
శ్రీనగర్: జమ్ము కశ్మీర్‌లోని ముజఫర్ నగర్ సమీపంలోని జీలం నదిలో పడవ ప్రమాదం చోటు చేసుకుంది. మంగళవారం ఉదయంలో జీలం నదిలో పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో నలుగురు మృతి చెందగా, ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానిక శ్రీమహారాజా హరిసింగ్ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న రాష్ట్ర డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపట్టింది.
ప్రమాదం జరిగిన పడవలో ఎక్కువ మంది స్కూల్ విద్యార్థులు ఉన్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా నదిలో ప్రవాహం అధికంగా ఉండడంతో ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.