సాక్షి, అమరావతి: దేవీపట్నం బోటుప్రమాదంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద విషయం తెలియగానే ఉన్నతాధికారులతో అనుక్షణం సమీక్షలు నిర్వహించారు. యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని, న్డీఆర్‌ఎఫ్ బృందాలను.. నేవీ, ఓఎన్‌జీసీ హెలికాప్టర్లను తక్షణమే రంగంలోకి దింపాలని ఆదేశించారు. ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని అందుబాటులో ఉన్న మంత్రులకు ఆదేశాలిచ్చారు. ఈ ప్రమాదాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోందని సీఎం జగన్ స్పష్టం చేశారు. బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నట్టు ప్రకటించారు. తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని అధికారులను కోరారు.
తక్షణమే అన్ని బోటు సర్వీసులను సస్పెండ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న బోట్లు ప్రయాణానికి అనుకూలమా? కాదా? అన్న దానిపై క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని, లైసెన్స్‌లను పరిశీలించాలని, బోట్లను నడిపేవారు, అందులో పని చేస్తున్న వారికి తగిన శిక్షణ, నైపుణ్యం ఉందా? లేదా? తనిఖీ చేయాలని ఆదేశాలిచ్చారు. ముందు జాగ్రత్త చర్యలకు సంబంధించిన పరికరాలు బోట్లలో ఉన్నాయా? లేవా? అనే విషయాన్ని పరిశీలించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు నిపుణులతో పటిష్టమైన మార్గదర్శకాలు రూపొందించి తనకు నివేదించాలని అధికారులను కోరారు. సహాయ కార్యక్రమాల కోసం తీసుకుంటున్న చర్యలపై వివరాలను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి, సంతాపాన్ని తెలిపిన సీఎం జగన్ బాధిత కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం ఇవ్వనున్నట్లు ప్రకటించారు.
నేడు ఘటనా స్థలికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బోటు ప్రమాదానికి గురైన ప్రాంతాన్ని పరిశీలించేందుకు సోమవారం వెళ్తారు. ఉదయం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి దేవీపట్నం మండలం కచ్చులూరులోని ఘటనా స్థలికి చేరుకుంటారు. అనంతరం ఏరియల్ సర్వే నిర్వహించి, రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రభుత్వాస్పత్రికి వెళ్లి.. ప్రమాదం నుంచి బయటపడిన క్షతగాత్రులను, వారి బంధువులను పరామర్శిస్తారు.
Comments
Please login to add a commentAdd a comment