![Nandyal Residents In Godavari Boat Accident in Devipatnam - Sakshi](/styles/webp/s3/article_images/2019/09/17/nandyal-boat-accidents.jpg.webp?itok=8xqoo-q-)
సాక్షి, నంద్యాల(కర్నూలు) : తూర్పు గోదావరి జిల్లా కట్టలూరు గ్రామ సమీప గోదావరి నదిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో నంద్యాల వాసులు గల్లంతయ్యారు. పట్టణంలోని రెవెన్యూ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న సీనియర్ లాయర్ రామకృష్ణారెడ్డి కుటుంబ సభ్యులు బోటు ప్రమాదంలో అదృశ్యమైనట్లు బంధువులు తెలిపారు. రామకృష్ణారెడ్డి కుమారుడు మహేశ్వరరెడ్డి హైదరాబాద్ నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.
మహేశ్వరరెడ్డి భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్‌లోనే ఉంటున్నాడు. శుక్రవారం తండ్రి రామకృష్ణారెడ్డికి ఫోన్‌చేసి కుటుంబ సభ్యులతో కలిసి గోదావరి నది చుట్టూ ఉన్న పర్యాటక ప్రాంతాలకు విహారయాత్రకు వెళ్తునట్లు చెప్పాడు. గోదావరి నదిలో ఆదివారం బోటు ప్రమాదం జరిగినట్లు వార్తలు రావడంతో రామకృష్ణారెడ్డి ఆందోళనకు గురయ్యాడు. మహేశ్వరరెడ్డికి ఎన్నిసార్లు ఫోన్‌చేసినా..సెల్ పనిచేయకపోవడంతో విశాఖపట్టణం గాజువాకలోని వారి బంధువులకు విషయం తెలియజేశాడు. బంధువులు సంఘటన స్థలానికి వెళ్లి, మహేశ్వరెడ్డికి చెందిన కారు పార్కింగ్‌లో ఉన్నట్లు గుర్తించారు. మహేశ్వరెడ్డి జాడ తెలియడం లేదని రామకృష్ణారెడ్డికి ఫోన్ చేయడంతో హుటాహుటిన ఆయన సోమవారం మధ్యాహ్నం దేవిపట్నానికి బయలుదేరాడు. (చదవండి : నిండు గోదారిలో మృత్యు ఘోష)
Comments
Please login to add a commentAdd a comment