సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అసమర్థ, రాక్షస పాలన సాగుతోందని విమర్శిస్తున్న ప్రతిపక్ష నేత చంద్రబాబు ఐదేళ్ల నిర్వాకాలను ప్రజలు ఇంకా మరచిపోలేదని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. చంద్రబాబు హయాంలో మహిళలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై చోటు చేసుకున్న దాడులను ఎవరూ మరిచిపోలేదన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్థసారథి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తొలి నెల నుంచే ప్రజలపై, అధికారులపై దాడులు జరిగాయని గుర్తు చేశారు. అమరావతిలో ఓ వీఆర్వోని టీడీపీ నేతలు దుస్తులు విప్పి చితకబాదారని, పెందుర్తిలో దళిత మహిళను వివస్త్రను చేసి కొట్టారని చెప్పారు. ఓ ఐపీఎస్ అధికారిపై టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు దాడి చేస్తే చంద్రబాబు కూర్చోబెట్టి రాజీ చేయడం రాక్షస పాలన కాదా? అని ప్రశ్నించారు. ఇసుక మాఫియాను అడ్డుకున్నందుకు మహిళా ఎమ్మార్వోను టీడీపీ ఎమ్మెల్యే జుట్టుపట్టుకుని కొట్టడాన్ని రాక్షస పాలన అనరా? అని నిలదీశారు. చంద్రబాబు పాలనలో మాదిరిగా టీడీపీ ప్రజాప్రతినిధులు బరితెగించి దాడులకు పాల్పడి నేరాలు, ఘోరాలను ప్రోత్సహించిన పరిస్థితులు ఇప్పుడు రాష్ట్రంలో లేవన్నారు.
అసమర్థ పాలన అంటే ఇదీ బాబూ..
‘అసమర్థ పాలన అంటే జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులను ఎలా వేధించాలి? ఎలా దొంగ కేసులు పెట్టాలి? సంక్షేమ కార్యక్రమాలకు ఎలా కోతలు పెట్టాలి? ఇసుక నుంచి మట్టి, మద్యం, నీరు–చెట్టు పేరుతో చెరువులను ఎలా ఖాళీ చేయాలి?’ లాంటిదని పార్ధసారథి పేర్కొన్నారు. అసమర్థ పాలన అంటే ఎన్నికల మేనిఫెస్టోలోని హామీలన్నీ ఎగ్గొట్టిన చంద్రబాబు చరిత్రని చెప్పారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడించినా ఆయన పీడ రాష్ట్రానికి విరుగడ కాలేదని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్‌లు, ట్వీట్లు చేస్తూ రాజకీయంగా బతికే ఉన్నామని చెప్పుకునేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారని విమర్శించారు. (ఎక్కడనుంచైనా ఇసుక తెచ్చుకోవచ్చు)
రాజీనామా చేస్తే పచ్చ రంగు మారుతుందా?
నంద్యాలలో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడిన ఘటనపై చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని పార్ధసారథి మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి నిందితులను జైలుకు తరలించిందని, కాపాడాలని చూడలేదని గుర్తు చేశారు. ‘అబ్దుల్ సలాం కుటుంబం ఆత్మహత్యకు కారణం సీఐ, హెడ్ కానిస్టేబుల్ అన్నది మరణ వాంగ్మూలం ప్రకారం అందరికీ తెలుసు. మరి సీఐని చంద్రబాబు ఎందుకు సమర్థిస్తున్నారు? ప్రభుత్వమే బెయిల్ రద్దు కోసం పిటిషన్ వేసిన విషయం తెలిసి కూడా రాజకీయ లబ్ధి కోసం పాకులాడటం ఏమిటి? నిందితులకు బెయిల్ ఇప్పించిన మీ పార్టీ నాయకుడితో రాజీనామా చేయిస్తే పచ్చరంగు మారుతుందా? మీ డ్రామాలన్నీ నిజాలైపోతాయా? సీఐ మీద 306 సెక్షన్ కింద కేసు ఉన్న విషయం తెలిసి కూడా టీడీపీ న్యాయవాదిని బెయిల్ కోసం ఎందుకు పంపారు? ముస్లింల సంక్షేమానికి ఐదేళ్లలో ఏమాత్రం కృషి చేయని చంద్రబాబు ఇప్పుడు వారిపై ప్రేమ ఒలకబోస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
17 నెలల్లో రూ.3,428 కోట్లు..
ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించిన ఘనత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిది కాగా ఇప్పుడు వారికి మేలు జరిగేలా సీఎం జగన్ అన్ని చర్యలు చేపట్టారని, 17 నెలల పాలనలో ముస్లింలకు రూ.3,428 కోట్లు సంక్షేమ పథకాల ద్వారా అందించారని చెప్పారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో కేవలం రూ.2,661 కోట్లు మాత్రమే విదిల్చారన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ సంక్షేమ పాలనను చూసి ఓర్వలేక పథకాలను అడ్డుకోవడానికి కుట్రలు, కుల మత రాజకీయాలు చేయడాన్ని బాబు పనిగా పెట్టుకున్నారని విమర్శించారు. (నేడు గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ)
నారా–హమారా’ గుర్తుందిగా?
చంద్రబాబు అధికారంలో ఉండగా గుంటూరులో నిర్వహించిన ‘నారా హమారా’ సభలో హామీలను నెరవేర్చాలని ప్లకార్డులు ప్రదర్శించిన ముస్లిం యువకులను ఆయన సమక్షంలోనే ఎలా హింసించారో ప్రజలు మర్చిపోలేదని పార్థసారథి తెలిపారు. ముస్లిం బాలికకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర ఆందోళన చేస్తే దేశ ద్రోహం కేసు పెట్టింది మీరు కాదా? అని ప్రశ్నించారు. నీతి వాక్యాలు వల్లించే చంద్రబాబు చేసేదంతా అవినీతి, అరాచకం, అన్యాయమని చెప్పారు. చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్లలో తొలి నాలుగున్నరేళ్లు ముస్లింలకు మంత్రి పదవి ఇవ్వాలని ఎందుకు అనిపించలేదని ప్రశ్నించారు. పెట్టుబడిదారుడైన నారాయణను దొడ్డిదారిన ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి ఇచ్చారన్నారు. అసమర్థ తనయుడిని ఎమ్మెల్సీని చేసి మంత్రి పదవి కట్టబెట్టలేదా? అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment