ప్రతీకాత్మక చిత్రం
పడవ ప్రయాణం ప్రాణాంతకంగా మారుతున్నా, రేవుల్లో అరాచకం రాజ్యమేలుతున్నా పట్టని ప్రభుత్వం సాక్షిగా ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం గోదావరి నదిలో విషాద ఘటన చోటుచేసుకుని 22మంది మరణించారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం మంటూరు గ్రామానికీ, పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లికీ మధ్య అకస్మాత్తుగా వీచిన గాలులకు లాంచీ తలకిందులై ఈ ప్రమాదం సంభవించింది. గల్లంతైన తమ ఆప్తుల ఆచూకీ కోసం గత రాత్రి నుంచి ఆత్రంగా ఆ ప్రాంతానికొచ్చినవారికి కనీసం మంచినీరు అందించే దిక్కయినా అక్కడ లేదు. తలకిందులైన లాంచీని మర్నాడు మధ్యాహ్నానికిగానీ ఒడ్డుకు తీసుకురాలేకపోయారు. అయిదారు రోజుల క్రితమే పాపికొండల సందర్శనకొచ్చిన 120మంది విహారయాత్రికుల పడవకు ఉన్నట్టుండి మంటలు అంటుకున్నాయి. అదృష్టవశాత్తూ అది జరిగిన సమయానికి పడవ ఇసుక తిన్నెకు దగ్గ రగా ఉంది గనుక ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. కానీ వారి లగేజీ, నగదు కాలి బూడిదయ్యాయి. కనీసం ఆరోజైనా రేవుల్లో పర్యవేక్షణ, తనిఖీ సక్రమంగా ఉంటున్నాయో లేదో ప్రభుత్వం సమీక్షించుకుని ఉంటే మంగళవారం విషాద ఘటన చోటుచేసుకునేది కాదు. నిరుడు నవంబర్‌లో కృష్ణానదిలో పడవ బోల్తాపడి 22మంది జలసమాధి అయ్యారు. ఇకపై ఇలాంటి ప్రమాదాలకు తావులేకుండా చేస్తామని ఆరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో హామీ ఇచ్చారు. కొన్ని నెలలు గడిచేసరికల్లా అదంతా గాలికి కొట్టుకుపోయింది.
పడవ ప్రయాణం సురక్షితంగా ఉండటానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలో, ఏ తరహా ప్రమా ణాలు పాటించాలో, ఏఏ విషయాల్లో అప్రమత్తంగా ఉండాలో, వేర్వేరు ప్రభుత్వ విభాగాలు నిర్వ ర్తించాల్సిన బాధ్యతలేమిటో తెలియజెప్పే పుస్తకాన్ని నిరుడు ఏప్రిల్‌లో జాతీయ విపత్తు నివారణ ప్రాధికార సంస్థ(ఎన్‌డీఎంఏ) ప్రచురించింది. దానికి సంబంధించిన పీడీఎఫ్ ఫైలును తన వెబ్ సైట్‌లో ఉంచింది. కానీ చంద్రబాబు సర్కారు దానిపై దృష్టి పెట్టిన దాఖలా లేదు. అవి అమల్లోకి తెచ్చి ఉంటే ఇలాంటి దుర్ఘటనలకు ఆస్కారమే ఉండదు. ఇతర ప్రయాణ సాధనాలతో పోలిస్తే నదీనదాల్లో ప్రయాణం నిజానికి చవకైనది, సురక్షితమైనది. నదిలోనో, సరస్సులోనో చేసే ప్రయా ణం వల్ల అలసట కలగదు. కానీ ఇదంతా ముందు జాగ్రత్తలు తీసుకున్నప్పుడే సాధ్యం. పడవల నిర్వాహకులు, ప్రయాణికులు, ప్రభుత్వ విభాగాలు తగిన నియమనిబంధనలు పాటిస్తే అంతా సవ్యంగా ముగుస్తుంది. ఎక్కడ తేడా వచ్చినా వందలమంది ప్రయాణికుల ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. ముఖ్యంగా పడవ నడిపేవారికి ఆ ప్రాంతంపై క్షుణ్ణంగా అవగాహన ఉండాలి. ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో వెళ్తే ప్రమాదమో, ఏ ప్రాంతంలో నీటి ఉరవడి ఎక్కువుంటుందో తెలిసి ఉండాలి. ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పడవ బయల్దేరే ముందు తప్పనిసరిగా ప్రతిసారీ వివరించగలగాలి. వారు లైఫ్ జాకెట్లు ధరించేలా చూడాలి. ఇవన్నీ అమలు కావాలంటే పడవ నడిపేవారికి ప్రత్యేక శిక్షణ ఇవ్వాలి. వారు ఈ నిబంధనలన్నిటినీ పాటిస్తున్నారో లేదో తరచు తనిఖీలు జరుగుతుండాలి. ఇప్పుడు ప్రమాదంలో చిక్కుకున్న లాంచీలో లైఫ్ జాకెట్లన్నీ కట్టగట్టి మూలన పడేశారని చెబుతున్నారు. అలాగే పెనుగాలులు వీచడం మొదలయ్యాక లాంచీ ఆపేయా లని ప్రయాణికులు మొరపెట్టుకున్నా నిర్వాహకులు లక్ష్యపెట్టలేదని చెబుతున్నారు. పైగా లాంచీ లోని సిమెంట్ బస్తాలు వర్షంలో తడిసిపోకుండా ఉండేందుకు చుట్టూ ఉన్న తలుపుల్ని మూసేశారం టున్నారు. వాటిని తెరిచి ఉంచితే లాంచీపై పెను గాలుల ప్రభావం కాస్తయినా తగ్గేది.
ఈ ప్రమాదం తర్వాత తలెత్తుతున్న మరో ముఖ్యమైన ప్రశ్న–అసలు వాతావరణ విభాగం జారీ చేసే హెచ్చరికల్ని ప్రభుత్వ విభాగాలు సక్రమంగా పట్టించుకుంటున్నాయా? అలా పట్టించుకుని ఉంటే లాంచీ నిర్వాహకులకు పెనుగాలులు వీస్తాయన్న సమాచారం, లాంచీ నడపరాదన్న హెచ్చ రిక చేరి ఉండేది. కానీ దేవీపట్నంలో బయల్దేరిన సమయానికి లాంచీ నిర్వాహకులకు ఇవేమీ చేరిన దాఖలా లేదు. కనీసం రేవులో ప్రభుత్వ సిబ్బంది పర్యవేక్షణ, పోలీసుల పహారా కట్టుదిట్టంగా ఉంటే వారైనా ఆ లాంచీ కదలకుండా చూసేవారు. అసలు లాంచీలు, పడవలకు ఫిట్‌నెస్ ఉందో లేదో... వాటిని నడుపుతున్నవారికి లైసెన్స్‌లున్నాయో లేదో చూసే నాథుడెవరూ లేరు. అత్యధిక పడవలు, లాంచీలకు అసలు అనుమతులే లేవని చెబుతున్నారు. ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రాంతంలో 70 పడవలు తిరుగుతుంటే అందులో ఒకే ఒక్క పడవకు అనుమతులున్నాయంటున్నారు.
పడవలు, లాంచీల నిర్వాహకులకు వాటి నిర్వహణ, భద్రత విషయంలో తగిన శిక్షణ ఇవ్వ డంతోపాటు తనిఖీ సిబ్బందికి సైతం ఆ విషయాల్లో అవగాహన కలిగించాలని ఎన్‌డీఎంఏ మార్గ దర్శకాలు చెబుతున్నాయి. అలాగే పాతబడినవాటి స్థానంలో కొత్త పడవలు, లాంచీలు సమ కూర్చుకోవడానికి ప్రోత్సాహకాలు, సబ్సిడీలు కల్పించాలని, అవి నిర్దిష్టమైన డిజైన్‌లకు లోబడి ఉండాలని కూడా ఆ మార్గదర్శకాలు సూచిస్తున్నాయి. పడవల్లో, లాంచీల్లో గ్యాస్ సిలెండర్లు, కిరోసిన్ స్టౌలు, చమురు దీపాలు తీసుకెళ్లరాదన్న నిబంధన కూడా ఉంది. మర పడవలు, సాధారణ పడవలు పాటించాల్సిన నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. ఎన్‌డీఎంఏ మార్గదర్శకాలను అమలు చేయాల్సిన బాధ్యత, వాటి అమలు కోసం పర్యవేక్షక యంత్రాంగాన్ని నియమించే కర్తవ్యం రాష్ట్ర ప్రభుత్వాలదే. పాత ఉదంతాల సంగతలా ఉంచి, నవంబర్‌లో జరిగిన ప్రమాదం తర్వాతనైనా ఇందులో ఎన్నిటిని అమలులోకి తెచ్చారో బాబు చెప్పగలరా? లంకల్లో, తీరప్రాంతాల్లో నివసిస్తూ రోడ్డు సౌకర్యం లేనివారూ, విహారయాత్రకొచ్చేవారూ పాలకుల అమానవీయ నిర్లక్ష్యం పర్యవసానంగా పెను ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇంకె న్నాళ్లు ఈ నిర్లక్ష్యం కొనసాగుతుందో, మరెందరు బలైతే తన ప్రభుత్వం మేల్కొంటుందో బాబు చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment