పడవ జాడ కోసం  | Ongoing operation in Godavari for Boat lift out | Sakshi
Sakshi News home page

పడవ జాడ కోసం 

Published Wed, Sep 18 2019 4:26 AM | Last Updated on Wed, Sep 18 2019 9:31 AM

Ongoing operation in Godavari for Boat lift out - Sakshi

దేవీపట్నం నుంచి ‘సాక్షి’ ప్రతినిధి బృందం:  గోదావరి నదిలో 72 మంది పర్యాటకులతో ప్రయణిస్తున్న ప్రైవేట్‌ టూరిజం బోటు రాయల్‌ వశిష్ట గల్లంతై మంగళవారం సాయంత్రానికి 53 గంటలు గడిచాయి. ప్రమాదానికి గురైన బోట్‌ను వెలికి తీసేందుకు ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, నావికాదళం బృందాలు శ్రమిస్తున్నాయి. ఇందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని రాష్ట్ర ప్రభుత్వం వినియోగిస్తోంది. తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు మందం వద్ద ప్రైవేట్‌ బోటు ఆదివారం గోదావరిలో మునిగిపోయింది. అదే రోజు సాయంత్రం విపత్తుల నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. మూడు రోజులుగా ఎన్‌డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్, నేవీ బృందాలు, నేవీ హెలికాప్టర్‌లు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి.

ఉత్తరాఖండ్‌కు చెందిన ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బందిని కూడా ప్రభుత్వం రంగంలోకి దించింది. ఉత్తరాఖండ్‌ ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది వెంట తీసుకొచ్చిన అత్యాధునిక కెమెరా సహాయంతో నీటి అడుగున బోటు జాడను తెలుసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. గోదావరిలో 214 అడుగుల లోతున బోటు ఉన్నట్లు గుర్తించారు. జర్మనీకి చెందిన డ్రాగర్‌ కంపెనీ తయారు చేసిన ఆధునిక యంత్రాన్ని నేవీ అధికారులు ఘటనా స్థలానికి తీసుకొచ్చారు. ఈ యంత్రం ద్వారా రెస్క్యూ టీమ్‌ సభ్యుడిని బోటు వద్దకు పంపించి, సురక్షితంగా వెనక్కి తీసుకురావొచ్చని అధికారులు చెబుతున్నారు. అవసరాన్ని బట్టి ఈ యంత్రాన్ని ఉపయోగిస్తామని అంటున్నారు. గత మూడు రోజులుగా రంపచోడవరం ఐటీడీఏ పీఓ నిషాంత్‌కుమార్‌ ఘటనా స్థలం వద్ద రెస్క్యూ ఆపరేషన్‌ను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం సాయంత్రం ఘటనా స్థలంలో ఈదురు గాలులతో కూడిన ››వర్షం కురవడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు.  

మృతదేహాల జాడ వెతికే పనిలో..
కచ్చులూరు మందం వద్ద గోదావరిలో బోటు మునిగిన ప్రదేశంలో మృతదేహాల జాడ కనిపెట్టేందుకు సహాయక సిబ్బంది కృషి చేస్తున్నారు.  కచ్చులూరు మత్స్యకారులకు చెందిన 17  బోట్లతోపాటు రెస్క్యూ టీమ్‌ బోట్లు కచ్చులూరు నుంచి పోలవరం కాఫర్‌ డ్యామ్‌ వరకు ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నాయి. ఈ ఏడాది జూలై నుంచి సెప్టెంబర్‌ వరకు గోదావరికి మూడు సార్లు వరదలు వచ్చాయి. బోటు బోల్తా పడిన సమయంలో గోదావరిలో నీటి ప్రవాహం ఉధృతంగా ఉంది. మంగళవారం సాయంత్రానికి గోదావరిలో నీటి మట్టం పది అడుగుల మేర తగ్గింది. దీంతో గల్లంతైన వారి మృతదేహాలు గోదావరి ఒడ్డున పొదల్లో చిక్కుకునే అవకాశం ఉందని, ఆయా ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపడతామని అధికారులు పేర్కొంటున్నారు.  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement