Vijayawada Floods: ‘కన్నీటి’ వరద | Vijayawada Floods With Chandrababu Laziness in Relief measures | Sakshi
Sakshi News home page

Vijayawada Floods: ‘కన్నీటి’ వరద

Published Tue, Sep 3 2024 4:56 AM | Last Updated on Tue, Sep 3 2024 7:35 AM

Vijayawada Floods With Chandrababu Laziness in Relief measures

బెజవాడను ముంచేసిన బుడమేరు, బాబు అలసత్వం

ఎటుచూసినా హాహాకారాలు.. అంతా హృదయ విదారకం

ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బాధితులు బిక్కుబిక్కు

ముంపులోనే పలు కాలనీలు.. 7– 8 అడుగుల మేర నీళ్లు

చిన్న పిల్లలు, వృద్ధులు, మహిళల పరిస్థితి దయనీయం

రెండు రోజులుగా వరదలో చిక్కుకుని విలవిల

తాగునీరూ అందించలేని దుస్థితి.. ముంపులో పునరావాస కేంద్రాలు

ముందస్తు సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ముంచారు

ఇప్పుడు టూరిస్టుల్లా ఫొటోల కోసం వచ్చారని మంత్రులపై బాధితుల ఆగ్రహం

హడావుడి మినహా పునరావాస చర్యలే లేవని మండిపాటు

వలంటీర్లు, బంధువులే బాధితులకు దిక్కు.. కర్రలు, తాళ్ల సాయంతో పీకల్లోతు నీళ్లలో నుంచి బతుకు జీవుడా అంటూ బయటకు!

అరకొర బోట్లు.. డబ్బులు వసూలు.. సహాయ చర్యలు నామమాత్రం

వరదల్లో చిక్కుకున్నవారు 4.5 లక్షల మందికిపైనే..

ఇప్పటికీ 2.5 లక్షల మందికిపైగా జల దిగ్బంధంలోనే

సాక్షి ప్రతినిధి, విజయవాడ: విజయవాడ సింగ్‌నగర్‌ పరిధి­లోని వాంబే కాలనీలో నివసించే శ్రావణి రెండు రోజులుగా ఇద్దరు బిడ్డల ఆచూకీ తెలియక తల్లడిల్లుతోంది. శనివారం ఉదయం కూలి పనుల కోసం వెళ్లిన శ్రావణికి కొద్దిసేపటికే వాంబే కాలనీ మునిగిపోయిందన్న సమాచారం తెలియడంతో గుండెలు అవిసిపోయాయి. 36 గంటల నుంచి తన కుమారుడు, కుమార్తె ఇంట్లో చిక్కుకుని ఉన్నారని.. కనీసం వారి పరిస్థితి ఎలా ఉందో కూడా తెలియడం లేదంటూ విలపిస్తోంది. 

చిన్నారులు ఇద్దరూ పదేళ్లలోపు వారే కావటంతో ఎలా ఉన్నారో అంతుబట్టక నిద్రాహారాలు లేకుండా కుమిలిపోతోంది. అధికారులకు తన మొర చెప్పుకుందామని వెళ్తే వినిపించుకునే నాథుడే లేకుండా పోయాడని కన్నీరు మున్నీరు అవుతోంది. ‘నా కన్నీటిని ఎవరూ పట్టించుకోవటంలేదు. కడుపున పుట్టిన బిడ్డలు విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. ప్రభుత్వ పెద్దనా సమస్యను ఆలకించడం లేదు’ అంటూ రోదిస్తోంది!! వరద ప్రాంతాల్లో బాధితుల దుస్థితికి ఇది ఓ ఉదాహరణ మాత్రమే. 

ఎవరిని కదిలించినా ఇలాంటి దీన గాథలే! సహాయ చర్యల్లో సర్కారు వైఫల్యంతో పలుచోట్ల మహిళలు, పిల్లలను వారి బంధువులు, వలంటీర్లు పీకల లోతు నీళ్లలో భుజాలపైకి ఎక్కించుకుని కాపాడి తెస్తున్న దృశ్యాలు కంట తడి పెట్టిస్తున్నాయి. వరద నీటిలో వస్తుండగా కాళ్లకు పాములు, విష జంతువులు చుట్టుకోవడంతో ఆర్తనాదాలు చేస్తున్నారు. 

నీట మునిగిన సింగ్‌నగర్‌ ఏరియల్‌ వ్యూ 

తెల్లారేసరికి ప్రాణాలతో ఉంటారో లేదో..
‘ముందస్తు సమాచారం ఇవ్వకుండా మమ్మల్ని ముంచేశారు. కనీసం ముందుగా చెబితే కట్టుబట్టలతో ఒడ్డుకైనా చేరేవాళ్లం. ఆదివారం తెల్లారేసరికి నీరు చుట్టుముట్టింది. ఎంతోమంది చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులున్నారు. ఆహారం మాట దేవుడెరుగు.. ప్రాణం కాపాడుకునేందుకు గుక్కెడు మంచి­నీళ్లూ  దొరకటం లేదు. చిన్నపిల్లలు పాల కోసం గుక్కపట్టి ఏడుస్తున్నారు. మెయిన్‌ రోడ్డు మీద కొన్ని పడవలు తిరుగుతున్నాయి. 

వాళ్లను ఎంత బతిమాలినా లోపల సందులోకి రావటం లేదు. ఆహారం, పాలు, నీళ్లు.. రోడ్డుపైన ఉన్న కొన్ని ఇళ్ల వారికి మాత్రమే అందుతున్నాయి. లోపల వేలాది కుటుంబాలున్నాయి. తెల్లారేసరికి ప్రాణాలతో ఉంటాయో లేదో! ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫల­మైంది. కాలనీల్లో కింద గ్రౌండ్‌ ఫ్లోర్‌లు పూర్తిగా మునిగి­పో­వడంతో మిద్దెలు, పై ఫ్లోర్లలో తలదాచుకుంటున్నారు. ఏదైనా బోటు కనిపిస్తే నీళ్లు, పాల ప్యాకెట్లు పైకి వేయాలని వేడుకుంటున్నారు. 

విజయవాడలోని సింగ్‌నగర్‌లో ఆహారం, పాలు, తాగునీటి కోసం వరద బాధితుల అవస్థలు 

కట్టుబట్టలతో కొంతమంది ఎలాగోలా బయటప­డగా చాలామంది ధైర్యం చాలక మిద్దెలపైన బిక్కుబిక్కుమంటు బతుకీడుస్తున్నారు. వరద ప్రభావిత కాలనీల్లో విద్యుత్‌ లేదు. ఫోన్‌లు పనిచేయడంలేదు. రాత్రిళ్లు నరకయాతన అనుభ­వి­స్తున్నారు’ అంటూ వరద నుంచి ప్రాణాలతో బయట­పడ్డ వారు చెబుతుంటే కళ్లు చెమరుస్తున్నాయి. 

రాజీవ్‌నగర్, కండ్రిక, గుణదల, లూనాసెంటర్, పాయకాపురం, తోటవారివీధి తదితర కాలనీల్లో ఇప్పటికీ సహాయ చర్యలు అందలేదు. పశువుల షెడ్‌లు కూలిపోవడంతో రెండు రోజులుగా మూగజీవాలు నీరు, తిండిలేక రోడ్లపైనే ఉన్నాయి. ఇళ్లు నీట మునిగిపోవడంతో సామగ్రి పూర్తిగా దెబ్బతింది. దుకాణాల్లోకి నీరు చేరడంతో సరుకులు ఎందుకూ పనికిరా­కుండా పోయాయి. 

బాధితులు లక్షల్లో.. బోట్లు పదుల్లో
వరద బాధితులు లక్షల్లో ఉండగా ప్రభుత్వం తెప్పించామని చెబుతున్న బోట్లు ఏ మూలకూ సరిపోవటం లేదు. రోడ్లపైన బాధితులకు నీరు, పాలు, ఆహారం తరలించేందుకే పరిమి­తం అవుతున్నాయి. పలు బోట్లకు పంక్చర్లు కావడంతో వెనక్కి వస్తున్నాయి. ఇదే అదునుగా కొందరు వెల కడుతూ బోట్ల వ్యాపారానికి తెగబడుతు­న్నారు. కుటుంబం అయితే రూ.5 వేలు, మనిషికి రూ.1,000–1,500 చొప్పున వసూలు చేస్తున్నారు. పేదలను మాత్రం బోట్లు ఎక్కనివ్వడం లేదు. 

