చినా వెంటనే ఆర్థికసాయం అందిన దాఖలాల్లేవు. పరిహారం కోసం నెలలు, సంవత్సరాలు ఎదురుచూసేవారు. చంద్రబాబు హయాంలో తిత్లీ తుపాను పరిహారం కోసం ఏడాదిపాటు ఎదురుచూడాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు జగన్‌ సర్కారు వెంటనే ఉదారంగా పరిహారాన్ని అందించి బాధితులకు భరోసా కల్పించింది. 
గోదావరి వరదల సమయంలో సహాయం అందిస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది(ఫైల్‌) 

శరవేగంగా సాయం పంపిణీ
బాధితులను ఆదుకునేందుకు సహాయక చర్యలు శరవేగంగా చేపట్టినా వరద ప్రభావం, ఇళ్లు కూలిపోవడంతో ఏడుగురు మృత్యువాత పడ్డారు. వారి కుటుంబాలకు రూ.4 లక్షల చొప్పున రూ.28 లక్షల ఎక్స్‌గ్రేషియాను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అందించింది. ఇక 45 మండలాల్లో 467 గ్రామాలు వరద ప్రభావానికి గురయ్యాయి. 389 గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. అల్లూరి సీతారామరాజు జిల్లాలోనే 205 గ్రామాలు ముంపు బారినపడ్డాయి.

ఈ గ్రామాల నుంచి 1.50 లక్షల మందిని ప్రభుత్వం సురక్షిత ప్రాంతాలకు తరలించింది. ముంపు గ్రామాల నుంచి బోట్ల ద్వారా తరలించడానికి రూ.5.17 కోట్లు ఖర్చుచేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా రెండు వేల బోట్లను అద్దెకు తీసుకుంది. 195 పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేసి ప్రతిరోజు సగటున 1.07 వేల మందికి తాత్కాలికంగా ఆశ్రయం కల్పించింది. అక్కడ వారికి భోజనం, దుస్తులివ్వడంతోపాటు వైద్యసేవలు అందించింది. నిత్యావసరాలూ పంపిణీ చేసింది. ఇందుకోసం రూ.12.22 కోట్లు ఖర్చుచేసింది. 

వేగంగా పంట నష్టం అంచనా
ఇక పంట నష్టం అంచనానూ శరవేగంగా నిర్వహిస్తోంది. గతంలో ఎప్పుడూలేని విధంగా ఏ సీజన్‌లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్‌లోనే ఇవ్వాలన్న విధానపరమైన నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా వచ్చే సీజన్‌ ఆరంభమయ్యేలోగానే ఇన్‌పుట్‌ సబ్సిడీని అందించాలన్న దృఢసంకల్పంతో సర్కారు ఉంది. అక్టోబర్‌లోగా ఇచ్చేందుకు కసరత్తు చేస్తోంది.

ఎప్పుడూలేని విధంగా తక్షణ సాయం
ఇక వరద తగ్గాక శిబిరాల నుంచి ఇంటికి వెళ్లేటప్పుడు బాధిత కుటుంబాలకు గతంలో ఎప్పుడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణ సాయం కింద నగదు అందించింది. 
► 94,715 కుటుంబాలకు వెయ్యి నుంచి రూ.2 వేల చొప్పున పంపిణీ చేసింది. 
► ఒక లక్షా 966 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కేజీ చొప్పున కందిపప్పు, ఉల్లిపాయలు, బంగాళాదుంపలు, లీటర్‌ ఆయిల్‌ను పంపిణీ చేసింది. 
► 2,429 టన్నుల బియ్యాన్ని రూ.3.84 కోట్ల ఖర్చుతో పంపిణీ చేసింది. 
► వరద ధాటికి గుడిసెలు దెబ్బతిన్న 14,731 కుటుంబాలకు రూ.10 వేల చొప్పున మొత్తం రూ.14.73 కోట్ల సాయం అందించింది. 
► ఇళ్లు దెబ్బతిన్న 4,509 కుటుంబాలకు రూ.15.16 కోట్ల పరిహారాన్ని ఇచ్చింది. 
► పశువుల పాకలు కూలిపోయిన రైతులకు రూ.2,100 చొప్పున 10 మందికి రూ.21 వేలు అందించింది. 
► 543 వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి వైద్య పరీక్షలు చేయించింది. 
► ముంపు ప్రాంతాల్లో ముందస్తుగా పారిశుధ్య చర్యలు చేపట్టి జ్వరాలు, అంటువ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంది. దోమలు పెరగకుండా ఫాగింగ్, బ్లీచింగ్‌ చల్లారు. ఇందుకోసం రూ.41 లక్షలు వినియోగించింది. 
► ఇక రోడ్లు, డ్రెయిన్లు, ఇళ్లలో పేరుకుపోయిన బురద, చెత్త, ఇతర వ్యర్థాలను కార్మికులు తొలగించారు. 
► ముంపు ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పథకాలు దెబ్బతినడంతో యుద్ధప్రాతిపదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లుచేసింది. రూ.12.4 కోట్లతో ట్యాంకర్లు, అద్దె బోట్ల ద్వారా నీటిని అందించింది.  
► దెబ్బతిన్న తాగునీటి సరఫరా వ్యవస్థలు, పారిశుధ్య వ్యవస్థలు, రోడ్లు, నీటిపారుదల వ్యవస్థల పునరుద్ధరణ కోసం రూ.18 కోట్లు ఖర్చుచేసింది. 

సహాయక చర్యల్లో 40 వేల మంది..
మరోవైపు.. వరద సహాయక చర్యల్లో గతంలో ఎన్నడూలేని విధంగా 40 వేల మందికిపైగా అధికారులు, సిబ్బంది పాలుపంచుకున్నారు. వరద హెచ్చరికలు మొదలైనప్పటి నుంచి సీఎం సహా ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తమైంది. ఆరు జిల్లాల్లో ఆరుగురు కలెక్టర్లు, ఆరుగురు జేసీలు, ఆరుగురు ఎస్పీలు పక్కా ప్రణాళికతో విపత్తును ఎదుర్కొన్నారు.

రెవెన్యూ అధికారులు, సిబ్బంది కలిసి 1,235 మంది.. గ్రామ సచివాలయ సిబ్బంది 8,960 మంది, గ్రామ వలంటీర్లు 13,241 మంది, పారిశుధ్య సిబ్బంది 2,650 మంది, వైద్య సిబ్బంది 1,294 మంది, బోటు డ్రైవర్లు, సహాయకులు 631 మంది ప్రత్యక్షంగా సహాయక చర్యల్లో పాల్గొన్నారు. వీరంతా కలిపి మొత్తం 28,029 మంది పనిచేశారు. వీరుకాక.. పోలీసులు, ఫైర్‌ సర్వీసెస్, పశు సంవర్థక, ఎస్డీఆర్‌ఎఫ్, ఎన్డీఆర్‌ఎఫ్‌ తదితర శాఖల అధికారులు, సిబ్బంది మరో 10 వేల మందికిపైగా సహాయక చర్యల్లో నిరంతరాయంగా సేవలందించారు. ఇలా వరద బాధితులను ఎక్కడికక్కడ శరవేగంగా ఆదుకున్న తీరుపై సర్వత్రా సంతృప్తి వ్యక్తమైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement