సాక్షి, కాకినాడ : గోదావరి నదిలో మునకకు గురయిన లాంచీ ఆచూకీ ఎట్టకేలకు లభ‍్యమైంది. పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం వాడపల్లి సమీపంలో గోదావరిలో 60 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. భారీ క్రేన్ల సాయంతో లాంచీని వెలికితీసి ఒడ్డుకు తరలించారు. కాగా లాంచీలోని పలువురి ప్రయాణికుల మృతదేహాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కార్తీకేయ ఘటనా స్థలంలో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
- ఇప్పటివరకూ 12 మృతదేహాలు వెలికితీత
- భారీ క్రేన్ల సాయంతో లాంచీని ఒడ్డుకు చేర్చిన ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
- మృతుల్లో ఇద్దరు కవల పిల్లలు రాముడు-లక్ష్మణుడు
- సంఘటనా స్థలానికి చేరుకున్న చంద్రబాబు నాయుడు
- సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న ముఖ్యమంత్రి
కాగా దుర్ఘటన జరిగిన ప్రదేశం రెండు కొండల మధ్య ఉండటం.. ఇసుకలో ఇరుక్కుని ఉండటంతో లాంచీని బయటకు తీయటానికి ఎక్కువ సమయం పట్టింది. 60 అడుగుల లోతులో ఉన్న బోటులోనే మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఎంతమంది ఉన్నారు అనేది ఇంకా నిర్థారించలేదు. కనీసం 40 మంది వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. వీరంతా దేవీపట్నం, పోలవరం, రంపచోడవరం గ్రామాలకు చెందినవారు. మంగళవారం రాత్రి సమయంలో భారీ వర్షం, ఈదురుగాలులు రావటంతో అందరూ బోటు లోపలికి వెళ్లారు. గాలుల నుంచి రక్షణ కోసం బోటు అద్దాలు మూసివేశారు.
ఆ తర్వాత ఒక్కసారిగా వచ్చిన ఈదురుగాలులకు బోటు తిరగబడింది. బోటు పైన కూర్చున్న 15 మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. లోపల ఉన్న 40 మంది జలసమాధి అయ్యారు. బోటులో ఉన్న సిమెంట్ బస్తాలు తడవకుండా ఉండటం కోసం బోటు నడిపే వ్యక్తి తీసుకున్న అతి ఉత్సాహం.. ఈ ప్రమాదం జరగటానికి కారణంగా తెలుస్తోంది. దేవీపట్నం నుంచి 25 కిలోమీటర్ల దూరంలో ఈ కొండమొదలు అనే ప్రాంతం ఉంది. వారికి రోడ్డు సదుపాయం లేదు. దీంతో దాదాపు 50 ఏళ్ల నుంచి వారికి రవాణా సదుపాయం బోటేనని పశ్చిమగోదావరి జిల్లా పోలీసు సూపరింటెండెంట్ ఎం రవిప్రకాశ్ చెప్పారు. రోజువారీ కార్యక్రమాలు, నిత్యావసర వస్తువులు కొనుగోలు, బ్యాంకు పనుల నిమిత్తం ప్రయాణికులంతా మంగళవారం సాయంత్రం 4.30 గంటల సమయంలో దేవీపట్నం వచ్చి వెనుదిరిగి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని ఆయన తెలిపారు.
తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం-కొండమొదలు మధ్య మంటూరు ఎగువ వద్ద ప్రయాణీకులతో వెళుతున్న లాంచీ ఈదురు గాలుల తాకిడితో నీట మునిగిన విషయం విదితమే. ప్రమాద సమయంలో లాంచీలో సుమారు 55మంది ఉండగా, వారిలో 15 మంది వరకు ఈదుకుంటూ తప్పించుకున్నారు. మిగతావారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. విశాఖ నుంచి నేవీ ప్రత్యేక సహాయక బృందంతో పాటు బోటు మునిగిన ప్రాంతం వద్ద గజ ఈతగాళ్ళతో గాలింపు చర్యలు చేపట్టారు. అలాగే నేవల్ డోర్నియర్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో పాటు మూడు హెలికాప్టర్లు రంగంలోకి దిగాయి. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బోటు ప్రమాదంపై సమీక్ష నిర్వహించారు. గాలింపు, సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.
(మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
Comments
Please login to add a commentAdd a comment