సుబ్రహ్మణ్యం, హాసిని. ప్రమాదం నుంచి బయటపడ్డ మధులత (ఫైల్)
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: లాంచీలో సరదాగా నృత్యం చేస్తున్న తమ చిన్నారి హాసినీని చూస్తూ ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇంతలో లాంచీ ప్రమాదం రూపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏం జరిగిందో తెలియదు.. అప్పటివరకు ఆనందంగా సాగుతున్న వారి యాత్ర ఒక్కసారిగా ఆర్తనాదాలు, రోదనలతో నిండిపోయింది. సంతోషంగా నృత్యం చేస్తున్న తన కుమార్తె తన కాళ్లు పట్టుకుని వేలాడుతున్నా కాపాడుకోలేని పరిస్థితి ఆ మాతృమూర్తిది. ఎలాగైనా తనవారిని కాపాడుకోవాలనే బాధ ఆ తండ్రిది. వెరసి పాపికొండలు లాంచీ ప్రమాదంలో తిరుపతికి చెందిన ఓ కుటుంబం విషాద గాథ ఇది.
చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన దుర్గం సుబ్రహ్మణ్యం కుటుంబంతో కలిసి వినాయకసాగర్ రాధేశ్యామ్ అపార్ట్‌మెంట్‌లో నివశిస్తున్నారు. సుబ్రహ్మణ్యం (45) పెట్రోల్ బంక్ నిర్వహిస్తుండగా మధులత (40) గృహిణి. చిన్నారి హాసిని (12) స్థానిక స్ప్రింగ్‌డేల్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. మూడు నెలల క్రితం కాలం చేసిన తన తండ్రి గంగిశెట్టి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు రెండు రోజుల క్రితం భార్య మధులత, కుమార్తె హాసినితో కలిసి సుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరం వచ్చారు. గోదావరిలో తండ్రి ఆఖరి క్రతువును నిర్వహించేందుకు వెళ్లిన సుబ్రహ్మణ్యం, హాసిని ప్రమాదంలో గల్లంతు కాగా మధులతను ప్రాణాలతో బయటపడింది.
నేనెవరికోసం బతకాలి ?
‘‘ఆదివారం కదా సరదాగా గడుపుదామని కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికొచ్చాం. ఇదే మా జీవితంలో విషాదాన్ని నింపుతుందని అనుకోలేదు. ఈ ప్రమాదంలో నా భర్త సుబ్రహ్మణ్యం, పాప హాసిని కనిపించకుండా పోయారు. ఇక నేను ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఎలా బతకాలి? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్లుంటే ఎంత బావుండు..’’
– మధులత, తిరుపతి
తల్లి పాలు మానిపించే ప్రయత్నంలో..
ఇద్దరు చిన్నారులతోపాటు నాయనమ్మ గల్లంతు
ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖపట్నంకు చెందిన అప్పలరాజుది మరో విషాద గాథ. తన తల్లి, భార్య భాగ్యలక్ష్మి, పిల్లలు గీతా వైష్ణవి (3), ధాత్రి అనన్య (1)లతో కూడిన అన్యోన్య కుటుంబం ఆయనది. ఏడాది నిండిన చిన్నపాప ధాత్రి అనన్యతో తల్లి పాలు మానిపిద్దామని.. ఇందులో భాగంగా రెండు మూడు రోజులు తల్లికి దూరంగా ఉంచితే తల్లిపాలకు దూరం చేయొచ్చని అప్పలరాజు భావించాడు. విశాఖపట్నానికే చెందిన తన బంధువులు పాపికొండలు యాత్రకు వెళ్తున్నారని తెలుసుకుని వారితోపాటు తన తల్లిని ఇద్దరు పిల్లలను ఇచ్చి పంపాడు. లాంచీ ప్రమాదంలో ముగ్గురూ గల్లంతవడంతో అప్పలరాజు, ఆయన భార్య భాగ్యలక్ష్మి కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకటి రెండు రోజులు తనకు దూరంగా ఉంటే తల్లి పాలు మరిచిపోతారని అనుకుంటే ఇలా తనకు దూరమై తీవ్ర విషాదాన్ని నింపుతారని అనుకోలేదని ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది.
స్నేహితుల్లో విషాదం నింపిన విహారం
నరసాపురం: లాంచీ బోల్తా పడిన ఘటనలో నరసాపురంకు చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఇక్కడి నుంచి నలుగురు స్నేహితులు పాపికొండలు విహార యాత్రకు వెళ్లగా ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. పట్టణంలోని రుస్తుంబాదకు చెందిన వలవల రఘు (45), చెట్లపల్లి గంగాధర్ (36), టేలర్ హైస్కూల్ గ్రౌండ్ సమీప ప్రాంతానికి చెందిన గన్నాబత్తుల ఫణికుమార్ (28) గల్లంతయ్యారు. రాయిపేటకు చెందిన మండల గంగాధర్ (బిళ్లా) ప్రాణాలతో బయటపడ్డాడు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో అమరేశ్వరస్వామి ఆలయ ఈవో వలవల రఘు స్నేహితులతో కలిసి పాపికొండలు యాత్రకు నాలుగు టికెట్లు బుక్ చేశారు. నలుగురు స్నేహితులు కలిసి శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాజమండ్రి వెళ్లారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో లాంచీ ఎక్కి ప్రమాదానికి గురయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment