
రంపచోడవరం/దేవీపట్నం: తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు మందం వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటును వెలికితీసే పనుల్లో సోమవారం మరికొంత పురోగతి కనిపించింది. బోటు ముందు భాగంలో ఉండే ప్లాట్‌ఫామ్, బోటు క్యాబిన్‌లోని కొంత భాగం, హైడ్రాలిక్ గేర్‌రాడ్, రెయిలింగ్‌లోని కొంత భాగం, బోటు టాప్‌పై ఉండే ప్లాస్టిక్ షీట్, బోటు నేమ్ బోర్డును బయటకు తీశారు. లంగర్లకు చిక్కినట్టే చిక్కి.. పట్టు జారటంతో బోటు మొత్తాన్ని బయటకు తీయడం వీలు కాలేదు.
పోర్టు అధికారి కెప్టెన్ ఆదినారాయణ ఆధ్వర్యంలో బోటును వెలికితీసే ఆపరేషన్ ఆరో రోజుకు చేరింది. ధర్మాడి సత్యం బృందం, విశాఖ నుంచి వచ్చిన ఓం శివశక్తి అండర్ వాటర్ సర్వీసెస్‌కు చెందిన 10 మంది డీప్ వాటర్ మెరైన్ డైవర్లు మట్టి, బురదలో కూరుకుపోయిన బోటును వెలికితీసే పనుల్లో నిమగ్నమయ్యారు. ప్రస్తుతం బోటు ముందు భాగం 30 అడుగులు, వెనుక భాగం నది వైపు 50 అడుగుల లోతులో ఉన్నట్లు వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment