Papikondala Yatra
-
ప్రకృతి ప్రేమికులకు రా రమ్మని... స్వాగతం
గోదావరికి ఇరువైపులా ఉన్న ప్రకృతి అందాలు, గుట్టలపై ఉండే గిరిజన గూడేలు, ఆకుపచ్చని రంగులో ఆకాశాన్ని తాకేందుకు పోటీ పడుతున్న కొండల అందాలను కనులారా వీక్షించాలని అనుకుంటున్నారా? అయితే, మీరు పాపికొండలు యాత్రకు వెళ్లాల్సిందే. భద్రాచలం సమీపాన పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి నిత్యం బోట్లు నడిపిస్తుండగా.. క్రిస్మస్, కొత్త సంవత్సరంతో పాటు సంక్రాంతి సెలవులు రానున్న నేపథ్యాన పర్యాటకుల రద్దీ పెరగనుంది. ఈ నేపథ్యాన పాపికొండల అందాలు, యాత్ర మిగిల్చే తీయని అనుభవాలపై ప్రత్యేక కథనమిది.రెండు మార్గాలు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న పాపికొండల యాత్రను సందర్శించాలంటే రెండు మార్గాలున్నాయి. ఒకటోది.. ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం వద్ద ఉన్న పోచమ్మ గండి పాయింట్ వద్ద నుంచి బోట్లో ప్రారంభమై.. పేరంటాలపల్లి వరకు వెళ్లి తిరిగి తీసుకొస్తారు. రెండోది.. తూర్పుగోదావరి జిల్లా వీఆర్ పురం మండలం పోచవరం ఫెర్రీ పాయింట్ నుంచి ప్రారంభమయ్యే మార్గం. ఈ పాయింట్ తెలంగాణలోని భద్రాచలానికి సమీపాన ఉంటుంది. దీంతో పర్యాటకులు ఒకరోజు ముందుగానే చేరుకుని రామయ్యను దర్శించుకుని.. ఆపై పాపికొండలు యాత్రకు బయలుదేరుతారు.భద్రాచలం నుంచి ఇలా.. హైదరాబాద్ నుంచి పాపికొండల యాత్రకు రావాలనుకునే వారు ముందుగా భద్రాచలం చేరుకోవాలి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి భద్రాచలానికి విరివిగా బస్సులు ఉన్నాయి. రైలు మార్గంలో వచ్చే వారు కొత్తగూడెం (భద్రాచలం రోడ్డు) స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం రావాలి. ఇక్కడ వీలు చూసుకుని సీతారాముల దర్శనం చేసుకున్న తర్వాత.. భద్రాచలం నుంచి 75 కిలోమీటర్ల దూరంలో బోటింగ్ పాయింట్ ఉన్న పోచవరం గ్రామానికి బయలుదేరవచ్చు. 70 కిలోమీటర్ల జలవిహారం ఉదయం 9.30 గంటల నుంచి 10.30 గంటల మధ్యలో ప్రారంభమయ్యే యాత్ర సాయంత్రం 4 గంటల నుంచి లేదా 5 గంటల మధ్యలో ముగుస్తుంది. పోచవరం ఫెర్రీ పాయింట్ వద్ద పర్యాటకులను ఎక్కించుకుని మళ్లీ అక్కడే దింపుతారు. సుమారు ఆరు గంటల పాటు 70 కిలోమీటర్లు గోదావరిలోనే జలవిహారం చేసే అద్భుత అవకాశం ఈ యాత్రలో పర్యాటకులకు కలుగుతుంది. పేరంటాలపల్లి సందర్శన పాపికొండల యాత్రలో పేరంటాల పల్లి వద్ద నున్న ప్రాచీన శివాలయం వద్ద బోటు ఆపుతారు. ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ గుడిని గిరిజనులే నిర్వహిస్తున్నారు. గుట్ట పైనుంచి జాలువారే నది జలాన్ని తీర్థంగా పుచ్చుకుంటారు. యాత్ర ప్రారంభానికి ముందు లేదా తర్వాతైనా పోచవరానికి సమీపాన వీఆర్ పురం మండలంలోని శ్రీరామగిరి రాముడి క్షేత్రాన్ని దర్శించుకోవచ్చు. షెడ్యూల్, ధరలు ఇలా.. పోచవరం వద్ద నుంచి ప్రారంభమయ్యే పాపికొండల యాత్రకు సంబంధించి పెద్దలకు రూ.950, చిన్నారులకు రూ.750గా ఏపీ పర్యాటక శాఖ నిర్ణయించింది. కళాశాల విద్యార్థులు గ్రూపుగా పర్యటనకు వస్తే.. వారికి రూ.850, ఒకటి నుంచి పదో తరగతి విద్యార్థులకు రూ.750 ప్యాకేజీ ధరగా ప్రకటించారు. అయితే శని, ఆదివారం, సెలవు దినాల్లో.. దీనికి అదనంగా రూ.100 వసూలు చేస్తారు. ఈ ప్యాకేజీలోనే భోజన సౌకర్యాన్ని బోటు నిర్వాహకులు కల్పిస్తారు. భద్రగిరిలోని రామాలయం పరిసర ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బుకింగ్ కౌంటర్ల ద్వారా ఏజెంట్లు టికెట్లు విక్రయిస్తారు. ఇసుక తిన్నెల్లో విడిది.. రాత్రివేళ నిశ్శబ్ద వాతావరణంలో గోదావరి ప్రవాహ శబ్దం, ఇసుక తిన్నెలు, వెన్నెల అందాలను ఆస్వాదించాలంటే వెదురు హట్స్‌ల్లో రాత్రి వేళ బస చేయాల్సిందే. పశ్చిమగోదావరి జిల్లాలోని సిరివాక అనే గ్రామం వద్ద పర్యాటకుల కోసం హట్స్ ఉన్నాయి. గుడారాలలో ఒక్కొక్కరికి రూ.4 వేలు, వెదురు కాటేజీల్లో అయితే రూ.5,500గా ధర నిర్ణయించారు. ఉదయం పోచవరం నుంచి వెళ్లి.. రాత్రికి సిరివాకలో బస చేయిస్తారు. అనంతరం మర్నాడు సాయంత్రానికి పోచవరానికి లాంచీలో చేరుస్తారు. రెండు రోజుల పాటు భోజన వసతి, ఇతర సౌకర్యాలను నిర్వాహకులే చూసుకుంటారు. ఈ టికెట్లు కూడా భద్రాచలంలో అందుబాటులో ఉంటాయి. పటిష్టమైన రక్షణ ఏపీలోని కచ్చలూరు లాంచీ ప్రమాదం అనంతరం పర్యాటకులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేశారు. అన్ని బోట్లకు అనుసంధానం చేసిన శాటిలైట్ ఫోన్లు, వాకీటాకీలు, వాటిని నియంత్రించే బోటింగ్ కంట్రోల్ రూంలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు పోలీసు, అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్, పర్యాటక శాఖ అధికారులు.. పర్యాటకుల ధ్రువీకరణ పత్రాలను సరిపోలి్చన తరువాతే బోటులోకి అనుమతిస్తారు. బోటులో లైఫ్ జాకెట్లు, ఇతర రక్షణ సామగ్రిని సిద్ధంగా ఉంచుతున్నారు.ఆహారం ఉదయం యాత్ర ప్రారంభమయ్యే సమయంలో అల్పాహారం, టీ అందిస్తారు. మధ్యాహ్న సమయాన బోటులోనే శాఖాహార భోజనంతో ఆతిథ్యాన్ని అందిస్తారు. సాయంత్రం యాత్ర ముగిసిన తరువాత మళ్లీ బోట్ పాయింట్ వద్ద స్నాక్స్, టీ అందజేస్తారు. పాపికొండల ప్రయాణంలో కొల్లూరు, సిరివాక, పోచవరం వద్ద ‘బొంగు చికెన్’ అమ్ముతారు. ఆకట్టుకునే వెదురు బొమ్మలు పేరంటాలపల్లి దగ్గర గిరిజనులు తయారు చేసిన వెదురు బొమ్మలు, వస్తువులు ఆకట్టుకుంటాయి. రూ.50 నుంచి రూ.300 వరకు ధరల్లో ఇవి లభిస్తాయి.👉పర్యాటకుల మనస్సుదోచే పాపికొండల విహార యాత్ర (ఫొటోలు) -
పాపికొండలకు పోటెత్తారు
రంపచోడవరం/దేవీపట్నం: పాపికొండల విహారయాత్రకు ఆదివారం తొలిరోజే పర్యాటకులు పోటెత్తారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఒక్కరోజు మాత్రమే సమయం ఉన్నా ఎక్కువమంది టికెట్లు బుక్ చేసుకున్నారు. రెండు బోట్లలో 112 మంది పర్యాటకులు బయలుదేరారు. మూడునెలల విరామం తరువాత పర్యాటక, పోలీసు, రెవెన్యూ, జలవనరుల శాఖల అధికారుల పర్యవేక్షణ, సూచనల మధ్య పాపికొండల పర్యాటకం ప్రారంభమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం పోశమ్మగండి బోట్ పాయింట్ నుంచి రెండు బోట్లు ఉదయం 11 గంటలకు బయలుదేరాయి. మొదటి బోటుగా గోదావరి గ్రాండ్లో 82 మంది ఉన్నారు. వీరిలో బోటు పైభాగంలో 46 మంది, లోపల 36 మంది కూర్చునేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. రెండోబోటు భగీరథిలో 30 మంది పర్యాటకులు ఉన్నారు. వీరందరిని టికెట్ ఆధారంగా అనుమతించారు. తొలిరోజు కావడంతో బోట్లు బయలుదేరేందుకు కొంత ఆలస్యం అయింది. రోజూ ఉదయం 9 గంటలకే పర్యాటకులతో బోట్లు బయలుదేరతాయని అధికారులు చెప్పారు. బెంగళూరు నుంచి కూడా కొందరు పర్యాటకులు పాపికొండల విహారానికి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది గోదావరిలో ప్రయాణించి పాపికొండల అందాలు చూడాలని కోరిక ఉంది. అయితే పాపికొండల రైడ్ క్యాన్సిల్ అయిందని చెప్పారు. తిరిగి పాపికొండలకు బోట్లు తిరుగుతాయని చెప్పారు. దీంతో 8 రోజులు టూర్ ప్లాన్ చేసుకుని వచ్చాం. పాపికొండల టూర్‌కు రావడం చాలా ఆనందంగా ఉంది. – సుష్మ, పర్యాటకురాలు, బెంగళూరు జాగ్రత్తలు పాటించాలి.. పాపికొండల విహారయాత్రను విజయవంతంగా ముగించేందుకు పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలి. బోట్లో ప్రయాణించేటప్పుడు, తిరిగి బోట్ పాయింట్‌కు వచ్చేవరకు లైఫ్ జాకెట్లు తీయవద్దు. రోడ్డు ప్రయాణానికి, నీటిపై బోటులో ప్రయాణానికి చాలా తేడా ఉంటుంది. బ్యాలెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. గోదావరిలో బోటు వెళ్తున్నప్పుడు అటూ ఇటూ తిరగడం, అందరూ ఒకవైపు రావడం, తొంగిచూడడం చేయకూడదు. ఇలాచేస్తే బోటు ఒరిగిపోతుంది. సంతోషకరమైన ప్రయాణానికి వ్యక్తిగత జాగ్రత్తలు కూడా అవసరం. – సురేష్‌బాబు, సీఐ రంపచోడవరం -
పాపికొండల టూర్.. నదీ అందాలు తిలకిస్తూ విహారం
రంపచోడవరం: పాపికొండలు అందాలు చూసేందుకు ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రెండేళ్ల విరామం తరువాత నవంబరు 7 నుంచి పర్యాటక బోటులు పాపికొండల విహారానికి బయలుదేరానున్నాయి. దీంతో పర్యాటకుల్లో ఆసక్తి.. ఆనందం నెలకొన్నాయి. శీతాకాలం గోదావరిపై మంచు తెమ్మరల మధ్య పాపికొండల పర్యటన మధురానుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలకు మధ్య సుమారు 40 కిలో మీటర్ల పొడవుల గోదావరికి ఇరువైపులా పాపికొండలు విస్తరించి ఉన్నాయి. టూరిజమ్ బోట్లపై ప్రయాణించే పర్యాటకులు పాపికొండలు, గోవావరి వెంబడి ఎత్తున కొండలు, పచ్చని వృక్షాలు ప్రాంతాన్ని వీక్షించేందుకు ఏటా వేల సంఖ్యలో పర్యాటకులు ఈ ప్రాంతానికి సందర్శిస్తున్నారు. వీఆర్‌పురం మండలం పోచవరం బోట్ పాయింట్ నుంచి రోజు సుమారు 300 మంది ,సెలవు రోజుల్లో వెయ్యి మందికి పైగా పర్యాటకులు పాపికొండల సందర్శనకు వచ్చేవారు. ఎలా వెళ్తారంటే.. ► భద్రాచలం రామాలయాన్ని దర్శించుకున్నాక 75 కిలో మీటర్ల దూరంలోని పోచవరం బోట్ పాయింట్‌కు రోడ్డు మార్గం గుండా చేరుకుంటారు. అక్కడి నుంచి గోదావరి నదిలో బోట్లో ప్రయాణిస్తారు. ► తూర్పుగోదావరి జిల్లాలో దేవీపట్నం మండలం పోశమ్మ గండి ఆలయం వద్ద బోట్ పాయింట్ నుంచి పర్యాటకులు పాపికొండల విహార యాత్రకు బయలుదేరతారు. ► రాజమమహేంద్రవరం నుంచి కూడా వాహనంలో పురుషోత్తపట్నం మీదుగా పోశమ్మగండికి చేరుకుంటారు. భద్రతకు పెద్దపీట 2019లో జరిగిన కచ్చులూరు సంఘటన నేపథ్యంలో ప్రభుత్వం పటిష్టమైన భద్రత చర్యలు తీసుకుంది.. గోదావరి నీటి మట్టం ఆధారంగా బోటులు గోదావరిపై నడిపేందుకు అనుమతి ఇస్తోందిరు. పోలవరం ప్రాజెక్టు ఎర్త్‌డ్యామ్ వద్ద నీటి మట్టం 27 మీటర్లు ఉంటే బోట్లు తిరిగేందుకు అనుమతి లభిస్తుంది. అంతకు మించి నీటి మట్టం పెరిగే బోటులను నిలిపివేస్తారు. 23 పర్యాటక బోట్లుకు అనుమతి పాపికొండలు అందాలను చూపించేందుకు ప్రైవేట్ బోట్లుతో పాటు, ఏపీ టూరిజం బోట్లు కూడా నడుస్తాయి. కొద్ది రోజులు పాపికొండలు పర్యాటకం నిలిచిపోయిన తరువాత టూరిజం బోట్లు నడిపేందుకు అనుమతి ఇచ్చారు. తాజా నిర్ణయంతో బోట్ల ఫిట్నేస్ పరిశీలించి టెక్నికల్ అధికారులు తొలివిడతగా నిబంధనలకు అనుగుణంగా సర్టిఫికెట్లు ఇస్తున్నారు. ఇలా ఇప్పటికే 23 బోట్లకు అనుమతి లభించింది. పోచమ్మగండి బోట్పాయింట్ నుంచి 11 బోట్లకు, పోచవరం బోట్ పాయింట్ నుంచి 12 బోట్లకు అనుమతులు లభించించాయి. (చదవండి: రాజమండ్రి నుంచి టికెట్ ధర రూ.1,250) అనేక మందికి ఉపాధి ► పాపికొండల పర్యాటకంతో అనేక మంది ఉపాధి లభిస్తుంది. టికెట్ కౌంటర్లలో పనిచేసే వర్కర్లు,లాడ్జీల నిర్వహకులు,మార్గం మధ్యలోని కూనవరం ,వీఆర్‌పురం మండలాల్లోని హోటళ్లు, ఇతర వ్యాపారాలతో ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు. ► పోచవరం బోట్ పాయింట్ వద్ద వ్యాపారస్తులతో పాటు బోట్ల యజమానులు, గుమస్తాలు, బోట్ల వర్కర్లు, క్యాటరింగ్ సిబ్బంది, ఫొటో గ్రాఫర్లు, నృత్యకళాకారులకూ ఈ టూర్ ఉపాధిగా నిలుస్తోంది. ► పేరంటాలపల్లిలో వెదురు కళాకృతులు విక్రయించే కొండరెడ్డి గిరిజనులు,కొల్లూరు ఇసుక తెన్నెల్లో బొంగు చికెన్ విక్రయించే గిరిజనులతో పాటు ఐస్‌లు విక్రయించే వారు ఇలా సుమారులు ఐదు వేలమందికి పైగా దీనిపై ఆధారపడుతుంటారు. పోశమ్మ గండి బోట్ పాయింట్ పోశమ్మ గండి బోట్ పాయింట్ నుంచి టూరిజమ్ బోట్లు పాపికొండలు పర్యాటానికి బయలుదేరతాయి. బోట్లుల్లో అన్ని సురక్షిత ఏర్పాట్లు మధ్య పాపికొండకు బోటులను పంపండం జరుగుతుంది. బోట్ పాయింట్ వద్ద పర్యాటక సిబ్బంది ఉంటారు. –వీరనారాయణ, టూరిజం అధికారి, రాజమహేంద్రవరం -
తాతయ్య వెళ్లొస్తాం అన్నారు .. కానీ అంతలోనే
సాక్షి, బొమ్మలసత్రం(కర్నూల్) : ‘తాతయ్యా.. బాగున్నావా.. అమ్మనాన్నలతో కలిసి ఆదివారం టూర్‌కు వెళ్తున్నాం.. టూర్ ఫొటోలు మీకు వాట్సాప్‌లో పంపిస్తా.. నానమ్మకు మా ఫొటోలు చూపించు.. వెళ్లొస్తాం తాతయ్యా’.. అంటూ హర్షిక ముద్దులొలికే మాటలతో చివరిసారిగా నంద్యాలలో ఉంటున్న తాతయ్యతో మాట్లాడిన మాటలు. గోదావరిలో ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో నంద్యాలకు చెందిన మహేశ్వరరెడ్డి ఆయన భార్య స్వాతిరెడ్డి, పిల్లలు హర్షిక, విఖ్యాత్‌లు గల్లంతయ్యారు. వారిలో స్వాతిరెడ్డి (32), హర్షిక (4) మృతదేహాలను అధికారులు బయటికి తీసి పంచనామా నిర్వహించారు. మహేశ్వరరెడ్డి, విఖ్యాత్‌ల ఆచూకీ ఇంకా లభించలేదు. కుటుంబ సభ్యుల్లో ఆందోళన.. తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం సమీపంలోని కచ్చులూరు వద్ద ఆదివారం జరిగిన బోటు ప్రమాదంలో నంద్యాల వాసులు గల్లంతయ్యారు. వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావటంతో పట్టణంలోని రెవెన్యూ క్వార్టర్స్‌లో ఉన్న వారి నివాసం వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి. పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది రామకృష్ణారెడ్డి కుమారుడు మహేశ్వరరెడ్డి ఆయన భార్య స్వాతిరెడ్డి, పిల్లలు హర్షిత, విఖ్యాత్‌లు గల్లంతవటంపై వారి బంధువుల్లో ఆందోళన మొదలైంది. ఆదివారం విశాఖపట్నం నుంచి పాపికొండలు చూసేందుకు కుటుంబసమేతంగా బయలు దేరుతున్నట్లు శుక్రవారమే తండ్రి రామకృష్ణారెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. ఏపీ 31బీఎక్స్ 4444 నెంబరు మారుతి ఎర్టిగా వాహనంలో పిల్లలతో కలిసి మహేశ్వరరెడ్డి రాజమండ్రి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఆదివారం ఉదయం రాజమండ్రి చేరుకుని ప్రైవేట్ ట్రావెల్స్ వారు ఏర్పాటు చేసిన బస్సులో దేవిపట్నం మండలం గుండపోచమ్మ గుడివద్ద ఉన్న లాంచీలరేవుకు చేరుకున్నారు. అక్కడి నుంచి వశిష్ట పున్నమి రాయల్ బోటులో ప్రయాణించటం కోసం టికెట్లు తీసుకున్నారు. 64 మంది ప్రయాణికులతో బోటు విహారయాత్రకు బయలుదేరింది. బోటు కచ్చులూరు వద్దకు చేరుకోగానే గోదావరిలో వరద ఉధృతికి మునిగిపోయింది. ఈప్రమాదంలో మహేశ్వరరెడ్డి కుటుంబసభ్యులు గల్లంతయ్యారు. వారిలో స్వాతిరెడ్డి, హర్షిక మృతదేహాలు లభ్యమయ్యాయి. మహేశ్వరరెడ్డి, విఖ్యాత్‌ల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. దేవిపట్నంలో కుటుంబ సభ్యులు.. పట్టణానికి చెందిన ప్రముఖ న్యాయవాది బాచిరెడ్డి రామకృష్ణారెడ్డి, ఈశ్వరమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు. కుమారుడు మహేశ్వరరెడ్డి చెన్నైలో ఎంబీఏ పూర్తి చేశాడు. భూపాల్‌లోని ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం రావటంతో నంద్యాల మండలం కానాల గ్రామానికి చెందిన స్వాతిరెడ్డిని తొమ్మిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వీరికి విఖ్యాత్, హర్షిక సంతానం. కుమారుడు, మనవడి కోసం.. ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు హుటాహుటిన దేవిపట్నం బయలు దేరారు. ఒక్కగానొక్క కుమారుని కుటుంబ సభ్యులు ప్రమాదం నుంచి బయటపడాలని కోరుకుంటూ ఆతృతతో అక్కడికి చేరుకున్నాడు. అయితే అక్కడ స్వాతిరెడ్డి, హర్షికల మృతదేహాలు చూసి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. శుక్రవారం ఫోన్లో మాట్లాడిన మనువడు, మనుమరాలు గుర్తుకు వచ్చి రామకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. కుమారుడు, మనుమడిల ఆచూకీ లభించక పోవటంపై ఆందోళన చెందుతున్నారు. -
తండ్రి అస్థికలు కలుపుదామని వచ్చి..
దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం: లాంచీలో సరదాగా నృత్యం చేస్తున్న తమ చిన్నారి హాసినీని చూస్తూ ఆ తల్లిదండ్రులు మురిసిపోయారు. ఇంతలో లాంచీ ప్రమాదం రూపంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏం జరిగిందో తెలియదు.. అప్పటివరకు ఆనందంగా సాగుతున్న వారి యాత్ర ఒక్కసారిగా ఆర్తనాదాలు, రోదనలతో నిండిపోయింది. సంతోషంగా నృత్యం చేస్తున్న తన కుమార్తె తన కాళ్లు పట్టుకుని వేలాడుతున్నా కాపాడుకోలేని పరిస్థితి ఆ మాతృమూర్తిది. ఎలాగైనా తనవారిని కాపాడుకోవాలనే బాధ ఆ తండ్రిది. వెరసి పాపికొండలు లాంచీ ప్రమాదంలో తిరుపతికి చెందిన ఓ కుటుంబం విషాద గాథ ఇది. చిత్తూరు జిల్లా తిరుపతికి చెందిన దుర్గం సుబ్రహ్మణ్యం కుటుంబంతో కలిసి వినాయకసాగర్ రాధేశ్యామ్ అపార్ట్మెంట్లో నివశిస్తున్నారు. సుబ్రహ్మణ్యం (45) పెట్రోల్ బంక్ నిర్వహిస్తుండగా మధులత (40) గృహిణి. చిన్నారి హాసిని (12) స్థానిక స్ప్రింగ్‌డేల్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. మూడు నెలల క్రితం కాలం చేసిన తన తండ్రి గంగిశెట్టి అస్థికలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు రెండు రోజుల క్రితం భార్య మధులత, కుమార్తె హాసినితో కలిసి సుబ్రహ్మణ్యం రాజమహేంద్రవరం వచ్చారు. గోదావరిలో తండ్రి ఆఖరి క్రతువును నిర్వహించేందుకు వెళ్లిన సుబ్రహ్మణ్యం, హాసిని ప్రమాదంలో గల్లంతు కాగా మధులతను ప్రాణాలతో బయటపడింది. నేనెవరికోసం బతకాలి ? ‘‘ఆదివారం కదా సరదాగా గడుపుదామని కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడికొచ్చాం. ఇదే మా జీవితంలో విషాదాన్ని నింపుతుందని అనుకోలేదు. ఈ ప్రమాదంలో నా భర్త సుబ్రహ్మణ్యం, పాప హాసిని కనిపించకుండా పోయారు. ఇక నేను ఎవరికోసం బతకాలి? ఎందుకు బతకాలి? ఎలా బతకాలి? ఆ దేవుడు నన్ను కూడా తీసుకెళ్లుంటే ఎంత బావుండు..’’ – మధులత, తిరుపతి తల్లి పాలు మానిపించే ప్రయత్నంలో.. ఇద్దరు చిన్నారులతోపాటు నాయనమ్మ గల్లంతు ఆరిలోవ (విశాఖ తూర్పు): విశాఖపట్నంకు చెందిన అప్పలరాజుది మరో విషాద గాథ. తన తల్లి, భార్య భాగ్యలక్ష్మి, పిల్లలు గీతా వైష్ణవి (3), ధాత్రి అనన్య (1)లతో కూడిన అన్యోన్య కుటుంబం ఆయనది. ఏడాది నిండిన చిన్నపాప ధాత్రి అనన్యతో తల్లి పాలు మానిపిద్దామని.. ఇందులో భాగంగా రెండు మూడు రోజులు తల్లికి దూరంగా ఉంచితే తల్లిపాలకు దూరం చేయొచ్చని అప్పలరాజు భావించాడు. విశాఖపట్నానికే చెందిన తన బంధువులు పాపికొండలు యాత్రకు వెళ్తున్నారని తెలుసుకుని వారితోపాటు తన తల్లిని ఇద్దరు పిల్లలను ఇచ్చి పంపాడు. లాంచీ ప్రమాదంలో ముగ్గురూ గల్లంతవడంతో అప్పలరాజు, ఆయన భార్య భాగ్యలక్ష్మి కన్నీరుమున్నీరవుతున్నారు. ఒకటి రెండు రోజులు తనకు దూరంగా ఉంటే తల్లి పాలు మరిచిపోతారని అనుకుంటే ఇలా తనకు దూరమై తీవ్ర విషాదాన్ని నింపుతారని అనుకోలేదని ఆ తల్లి కన్నీరుమున్నీరవుతోంది. స్నేహితుల్లో విషాదం నింపిన విహారం నరసాపురం: లాంచీ బోల్తా పడిన ఘటనలో నరసాపురంకు చెందిన ముగ్గురు వ్యక్తులు గల్లంతయ్యారు. ఇక్కడి నుంచి నలుగురు స్నేహితులు పాపికొండలు విహార యాత్రకు వెళ్లగా ఒక వ్యక్తి మాత్రమే ప్రాణాలతో బయటపడ్డాడు. పట్టణంలోని రుస్తుంబాదకు చెందిన వలవల రఘు (45), చెట్లపల్లి గంగాధర్ (36), టేలర్ హైస్కూల్ గ్రౌండ్ సమీప ప్రాంతానికి చెందిన గన్నాబత్తుల ఫణికుమార్ (28) గల్లంతయ్యారు. రాయిపేటకు చెందిన మండల గంగాధర్ (బిళ్లా) ప్రాణాలతో బయటపడ్డాడు. వరుసగా రెండు రోజులు సెలవులు రావడంతో అమరేశ్వరస్వామి ఆలయ ఈవో వలవల రఘు స్నేహితులతో కలిసి పాపికొండలు యాత్రకు నాలుగు టికెట్లు బుక్ చేశారు. నలుగురు స్నేహితులు కలిసి శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు బయలుదేరి రాజమండ్రి వెళ్లారు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో లాంచీ ఎక్కి ప్రమాదానికి గురయ్యారు. -
ఆపద్బాంధవులు.. అడవి బిడ్డలు
(దేవీపట్నం నుంచి సాక్షి ప్రతినిధి బృందం): ప్రమాదం ఎవరికో జరిగింది కదా అని ఊరికే ఉండలేదు.. మనకెందుకులే అని వారి దారి వారు చూసుకోలేదు.. మానవత్వాన్ని చూపించారు కచ్చులూరులోని అడవి బిడ్డలు. ప్రమాదం జరిగిన వెంటనే ఒక్క నిమిషం కూడా ఆలోచించకుండా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం బారిన పడిన వారిని ఆలస్యం చేయకుండా హుటాహుటిన పలువురిని ఒడ్డుకు చేర్చి ఆపద్బాంధవులుగా నిలిచారు. పలువురి మృతదేహాలనూ వెలికితీశారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు గ్రామం వద్ద జరిగిన లాంచీ ప్రమాదంలో వీరందించిన సేవలు మానవత్వానికి నెలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. సాధారణంగా ప్రతీ ఆదివారం కచ్చులూరు గ్రామస్తులు మధ్యాహ్న సమయంలో గోదావరి ఒడ్డున కూర్చోవడం వారికి అలవాటు. అదే సమయంలో కళ్లేదుటే పర్యాటక లాంచి మునిగిపోవడంతో ఒక్క ఉదుటున కదిలారు. ఇంజన్ బోట్లు స్టార్‌చేసి ఒక్కసారిగా మునిగిపోతున్న లాంచి వద్దకు చేరుకున్నారు. లైఫ్ జాకెట్లు ధరించడంతో నీటిపై తేలుతున్న పలువురిని అడవి బిడ్డలు రక్షించి సురక్షితంగా మామిడిగొంది గ్రామం ఒడ్డుకు చేర్చారు. కాగా, ఈ దుర్ఘటనపై కచ్చులూరు గ్రామానికి చెందిన నేసిక లక్ష్మణరావు మాట్లాడుతూ.. ‘మధ్యాహ్నం గోదావరి ఒడ్డున కూర్చుని ఉన్నాను. గ్రామా నికి ఎదురుగా ఉన్న కొండ దగ్గర లాంచి వెనక్కి వెళ్తోంది. ఏం జరుగుతుందో అని చూస్తుండగానే లాంచి పక్కకు ఒరిగి నీటిలో మునిగిపోతోంది. దీంతో గ్రామస్తులందరం ఐదు పడవల్లో వేగంగా అక్కడకు చేరుకుని నీటిపై ఉన్న వారిని రక్షించాం’.. అని వివరించాడు. అలాగే, కచ్చులూరు గిరిజన మత్స్యకారులు మునిగిపోయిన బోటు నుంచి ఒక్కొక్కటిగా బయటపడే బ్యాగులను సేకరించి పోలీసులకు అందించారు. నాటు పడవలు వేసుకుని వెళ్లాం ప్రమాదం సంఘటన తెలిసిన వెంటనే నాటు పడవలు వేసుకుని అక్కడకు వెళ్లాం. వరదవల్ల తొందరగా అక్కడకు చేరుకోలేకపోయాం. లైఫ్‌జాకెట్లు వేసుకున్న వారిని రక్షించి ఒడ్డుకు చేర్చాం. – కె. వీరభద్రారెడ్డి, తూటుకుంట, పశ్చిమగోదావరి జిల్లా మా కళ్లెదుటే మునిగిపోయింది మధ్యాహ్నం ఫోన్ సిగ్నల్ కోసం గోదావరి ఒడ్డుకు వచ్చాను. ఈలోపు బోటు మునిగిపోవడం కంట పడింది. ఒడ్డున ఉన్న వారు వెంటనే పడవలతో కాపాడేందుకు వెళ్లి కొంతమందిని రక్షించారు. – చెదల దుర్గ, తూటుకుంట, పశ్చిమ గోదావరి జిల్లా -
30 ఏళ్లలో 100 మందికి పైగా మృత్యువాత
సాక్షి ప్రతినిధి, రాజమండ్రి/సాక్షి అమరావతి: తూర్పు గోదావరి జిల్లాలో తరచూ చోటుచేసుకుంటున్న పడవ ప్రమాదాలు ఎంతోమందిని బలిగొంటున్నాయి. విధిలేని పరిస్థితుల్లో పడవ ప్రయాణాలు చేసి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఇలా మూడు దశాబ్దాల కాలంలో వంద మందికి పైగా మృత్యువాత పడ్డారు. ఆయా ప్రధాన ఘటనల వివరాలు.. - 1985లో.. వీఆర్ పురం మండలం శ్రీరామగిరిలోని శ్రీరామ నవమి కల్యాణాన్ని వీక్షించేందుకు సుమారు 50 మందితో వెళ్లిన బోటు ప్రమాదానికి గురై 40 మంది మృతిచెందారు. - 1990లో.. ఆత్రేయపురం మండల పరిధిలోని ఒద్దిపర్రు, వెలిచేరు, పేరవరం గ్రామాల ప్రజలు నిత్యం రాకపోకలు సాగించే లంకరేవులో పడవ మునిగి పది మంది చనిపోయారు. - 1992లో.. ఐ.పోలవరం మండలం పరిధిలోని గోగుళ్లంక–భైరవలంక మధ్య చింతేరుపాయ వద్ద పడవ బోల్తా పడి ముగ్గురు ఉపాధ్యాయులు మరణించారు. - 1996లో బోడసకుర్రు–పాశర్లపూడి మధ్య వైనతేయ నదీ పాయపై పడవ దాటుతుండగా బలమైన గాలులకు పడవ బోల్తా పడి పదిమంది వరకు కూలీలు చనిపోయారు. - 2004లో.. యానాం–ఎదుర్లంక వారధి నిర్మించక ముందు గౌతమీ గోదావరి నదీ పాయపై జరిగిన పలు పడవ ప్రమాదాల్లో 10మంది వరకు మృతిచెందారు. - 2007లో.. ఓడలరేవు–కరవాక రేవు మధ్య ప్రయాణికులతో వెళ్తున్న పడవ ప్రమాదానికి గురైంది. ఇంజ¯Œన్ చెడిపోవడంతో గాలికి సముద్రం వైపు కొట్టుకుపోతుండగా మరో పడవ ద్వారా అందులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. - 2008లో రాజమహేంద్రవరానికి చెందిన న్యాయవాదులు పాపికొండల విహారయాత్రకు వెళ్తూ పడవ ప్రమాదానికి గురై ఇద్దరు మృతిచెందారు. - 2009లో.. అంతర్వేది–బియ్యపు తిప్ప మధ్యలో వశిష్ట సాగర సంగమం సమీపంలో ప్రయాణం చేస్తుండగా పడవ మునిగి పశ్చిమ గోదావరికి చెందిన ముగ్గురు బలయ్యారు. - 2018లో.. మే 15న మంటూరు వద్ద 50 మందితో వెళ్తున్న లాంచీ బోల్తాపడిన ఘటనలో 19 మంది జలసమాధి అయ్యారు. మృతదేహాలను వెలికితీయడానికి మూడ్రోజులు శ్రమించాల్సి వచ్చింది. - 2018 జులైలో.. ఐ.పోలవరం మండలం పశువుల్లంకవద్ద పడవ బోల్తా ఘటనలో ఏడుగురు మరణించారు. ఇందులో ముగ్గురి మృతదేహాలు ఇప్పటివరకు లభించలేదు. కాగా, అప్పట్లోనే 120మంది ప్రయాణికులతో వెళ్తున్న పర్యాటక బోటు అగ్నిప్రమాదానికి గురైంది. డ్రైవర్ అప్రమత్తమై బోటును సమయస్ఫూర్తితో ఒడ్డుకు చేర్చడంతో అందరూ సురక్షితంగా బయటపడ్డారు. తాజాగా ఆదివారం దేవీపట్నం మండలం కచ్చలూరులో సంభవించిన దుర్ఘటన ఇదే ప్రాంతంలో మూడోది కావడం గమనార్హం. రెండు పెనుప్రమాదాలు ఆదివారమే 2017 నవంబర్ 12న విజయవాడ సమీపంలోని పవిత్ర సంగమం వద్ద కృష్ణా నదిలో బోటు తిరగబడిన ఘటన, తాజాగా తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలంలో జరిగిన బోటు ప్రమాదం రెండూ ఆదివారమే జరగడం గమనార్హం. కార్తీక మాసం సందర్భంగా నెల్లూరు, ప్రకాశం జిల్లాల నుంచి వచ్చిన భక్తులు విజయవాడ కృష్ణానదిలో బోటులో విహారానికి వెళ్లడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో 22 మంది జలసమాధి అయ్యారు. శనిఆదివారాలు సెలవులు కావ డంతో తెలంగాణ, ఏపీకి చెందిన అనేక మంది పాపికొండల యాత్రకు వచ్చారు. -
మేమైతే బతికాం గానీ..
సాక్షి, కాకినాడ: పాపికొండల యాత్ర ప్రశాంతంగా సాగుతోంది. గోదావరి అందాలను ఆనందంగా తిలకిస్తున్నాం. అంతలో ఏమైందో తెలీదు.. ఒక్కసారిగా పడవ కుదుపునకు గురైంది. బోటు పైభాగంలో ఉన్న 70 మంది ఒక్కసారిగా మాపై పడ్డారు. ఆ బరువుకు బోటు ఓ వైపునకు ఒరిగింది. ఇక బతకడం కష్టమనుకున్నాం. దేవుడా.. నువ్వే దిక్కని కళ్లు మూసుకున్నాం. ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో తెలీదుగానీ.. కచ్చులూరు గ్రామస్తులు దేవుడిరూపంలో వచ్చి మమ్మల్ని ఒడ్డుకు చేర్చారు.. మా ప్రాణాలు నిలిపారు.. అంటూ బోటు ప్రమాద బాధితులు ఉద్వేగంతో చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఆదివారం లాంచీ ప్రమాదం నుంచి బయటపడ్డ పలువురు బాధితులు.. ప్రమాదం జరిగిన క్షణాలను తలచుకుని వణికిపోతున్నారు. శవాసనమే.. శ్వాస నిలిపింది.. పైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.. ఉక్కపోతగా ఉందని పలువురు లైఫ్ జాకెట్లు తీసేశారు. భోజన ఏర్పాట్లు కూడా జరుగుతుండటంతో లైఫ్ జాకెట్లను వేసుకోలేదు. మరికొద్దిసేపట్లో పాపికొండలొస్తాయని బోటు సిబ్బంది చెప్పారు. ‘ఇది డేంజర్ జోన్.. బోటు అటూఇటూ ఊగుతుంది.. భయపడొద్దు’ అని చెప్పారు. అలా చెబుతుండగానే బోటు ఊగడం మొదలైంది.. పైన ప్లాస్టిక్ కుర్చీలన్నీ కుడివైపునకు జరిగాయి.. ఆ బరువుకు బోటు కుడివైపునకు ఒరిగిపోయింది.. ముందు ఏం జరుగుతోందో అర్థంకాలేదు. వెంటనే తేరుకుని నేను నేర్చుకున్న ‘శవాసనం’ వేశాను. కాసేపు అలాగే ఉండి ఈదుకుంటా వస్తున్నా. అంతలో ఒడ్డున ఉన్న గ్రామస్తులు తలోచెయ్యివేసి కాపాడారు. మా కుటుంబ సభ్యులం ఐదుగురం వస్తే.. నేనొక్కడినే మిగిలా.. నా భార్య, బావ, బావ భార్య, బావ కుమారుడు ఎక్కడున్నారో.. ఏమయ్యారో తెలియదు.. – జానకిరామయ్య, ఉప్పల్, హైదరాబాద్ 14 మందిలో ఐదుగురం మిగిలాం.. గోదావరి ఒడిలో కాసేపు సేదదీరుదామని చిన్నాన్న, పెదనాన్న కుటుంబ సభ్యులం కలిసి 14 మంది వచ్చాం. ఒక్కసారిగా బోటు నీళ్లలోకి వెళ్లిపోయింది. అంతే గుండె ఆగినంత పనైంది. దేవుడిపై భారం వేశా. అంతలో గ్రామస్తులొచ్చి గట్టుకు చేర్చారు. చివరికి మేం ఐదుగురిమే మిగిలాం. మా వాళ్లు ఏమయ్యారో.. అసలు ప్రాణాలతో ఉన్నారో లేదో.. – బసికె దశరథం, కడిపికొండ, వరంగల్ జిల్లా ఆ తొమ్మిది మంది ఏమయ్యారో.. గోదావరి అందాలు తిలకిద్దామని మా అన్నదమ్ముల కుటుంబాలు 14 మంది నెల ముందే ప్లాన్ చేసుకున్నాం. ఎంతో ఆనందంగా లాంచీ ఎక్కాం. అప్పటి వరకు విహారయాత్ర ప్రశాంతంగా సాగుతోంది. అంతలోనే సుడిలో బోటు కూరుకుపోతూ వచ్చింది. ఎలాగైనా గండం నుంచి గట్టెక్కించు దేవుడా అని ప్రార్థించాం. లైఫ్ జాకెట్లు ఉన్నవాళ్లు కొందరు ఈదుకుంటూ వెళ్లిపోయారు. మొత్తం ఐదుగురిమే బయటపడ్డాం. మిగతా తొమ్మిది మంది ఆచూకీ తెలియడం లేదు.. – గొర్రె ప్రభాకర్, కడిపికొండ, వరంగల్ జిల్లా ఆ రోజే యాత్రను రద్దు చేసుకోనుంటే.. వాళ్లు బతికేవాళ్లే.. అన్నదమ్ముల కుటుంబ సభ్యులం గత నెలలో ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నాం. కానీ వరద ప్రభావం ఎక్కువగా ఉందని టీవీ, పేపర్లలో చూసి ప్రయాణాన్ని రద్దు చేసుకుందామని బోటు తాలూకు ఆన్లైన్లో నంబర్‌కు ఫోన్ చేశాం. ఏం కాదులే వచ్చేయండని వారు చెప్పడంతో వచ్చి లాంచీ ఎక్కాం. 14 మంది వస్తే.. చివరికి ఐదుగురం మిగిలాం. మిగిలిన వారు ఏమయ్యారో తెలీడం లేదు. ఆ రోజు యాత్ర రద్దు చేసుకున్నా బాగుండేది.. – సురేష్, కడిపికొండ, వరంగల్ జిల్లా నలుగురిలో ఇద్దరం మిగిలాం.. సరదాగా గడుపుదామని నలుగురు స్నేహితులం వచ్చాం. మేం ప్రాణ స్నేహితులం.. ఎక్కడికి వెళ్లినా కలిసే వెళ్లేవాళ్లం. కానీ ఇలా జరుగుతుందని అస్సలు ఊహించనే లేదు. చివరికి ఇద్దరం మిగిలాం. మా స్నేహితులు భరణికుమార్, విశాల్ ఆచూకీ తెలియలేదు.. వారు బతికి ఉండాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాం.. – అర్జున్ కోదండ, హైదరాబాద్ -
పాపికొండల పర్యాటకానికి బ్రేక్
భద్రాచలం: పాపికొండల విహార యాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గోదావరి నదిలో లాంచీ మునిగిన ఘటనలో 20 మందికి పైగానే మృత్యువాత పడటం,, ఐదు రోజుల కిందట లాంచీలో పొగలు వ్యాపించి పూర్తిగా దగ్ధమైన ఘటనలతో అధికారులు అప్రమత్తమయ్యారు. ముందుజాగ్రత్త చర్యగా పాపికొండల పర్యాటకానికి వెళ్లే లాంచీలను నిలిపివేశారు. మళ్లీ ఎప్పుడు తిప్పాలనే దానిపై తాము స్పష్టత ఇచ్చేంత వరకూ నిర్వాహకులు గోదావరిలో లాంచీలు, పడవలు తిప్పొద్దని అధికారులు ప్రకటించారు. దీంతో భద్రాచలం వైపు నుంచి పాపికొండల యాత్రకు వెళ్లేందుకు వచ్చిన పర్యాటకులు బుధవారం వెనుదిరిగి వెళ్లారు. -
పాపికొండల్లో పర్యాటకులకు చుక్కలు
- రద్దీ పెరగడంతో బోట్లు లేవన్న నిర్వాహకులు - భద్రాచలంలో టికెట్లు కొన్నా.. 500 మంది వెనక్కే భద్రాచలం: పాపికొండల యాత్రకు వెళ్లిన పర్యాటకులకు ఆదివారం అక్కడి నిర్వాహకులు చుక్కలు చూపించారు. పరిమితికి మించి పర్యాటకులు రావటంతో అందుబాటులో బోట్లు లేవని నిర్వాహకులు చేతులెత్తేశారు. దీంతో భద్రాచలం నుంచి టికెట్లు కొనుగోలు చేసి వెళ్లిన సుమారు 500 మంది పాపికొండల షికారుకు వెళ్లకుండానే వెనుదిరిగారు. వరుసగా సెలవులు రావటంతో పాపికొండల విహార యాత్రకు ఆదివారం భారీగా పర్యాటకులు తరలివచ్చారు. వీరంతా భద్రాచలంలోని ఏజెంట్ల వద్ద టికెట్లను కొనుగోలు చేసి, కొంతమంది తమ సొంతవాహనాల్లో, మరికొంతమంది అద్దె వాహనాల్లో వీఆర్ పురం మండలంలోని పోచవరం రేవుకు చేరుకున్నారు. పాపికొండల యాత్రలో బోట్లు, లాంచీలు కలుపుకొని మొత్తం 26 ఉన్నాయి. వీటిలో సుమారు 2 వేల మందిని బోటు షికారుకు తీసుకెళ్తారు. అయితే ఆదివారం సుమారు 2700 మంది పర్యాటకులు వచ్చినట్లు టికెట్ల విక్రయాల ద్వారా లెక్క తేలింది. లాంచీల్లో కొంతమందిని సర్ధుబాటు చేసి, నిర్వాహకులు పంపించినప్పటికీ, అందరినీ పంపిస్తే పాపికొండల వద్ద మధ్యాహ్న భోజనాలకు ఇబ్బందులు ఏర్పడతాయని, సుమారు 500 మందిని వెనక్కి పంపించారు. దీంతో పర్యాటకులు లాంచీ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు.