పునరావృతం కారాదు | CM YS Jagan Serious On Boat Accident | Sakshi
Sakshi News home page

పునరావృతం కారాదు

Published Tue, Sep 17 2019 4:15 AM | Last Updated on Tue, Sep 17 2019 3:48 PM

CM YS Jagan Serious On Boat Accident - Sakshi

భర్తను, 12 ఏళ్ల బిడ్డను పోగొట్టుకుని తానెందుకు బతికి ఉన్నానో తెలియడం లేదని ఒక మహిళ పడుతున్న బాధను చూసినప్పుడు మనసు కలచివేసింది. భవిష్యత్‌లో మరో కుటుంబానికి ఈ కడుపుకోత రాకూడదు అనిపించింది.
– సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధుల బృందం, రాజమహేంద్రవరం: ‘భవిష్యత్‌లో ఇటువంటి ప్రమాదాలు పునరావృతం కాకూడదు. ఎవరింటిలోనూ ఇలాంటి కడుపు కోత ఉండకూడదు. నిబంధనలు ఉన్నా అమలు చేయకుండా జీవోలకు పరిమితం కావడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రైవేటు ఆపరేటర్లపై ఎవరికీ అధికారం లేకపోతే ఎలా? అవసరమైతే ప్రైవేటు లాంచీలను ఆపేయండి. భవిష్యత్తులో ప్రమాదాలు జరగకుండా నివారించడానికి కమిటీ ఏర్పాటు చేస్తున్నాను. మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలి. మరో మూడు వారాల్లో నివారణ చర్యలు చేపట్టాలి’ అని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాద ఘటనపై ఆయన తీవ్రంగా స్పందించారు. సోమవారం ఉదయం ఆయన రాజమహేంద్రవరం చేరుకుని హెలికాఫ్టర్‌ ద్వారా ప్రమాద స్థలాన్ని ఏరియల్‌ వ్యూ ద్వారా పరిశీలించారు. అనంతరం రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి చేరుకుని ప్రమాదం నుంచి బయటపడి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. ప్రతి ఒక్కరినీ పలుకరించారు. ప్రమాదం ఎలా జరిగిందీ, తర్వాత ప్రభుత్వం నుంచి సేవలు ఎలా అందుతున్నాయన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం సబ్‌కలెక్టర్‌ కార్యాలయంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, మంత్రులతో సమీక్ష నిర్వహించారు.

చాలా బాధనిపించింది..
ప్రమాద విషయం తెలిసిన వెంటనే చాలా బాధపడ్డానని, బాధితులను పరామర్శించినప్పుడు వారు చెబుతున్న మాటలు విని ఇంకా బాధనిపించిందని సీఎం అన్నారు. ప్రమాదానికి గురైన బోట్‌లో ఎంత మంది ఉన్నారు.. అందులో తెలంగాణా వారు ఎంత మంది.. ఆంధ్రా వాళ్లు ఎంతమంది? వాళ్లలో ఎంత మంది బయటపడ్డారు.. ఇంకా ఎంత మంది ఆచూకీ తెలియాల్సి ఉంది? రెస్క్యూ ఆపరేషన్‌ ఎలా సాగుతోందని సీఎం కలెక్టర్‌ను ప్రశ్నించారు. దీనికి కలెక్టర్‌ మురళీధరరెడ్డి సమాధానం చెబుతూ 73 మంది వెళ్లారని, అందులో 41 మంది తెలంగాణా వారు, 24 మంది ఆంధ్రపదేశ్‌కు చెందిన పర్యాటకులు ఉండగా, ఎనిమిది మంది బోట్‌ సిబ్బంది ఉన్నారన్నారు.
రాజమహేంద్రవరం సబ్‌కలెక్టరేట్‌ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

మొత్తం 73 మందిలో 27 మంది సురక్షితంగా బయటకురాగా 46 మంది గల్లంతయ్యారని, అందులో ఎనిమిది మృతదేహాలు లభ్యమయ్యాయని కలెక్టర్‌ చెప్పారు. చనిపోయిన వారిలో ఐదుగురు తెలంగాణ వారున్నారని చెప్పారు. బోటు ప్రమాదానికి గురైన చోట 315 అడుగుల లోతు ఉన్నట్లు రెస్క్యూ టీమ్‌లు గుర్తించాయని, రెండువైపులా కొండలు ఉండటం వల్ల అక్కడికి ఏ విధమైన పరికరాలు తీసుకువెళ్లడానికి వీలు లేకుండా ఉందన్నారు. కాకినాడ పోర్టుకు చెందిన టీమ్‌ అక్కడికి చేరుకుందని, వారి సూచనల మేరకు రెస్క్యూ ఆపరేషన్‌ చేపడుతున్నట్లు కలెక్టర్‌ వివరించారు. ధవళేశ్వరం బ్రిడ్జి వద్ద కూడా లైటింగ్‌ ఏర్పాటు చేసి వెతికిస్తున్నామని, గేట్లను కూడా దించి వేశామని చెప్పారు.
 
ప్రతి అంశాన్నీ దృష్టిలో పెట్టుకోవాలి
ఇప్పటి వరకు ఎన్ని బోట్లకు అనుమతులు ఇచ్చారని కాకినాడ పోర్టు అధికారులను ముఖ్యమంత్రి ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా టూరిజంకు సంబంధించి 81 బోట్లకు అనుమతి ఇవ్వగా, అందులో 68 బోట్లు ఉభయ గోదావరి జిల్లాల్లో ఉన్నాయన్నారు. వాటికి ఏడాదికి ఒకసారి లైసెన్స్‌ ఇస్తున్నామని చెప్పారు. దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ ఈ లైసెన్స్‌లు ఇచ్చేటప్పుడు ప్రతి అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ఏడాదికోసారి కాకుండా పీరియాడిక్‌గా తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎంత వరద వచ్చినప్పుడు బోటు తిరగకూడదన్న అంశాన్ని కూడా పునఃపరిశీలించాలని సూచించారు. గతంలో మొదటి ప్రమాద హెచ్చరిక అంటే పది లక్షల క్యూసెక్కుల వరద వచ్చే వరకూ బోట్‌కు అనుమతి ఇవ్వవచ్చని, కానీ ఇప్పుడు ఐదు లక్షల క్యూసెక్కులకే బోటు ప్రమాదానికి గురైనందున తగిన పరిశీలన అవసరమన్నారు. 

కంట్రోల్‌ రూమ్‌ లేకపోతే ఎలా?
కంట్రోల్‌ రూమ్‌ ఉండాలని జీవోలలో ఉన్నా ఇప్పటి వరకు ఎందుకు ఏర్పాటు చేయలేదని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 2018 నవంబర్‌ నుంచి ఈ ఏడాది నవంబర్‌ వరకు ఈ బోటుకు అనుమతి ఉందని, అయితే వరద ఎక్కువగా ఉండటం వల్ల ప్రభుత్వ బోట్లు ఆపి ఉన్నాయని తెలిసి కూడా పోలీసులు ఆ బోటులోకి వెళ్లి ప్రయాణికుల ఫొటోలు తీసుకుని, బోటు మంచిగా ఉందా లేదా అని తనిఖీలు చేసి ఎలా వదిలిపెట్టారని ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బోట్లు ఆగినప్పుడు ఈ బోట్లు ఎందుకు తిరుగుతున్నాయో పోలీసులు ప్రైవేటు బోటు వాళ్లు ఎందుకు చెప్పలేకపోయారని ప్రశ్నించారు. ‘ఇరిగేషన్, పోలీస్, టూరిజం కలిపిన కంట్రోల్‌ రూమ్‌ అన్నదే లేదు.. లైసెన్స్‌లు ఇచ్చేవారు లైసెన్స్‌లు ఇస్తారు.. కంట్రోల్‌ రూమ్‌ ఉండదు. ప్రభుత్వ బోట్లను నియంత్రించే పరిస్ధితి ఉంది గానీ, ప్రైవేటు బోట్లను నియంత్రించే పరిస్థితి మాత్రం లేదు.. లైసెన్స్‌ ఇచ్చేటప్పుడు ఆ బోటు పరిస్థితి ఎలా ఉంది అనేది చూసుకోనక్కరల్లేదా?’ అని ముఖ్యమంత్రి నిలదీశారు.

ప్రైవేటు బోట్ల మీద అజమాయిషీ చేయలేం అనుకున్నప్పుడు ఈ కంట్రోల్‌ రూములు ఎందుకని ప్రశ్నించారు. ‘ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యల కోసం, ప్రస్తుత ఘటనపై విచారణకు ఇరిగేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నా. సభ్యులుగా రెవెన్యూ చీఫ్‌ సెక్రటరీ, టూరిజం ప్రిన్సిపల్‌ సెక్రటరీ, లా అండ్‌ ఆర్డర్‌ అదనపు డీజీ, కమిటీ కన్వీనర్‌గా తూర్పు గోదావరి కలెక్టర్‌ ఉంటారు’ అని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ ఘటనపై మూడు వారాల్లో నివేదిక ఇవ్వాలని, 45 రోజులలో చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తాను మరోసారి జిల్లాకు వచ్చేటప్పటికి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని, దానిని తానే ప్రారంభిస్తానని సీఎం చెప్పారు. పోర్టులను కూడా ఈ కంట్రోల్‌ రూమ్‌ పరిధిలోకి తీసుకొస్తామన్నారు. 

గత ప్రభుత్వ తప్పిదం వల్లే ప్రమాదం 
ఈ ప్రమాదం బోటు నిర్వాహకుల నిర్లక్ష్యం వల్లే జరిగిందని, ఇందులో గత ప్రభుత్వ నిర్వాకం కనిపిస్తోందని తెలంగాణా మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు విమర్శించారు. తెలంగాణ నుంచి ఎక్కువ మంది వచ్చారని, చాలా వరకు మృతదేహాలు కూడా దొరకలేదన్నారు. ప్రైవేటు ఆపరేటర్లపై ఎవరికీ అధికారం లేకుండా గత ప్రభుత్వం ఇచ్చిన జీవో వల్లే ఈ ప్రమాదం జరిగిందన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే ఏపీ ముఖ్యమంత్రి స్పందించిన తీరు బావుందని ప్రశంసించారు.

ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రులు ఆళ్ల నాని, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, హోం మంత్రి సుచరిత, మంత్రులు కురసాల కన్నబాబు, పినిపె విశ్వరూప్, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, అనిల్‌ కుమార్‌ యాదవ్, తానేటి వనిత, అవంతి శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్‌ దాడిశెట్టి రాజా, ఎంపీలు మార్గాని భరత్, వంగా గీత, గొట్టేటి మాధవి, తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్, ఎమ్మెల్యేలు నాగులపల్లి ధనలక్ష్మి, తలారి వెంకట్రావు, జక్కంపూడి రాజా, చెల్లుబోయిన వేణు, చిర్ల జగ్గిరెడ్డి, పార్టీ నాయకులు అనంతబాబు, దవులూరి దొరబాబు, బొంతు రాజేశ్వరరావు, కవురు శ్రీనివాస్, ఆకుల వీర్రాజు, రౌతు సూర్య ప్రకాశరావు, డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ కమిషనర్‌ ఏఆర్‌ అనురాధ, అదనపు డీజీ రవిశంకర్‌ అయ్యనార్, జిల్లా ఎస్పీ నయీమ్‌ అస్మిన్‌ తదితరులు పాల్గొన్నారు. 

భర్తను, 12 ఏళ్ల బిడ్డను పోగొట్టుకుని తానెందుకు బతికి ఉన్నానో తెలియడం లేదని ఒక మహిళ పడుతున్న బాధను చూసినప్పుడు మనసు కలచివేసింది. భవిష్యత్‌లో మరో కుటుంబానికి ఈ కడుపుకోత రాకూడదు అనిపించింది. 

ఏదైనా ఘటన జరిగినప్పుడు నాకు సంబంధం లేదనుకోవడం ఒక పద్ధతి అయితే, దానిని సరిదిద్దుకోవడం మరో పద్ధతి. నేను రెండో పద్ధతినే ఎంచుకుంటున్నా. అందుకే ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షలు, చిన్న చిన్న గాయాలైన వారికి రూ.3 లక్షలు, ప్రమాదం నుంచి బయటపడిన వారికి లక్ష రూపాయలు ఇవ్వాలని నిర్ణయించాం.

ఇంతమంది ప్రాణాలు పోయాయంటే దీనికి కారణం ఎవరు? 2018లో ఇచ్చిన జీవోను గత ప్రభుత్వం అమలు చేసి ఉంటే ఈ  ప్రమాదం జరిగి ఉండేది కాదు. ఇందులో మన బాధ్యత కూడా ఉంటుంది. మన తప్పు మనం తెలుసుకోవాలి. ఇక నుంచి ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. 

నేను ఇంకోసారి జిల్లాకు వచ్చేటప్పటికి కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలి. దానిని నేనే ప్రారంభిస్తాను. ప్రతి బోటును చెక్‌ చేసిన తర్వాతే పంపించాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement