హెలికాప్టర్ ద్వారా సహాయక చర్యలు చేపడుతున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది
సాక్షి, అమరావతి, విశాఖపట్నం, గుంటూరు రూరల్ : తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు ప్రాంతంలో జరిగిన బోటు (లాంచీ) ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన స్పందించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు మంత్రులు, అధికారులు తక్షణమే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టడంతో ఎక్కువ మంది ప్రాణాలు కాపాడగలిగారు. ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు మంత్రులు, అధికారులతో మాట్లాడి సహాయ చర్యలను వేగవంతం చేశారు. మంత్రి కన్నబాబు, ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్ తదితర మంత్రులు, ఉన్నతాధికారులు సహాయక చర్యలను పర్యవేక్షించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
డీజీపీ గౌతమ్ సవాంగ్, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీతో మాట్లాడి సహాయక చర్యలపై పలు సూచనలు చేశారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇప్పటికే 8 ఈఆర్ బృందాలు, 12 ప్రత్యేక గజ ఈతగాళ్ల బృందాలు, 6 ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు, రెండు ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, ఒక నావీ చాప్టర్, ఓఎన్‌జీసీ చాప్టర్ ప్రత్యేక బృందాలు, నేవీ బృందాలతో పాటు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు. మరో రెండు నేవీ గజ ఈతగాళ్ల బృందాలను రప్పిస్తున్నారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు ప్రత్యేకంగా సైడ్ స్కాన్ సోనార్ పరికరాలను వినియోగిస్తున్నారు. ప్రమాదంలో గల్లంతైన వారు గోదావరి ఉధృతికి కొట్టుకుపోకుండా ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నెట్ (వల) ఏర్పాటు చేశారు. కాగా, తక్షణ సహాయక చర్యలు చేపట్టడంతో 27 మందిని కాపాడగలిగామని రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ ప్రకటించింది. ఈ ఘటనలో 12 మంది మృతి చెందగా మరో 37 మందికి పైగా గల్లంతైనట్టు ఆ శాఖ పేర్కొంది. గాలింపు కోసం సోమవారం ఉత్తరాఖండ్ నుంచి ప్రత్యేక బృందాలను రప్పిస్తున్నట్టు ప్రకటించింది.
గాలింపులో నేవీ హెలికాఫ్టర్లు
లాంచీ ప్రమాదంలో గల్లంతైనవారి కోసం గాలింపు చర్యల్లో భారత నావికాదళం పాలుపంచుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వ వినతి మేరకు జెమిని బోట్, గాలింపు చర్యలకు ఉపకరించే సామగ్రితో పాటు 20 మంది సుశిక్షితులైన డీప్ సీ డ్రైవర్స్‌ను నేవీ డోర్నియర్‌లో పంపించారు. ఇది నేవల్ ఎయిర్ స్టేషన్ ఐఎన్‌ఎస్ డేగా నుంచి బయల్దేరి ఆదివారం సాయంత్రం రాజమహేంద్రవరం చేరుకుంది. సోమవారం రెండు నేవీ హెలికాఫ్టర్లు సహాయక చర్యల్లో పాల్గొననున్నాయి.
ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ
లాంచీ ప్రమాదంపై పూర్తి స్థాయి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని హోం మంత్రి సుచరిత స్పష్టీకరించారు. బోటు అనుమతులు, ఇతర విషయాలపై ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బాధిత కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పారు.
బోటు ప్రమాదంపై సీఎస్ సమీక్ష
బోటు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తూర్పు గోదావరి కలెక్టర్ మురళీధర్‌రెడ్డి, విపత్తుల నిర్వహణ కమిషనర్ కె.కన్నబాబు, ఇతర అధికారులతో టెలిఫోన్‌లో సమీక్షించారు. ప్రమాదం నుంచి బయటపడిన వారికి తక్షణమే మెరుగైన వైద్యసేవలు అందించే ఏర్పాట్లు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులకు సూచించారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషితోనూ సుబ్రహ్మణ్యం మాట్లాడారు.
ప్రతీ క్షణం అప్రమత్తం
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ ఘటనపై ఇప్పటికే రెండు సార్లు అధికారులతో సమీక్ష జరిపారని, ప్రతీ క్షణం అప్రమత్తతతో వ్యవహరిస్తున్నామని హోం శాఖ మంత్రి సుచరిత తెలిపారు. ఆదివారం గుంటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె విలేకరులతో మాట్లాడారు. సమీప జిల్లాల్లోని అధికారులందరూ ప్రమాద స్థలానికి చేరుకుని గాలింపు, సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారని వివరించారు. రాత్రి సమయంలో గాలింపు చర్యలకు ఆటంకం కలుగకుండా ప్రత్యేక లైట్లు, నేవీ ప్రత్యేక లైటింగ్ బోట్లు, హెలికాప్టర్లను ఏర్పాటు చేశామన్నారు. గ
ల్లంతైన వారి కోసం నదీ పరీవాహక ప్రాంతాల్లో సముద్రం వరకు అక్కడక్కడ సహాయక, సమాచార కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి క్షణం అప్రమత్తతతో వేలాది మందితో సహాయక చర్యలు ముమ్మరంగా చేపట్టామని మంత్రి వివరించారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో సిబ్బందితో కలిపి 71 మందికి పైగా ఉన్నారని, వారిలో ఇప్పటి వరకు రెస్క్యూ బృందాలు 27 మందిని ప్రాణాలతో కాపాడాయని చెప్పారు. 12 మంది మృతదేహాలను వెలికి తీశారని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment