సాక్షి, అమరావతి: ఆపరేషన్ రాయల్ వశిష్టతో ప్రభుత్వం చిత్తశుద్ధి రుజువైందని వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు అన్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ‘గత నెల 15న దేవిపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద రాయల్ వశిష్ట బోటు మునిగిపోయింది. 250 అడుగుల లోతులో ఉన్న బోటును బయటకు తీయించాం. బోటు నుంచి 7 మృతదేహాలను బయటకు తీసారు. చివరి మృతదేహం దొరికే వరుకూ మనదే బాధ్యత అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చెప్పారు.
బోటు ప్రమాదం జరిగిన రోజునే సీఎం సమీక్ష నిర్వహించారు. తెలంగాణ మృతుల కుటుంబాలకు కూడా సాయం అందించాలని సీఎం ఆ రోజే చెప్పారు. బాధిత కుటుంబాలకు సాయం అందించే బాధ్యతను కలెక్టర్లకు అప్పగించాం. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా చర్యలు చేపట్టాలని సీఎం ఆదేశించారు’ అని మంత్రి పేర్కొన్నారు. రాయల్ వశిష్ట బోటును బయటకు తీసిన దర్మాడి సత్యం బృందాన్ని మంత్రి కన్నబాబు అభినందించారు.
బోటు ప్రమాదంపై చంద్రబాబు దిగజారుడు రాజకీయాలు చేసారని..ఇప్పుడేం సమాధానం చెబుతారని మంత్రి ప్రశ్నించారు. బోటు ప్రమాదాల నివారణకు ఉన్నతాధికారులతో కమిటీ వేసామని వెల్లడించారు త్వరలోనే కమిటీ నివేదిక ఇవ్వనుందని తెలిపారు. ప్రమాదాల నివారణకు శాశ్వత విధానం తీసుకురావాలని సీఎం ఆదేశించారని తెలిపారు. ఆపరేషన్ రాయల్ వశిష్టలో భాగస్వాములైన అధికారులను కూడా మంత్రి అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment