
విలేకరులతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారధి
సాక్షి, విజయవాడ : దేవీపట్నంలో జరిగిన లాంచీ ప్రమాదం దురదృష్టకరమని వైఎస్సార్ సీపీ నేత కొలుసు పార్థసారధి విచారం వ్యక్తం చేశారు. దేవిపట్నం సంఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. 8 నెలల కిందట కృష్ణా జిల్లాలో ఇటువంటి ప్రమాదమే జరిగిందని గుర్తు చేశారు. అయినప్పటికీ ఎటువంటి అనుమతులు లేని బోటు యజమానుల నుంచి ముడుపులు తీసుకుని మరిన్ని ప్రమదాలకు ప్రభుత్వం కారణమవుతోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన పదవీకాలం ముగిసిపోతుందనే ఆందోళనలో ఉండిపోయి.. ప్రజలకు రక్షణ కల్పించవలసిన వ్యక్తిగా తన బాధ్యతలు గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నన్ను కాపాడండి, నా ప్రభుత్వాన్ని కాపాడండి అంటూ నిస్సహాయంగా ప్రజలను బాబు అర్ధించడం హాస్యాస్పదమ’ని ఆయన వ్యాఖ్యానించారు. కాగా ప్రమాద బాధితులకు, వారి కుటుంబాలకు అండగా నిలవాలని వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలను ఆదేశించారని తెలిపారు.
ఆడవాళ్లకు రక్షణ ఏది..?
రాష్ట్రంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని పార్థసారధి ఆవేదన వ్యక్తం చేశారు. ముడుపుల కోసం తెలుగుదేశం పార్టీ ఇటువంటి అమానవీయ ఘటనలకు తావిస్తోందని ఆరోపించారు. బాలికలపై అత్యాచారాలను అరికట్టలేని అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. ఇటువంటి ఘటనల ద్వారా ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం కోల్పోయారని పేర్కొన్నారు. ఇంత దౌర్భాగ్యమైన పాలన తానెక్కడా చూడలేదని ఆయన విమర్శించారు.
ఒక్క రంగమైనా అభివృద్ధి చెందిందా..?
చంద్రబాబు ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత ఏ ఒక్క రంగమైనా అభివృద్ధి చెందిందా అని పార్థసారధి ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు. స్వప్రయోజనాల కోసం ప్రజలను ఇబ్బందుల పాలుచేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి జగన్‌మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయడం, బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడడం మాత్రమే బాబుకు తెలుసునని మండిపడ్డారు.