5 నియోజకవర్గాల పరిధిలో..
బుడమేరు పొంగటంతో ఐదు నియోజక వర్గాలు.. విజయ­వాడ సెంట్రల్, ఈస్ట్, వెస్ట్, మైలవరం, గన్నవరం పరిధిలో కాలనీలు నీట మునగడంతో సుమారు 4.5 లక్షల మందికి పైగా ముంపు బారినపడ్డారు. ఇప్పటికీ పూర్తిగా నీటిలో చిక్కుని 2.5 లక్షల మందికిపైగా బాధితులు అల్లాడుతు­న్నారు. వివిధ కాలనీలకు సంబంధాలు తెగిపోయి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. సోమవారం సాయంత్రానికి 20వేల మం­దిని కూడా∙బయటకి తరలించలేని దుస్థితి.

కనుచూపు మేర నీళ్లే 
48 గంటల తరువాత కూడా లక్షల మందిని వరదల్లో వదిలేసి ప్రభుత్వం పూర్తిగా చేతులెత్తేసింది. బాధితుల ఇళ్లల్లో వంట సామగ్రి, గ్యాస్‌ స్టవ్‌లు, బీరువాలు, బట్టలు, ఫర్నిచర్, పుస్తకాలు.. బురదమయమైపోయాయి. ఇంట్లో ఉండలేక బయటకు వద్దామంటే కనుచూపు మేర నీళ్లే కనిపిస్తుండటంతో అల్లాడుతున్నారు. ప్రభుత్వం కనీసం కొవ్వొత్తులు కూడా సరఫరా చేయలేదు. 

బాధితులను హెలికాప్టర్లలో ఎయిర్‌ లిఫ్ట్‌ చేస్తా­­మని సీఎం చంద్రబాబు ఆదివారం చెప్పిన మాటలు నీటిమూటలుగానే మిగిలిపో­యాయి. సహాయ చర్యల కంటే వీఐపీల హడావుడి బాధితుల ఇక్కట్లను మరింత పెంచుతోంది. వీఐపీల వాహనాలు కి.మీ. కొద్దీ బారులు తీరాయి. అంబులెన్సులు వెళ్లే మార్గం కనిపించడంలేదు. పాలు, ఇతర నిత్యావసరాల ధరలు రెండు మూడు రెట్లు పెంచేసి దోపిడీ చేస్తున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

అన్నం పెట్టండంటే.. బాబు అభివాదం
రెండు రోజులుగా ఆహారం లేక అల్లాడుతున్న బాధితులు తమ ప్రాంతానికి వస్తున్న ప్రజాప్రతినిధులను కనీసం తినడానికి ఏదైనా అందించాలంటూ నిస్సహాయంగా అర్థిస్తున్నారు. సింగ్‌ నగర్‌లో సీఎం చంద్రబాబు బోటులో పర్యటిస్తుండగా ఓ వృద్ధురాలు  చిన్నారిని చూపిస్తూ ఆహారం అందించాలని ప్రాథేయపడింది. అయితే చంద్రబాబు నవ్వుతూ ఆమెకు అభివాదం చేస్తూ బోటులో వెళ్లిపోయారు. ఆమెకు ఆహారం అందించాలని అధికారులను కనీసం ఆదేశించకపోవడం విభ్రాంతి కలిగించింది. ఆ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారడంతో చంద్రబాబు తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

పునరావాస కేంద్రాల జాడేదీ..?
వరద ప్రాంతాల్లో చిక్కుకున్న వారిలో కొందరు ఎలాగోలా ధైర్యం చేసి వలంటీర్లు, బంధువుల సాయంతో కర్రలు, తాళ్ల ద్వారా బయటికి వచ్చినా తలదాచుకునేందుకు ప్రభుత్వం కనీసం సహాయ శిబిరాలను కూడా ఏర్పాటు చేయలేదు. అరకొర శిబిరాలు సైతం నీళ్లలో మునగడంతో రోడ్లపై దయనీయంగా ఉన్నారు. తిండి లేక అల్లాడుతున్నారు. సహాయ చర్యలు చేపట్టడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని మండిపడుతున్నారు. వరద ప్రాంతాల్లో ఇప్పటికీ వైద్య శిబిరాలు ఏర్పాటు చేయలేదు. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం కొరవడటంతో బాధితులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.

మంత్రులపై మండిపాటు.. ఫొటోల కోసం టూరిస్టుల్లా వచ్చారా?
సింగ్‌నగర్, రాజీవ్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో మంత్రులు అనిత, సంధ్యారాణి అచ్చెన్నాయుడు, డీజీపీని వరద బాధితులు నిలదీశారు. సహాయ చర్యలు అందటం లేదని, విజయవాడను కాపాడలేనివారు రాష్ట్రాన్ని ఏం కాపాడతారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మంచినీళ్లు కూడా ఇవ్వలేకపోతున్నారని, టూరిస్టుల్లా బోట్‌లలో వచ్చి ఫొటోలు దిగి వెళ్లిపోతున్నారని నిలదీశారు. మంత్రులు అనిత, సంధ్యారాణి బాధితుల ఆగ్రహం చూసి అక్కడ నుంచి చల్లగా జారుకున్నారు.

‘నా భార్య మౌనిక సింగ్‌నగర్‌లోని అమెరికన్‌ ఆసుపత్రిలో ఆగస్టు 31న బిడ్డకు జన్మనిచ్చింది. 15 రోజులు ఆసుపత్రిలోనే ఉండి చికిత్స తీసుకోవాలని చెప్పారు. ఇప్పుడు ఆసుపత్రి చుట్టూ నీళ్లు చేరడంతో మమ్మల్ని బయటకు పంపేశారు. మాతోపాటు మరో 15 మంది బాలింతలు పురిటి బిడ్డలతో ఒడ్డుకు చేరుకున్నాం. మమ్మల్ని కాపాడేందుకు ఒక్క బోటూ రాలేదు. మేమే ఈదుకుంటూ వచ్చాం. 


పచ్చి బాలింతైన నా భార్యను ఒక చేత్తో, అమ్మను మరో చేత్తో పట్టుకుని ఈదుకుంటూ ఫైఓవర్‌ వరకు తీసుకొచ్చా. మళ్లీ వెనక్కి ఈదుకుంటూ వెళ్లి మాకోసం ఆస్పత్రికి వచ్చిన బంధువును, సామాన్లను తెచ్చా. ఇక్కడ నుంచి కనీసం అంబులెన్స్‌ కూడా దొరకడం లేదు. ఏం చేయాలో.. ఎక్కడకి వెళ్లాలో అర్ధం కావట్లేదు’’     – రాగబాబు, నెక్కలం గొల్లగూడెం, ఆగిరిపల్లి మండలం  

‘‘పక్షవాతంతో బాధపడుతున్న నా భర్తతోపాటు కుమారుడు, కోడలు, మనవడితో కలసి ఉంటున్నాం. ఉన్నట్టుండి ఇల్లు మునిగిపోయింది. చుట్టూ పీకల్లోతు నీళ్లు. ఒడ్డుకు చేర్చేందుకు ఎవరైనా వస్తారేమోనని ఎదురు చూస్తూ రాత్రంతా డాబాపై వర్షంలో నిరీక్షించాం. చివరకు నా భర్తను ఓ చెక్కపై కూర్చోబెట్టి చంటి బిడ్డను భుజాన వేసుకుని కర్రల సాయంతో ఒడ్డుకు చేరాం. పీకల్లోతు నీళ్లలో నడుచుకుంటూ వస్తుంటే పోలీసులు మా పక్క నుంచే బోట్లలో వెళ్లారు. రక్షించాలని అరుస్తున్నా వినపడనట్లు వెళ్లిపోయారు. ఫైఓవర్‌ దగ్గరకు వచ్చిన తరువాతనైనా కనీసం మంచి నీళ్లు ఇచ్చే దిక్కు లేకుండా పోయింది’’     
– నందమూరి లక్ష్మి, వాంబే కాలనీ

మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి 
మేం బుడమేరు మధ్య కట్టలో ఉంటున్నాం. ఓ వైపు వరద నీరు.. మరోవైపు పాములు, తేళ్ల భయం. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బతికాం. రెండు రోజుల నుంచి భోజనం లేదు. తాగటానికి నీరు కూడా లేదు. భోజన ప్యాకెట్లు ఇచ్చారంటా. కానీ మా వరకు రాలేదు. ఇచ్చే ప్యాకెట్లు కూడా కొంతమందికే అందుతున్నాయి. సహాయం చేయటానికి వచ్చిన అధికారులు, సింబ్బంది మమల్ని కసురుతున్నారు. ఎలాంటి సహాయం అందలేదు. మమ్మల్ని ఆ దేవుడే కాపాడాలి.    
– మంగ, సరస్వతి, బడమేరు మధ్య కట్ట ఏరియా  

పిల్లలు తప్పిపోయారు 
నేను రిక్షా బండి తోలుకుని బతుకుతా. మమల్ని చూడటానికి మా అమ్మాయి ఊరి నుంచి వచ్చింది. ఆమె కూడా వరదలో చిక్కుకుపోయింది. ఇంట్లో వారికి భోజనం తీసుకువెళదామని ఒడ్డుకు వచ్చా. ఇప్పుడు పోలీసులు నన్ను లోపలికి వెళ్లనీయటంలేదు. లోపల పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు. తాగటానికి నీరు లేదు. తినటానికి తిండిలేదు. నేను బయటకు వచ్చాక నన్ను వెతుకుంటూ మావాళ్లు వచ్చారంటా. వారు తప్పిపోయారు. ఎక్కడ ఉన్నారో తెలియడంలేదు.  
    – కృష్ణ, రిక్షా కార్మికుడు, బొంబాయి కాలనీ, పాయకాపురం

ప్రభుత్వం చెప్పేవన్నీ డొల్ల మాటలే
నా భార్య రెండు రోజుల నుంచి జ్వరంతో బాధపడుతుండటంతో సింగ్‌నగర్‌లోని అమెరికన్‌ ఆస్పత్రికి వస్తే టైఫాయిడ్‌ అన్నారు. అక్కడే ఆస్పత్రిలో చేర్పించాను. ఆకస్మికంగా వరద రావడంతో జర్వంతో బాధపడుతున్న నా భార్యను, పిల్లను తీసుకుని ఒడ్డుకు రావాలని ప్రయత్నించగా, ఎవరూ సాయం చేయలేదు. నిన్నటి నుంచి తిండిలేదు. తాగటానికి నీరులేదు. అతి కష్టం మీద చేతికర్ర సాయంతో వరద నీటి నుంచి ఒడ్డుకు చేరాం. మాతోపాటు ఉన్న రోగులందరూ అలాంటి పరిస్థితే. గర్భిణులు, బాలింతల కూడా నీటిలో నడిచే వస్తున్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు చేపట్టామని చెబుతున్నవన్నీ డొల్ల మాటలే.  
    – శంకర్, మమత, సింగ్‌నగర్‌ ఏరియా 

ఆర్భాటం.. హడావుడే.. సాయం శూన్యం 
శుభకార్యం ఉందని బెంగళూరు నుంచి నాలుగు రోజుల క్రితం విజయవాడ వచ్చా. వరదలో చిక్కుకుపోయా. ఆర్భాటం, హడావిడి తప్పా బాధితులను పట్టించుకునేవారే లేరు. ఎవరెవరో వస్తున్నారు.. చూస్తున్నారు.. వెళ్తున్నారు.. కానీ సహాయం మాత్రం శూన్యం. నీరు, తిండి కోసం అల్లాడాం.       
– సాధిక్, బెంగళూరు  

కట్టుబట్టలతో మిగిలాం 
రెండు రోజుల నుంచి నరకం చూశాం. వరదతో కట్టుబట్టలతో వయటకు వచ్చేశాం. రాజరాజేశ్వరిపేటకు బోట్లు రావటం లేదు. లోపల ఉన్నవారంతా గగ్గోలు పెడుతున్నారు. మా ఇంటిలో సామాన్లన్నీ కొట్టుకుపోయాయి. ఇప్పుడు మా పరిస్థితేంటో అర్థం కావటంలేదు. ప్రభుత్వం పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని చెబుతున్నారు. కానీ మమల్ని అక్కడికి తీసుకెళ్లేనాథుడు ఏరి?  
    – ధనలక్ష్మి, దుర్గాప్రసాద్, రాజరాజేశ్వరిపేట    

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement