శిక్షణ తరగతులను ప్రారంభిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి, పక్కన ఎమ్మెల్యే పార్థసారథి తదితరులు
కంకిపాడు: సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో పాలన సాగుతోందని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పారు. గ్రామ పాలనపై ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు రెండు రోజులపాటు నిర్వహించే శిక్షణ తరగతులను బుధవారం కృష్ణా జిల్లా కంకిపాడులో మంత్రి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థలు, ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ భారీ విజయం సాధించటం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వల్లే సాధ్యమైందన్నారు. స్థానిక సంస్థలకు 2019కి ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా చంద్రబాబు వాయిదాలు వేస్తూ వచ్చారన్నారు.
ఎన్నికలు జరిగితే గ్రామాల్లో గ్రూపులు ఏర్పడతాయని భయపడ్డాడని, వైఎస్సార్‌సీపీని అధికారంలోకి రానివ్వకుండా చేయాలని అనేక కుట్రలు పన్నాడని మండిపడ్డారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాగానే అడ్డంకుల్ని అధిగమిస్తూ గ్రామాల అభివృద్ధి, సంక్షేమం దిశగా అడుగులు వేస్తున్నారన్నారు. మెరుగైన పాలన అందించే క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.36 లక్షల మంది వార్డు సభ్యులకు శిక్షణ తరగతులు నిర్వహించి పాలనపై అవగాహన కల్పించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. అన్నివర్గాలకు 50 శాతం రిజర్వేషన్‌లు కేటాయించటంతో పాటుగా మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించి వారి ఉన్నతికి పెద్దపీట వేసిన దార్శనికుడు జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.
ప్రతి గుమ్మం ముంగిటకూ పథకాలు
దేశ చరిత్రలోనే తొలిసారి సచివాలయాలు, వలంటీర్ల వ్యవస్థ ఏర్పాటు జరిగిందని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ప్రతి గుమ్మం వద్దకు సంక్షేమ పథకాలు చేరుతున్నాయన్నారు. చంద్రబాబుకు సచివాలయ వ్యవస్థ, వలంటీర్ వ్యవస్థ గురించి తెలీదని మంత్రి పేర్కొన్నారు. వార్డు, సర్పంచ్ స్థానాల్లో ఓడిపోయిన వాళ్లను జన్మభూమి కమిటీలలో పెట్టి సంక్షేమ పథకాలు వాళ్ల పార్టీకి, డబ్బులు ఇచ్చిన వాళ్లకు కట్టబెట్టి పేదలకు అన్యాయం చేశారని ఆరోపించారు.
ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి మాట్లాడుతూ.. సంక్షేమానికి చిరునామా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అన్నారు. పథకాలు అర్హులకు అందేలా వివక్షకు తావు లేకుండా అమలు చేస్తున్నామన్నారు. పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది, జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పాల హారిక, ఏపీఎస్‌ఐఆర్‌డీ డైరెక్టర్ మురళి, జెడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు, జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ డాక్టర్ కె.మాధవీలత, ఆర్టీసీ రీజనల్ చైర్మన్ తాతినేని పద్మావతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment