నిండు గోదారిలో మృత్యు ఘోష | Boat Capsizes At Devipatnam In East Godavari | Sakshi
Sakshi News home page

నిండు గోదారిలో మృత్యు ఘోష

Published Mon, Sep 16 2019 4:30 AM | Last Updated on Mon, Sep 16 2019 7:56 AM

Boat Capsizes At Devipatnam In East Godavari - Sakshi

‘అన్నా.. అటు చూడు.. ఆ కొండ ఎంత బావుందో.. అక్కా.. ఇటు చూడు ఎన్ని నీళ్లో..’ అంటూ బంధు మిత్రులతో కలిసి పాపికొండల అందాలను వీక్షిస్తూ కేరింతలు కొట్టిన పర్యాటకులు అంతలోనే కాపాడండంటూ హాహాకారాలు చేశారు. రెప్పపాటులో నీట మునగడంతో ప్రాణ భయంతో గావు కేకలు పెట్టారు. భర్త ఒక వైపు.. భార్య మరో వైపు.. కొట్టుకుపోతుంటే అవే వారికి చివరి చూపులయ్యాయి.. మాటలకందని ఈ విషాద ఘటనలో 12 మంది విగతజీవులవ్వగా, 27 మంది మాత్రం సురక్షితంగా బయటపడ్డారు. గల్లంతైన దాదాపు 37 మంది కోసం వారి కుటుంబ సభ్యులు కళ్లల్లో వత్తులు వేసుకుని ఎదురు చూస్తున్నారు. ‘దేవుడా.. మా నాన్నను మా వద్దకు ప్రాణాలతో చేర్చు.. స్వామీ మా అమ్మను బతికించు.. భగవంతుడా.. మా అన్నను సజీవంగా మా ఇంటికి చేర్చు.. ఈ జీవితానికి ఇదే మా ఆఖరు కోరిక..’ అంటూ వారు గోదారి ఒడ్డున గుండెలవిసేలా పొగిలి పొగిలి ఏడుస్తున్నారు. నా భర్త, బిడ్డ వెళ్లిపోయారు.. ఇక నేనెందుకు బతకాలి దేవుడా.. అంటూ మామ అస్థికలను గోదావరిలో కలపడానికి తిరుపతి నుంచి వచ్చిన మాధవీలత కన్నీరుమున్నీరుగా విలపించింది. వీరందరినీ ఓదార్చడం ఎవరి వల్లా కావడం లేదు.

దేవీపట్నం నుంచి సాక్షి బృందం : ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకున్న వారి ఆశ అడియాస అయింది. పాపికొండలు చూసొద్దామని ఎంతో ఆశతో సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు గోదావరమ్మ ఒడిలో జల సమాధి అయ్యారు. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం సమీపాన కచ్చులూరు వద్ద గోదావరిలో ఆదివారం మధ్యాహ్నం 71 మందితో వెళ్తున్న బోటు నీట మునిగి 12 మంది మృత్యువాత పడ్డారు. 27 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా, 32 మంది గల్లంతయ్యారు. భోజనాల కోసం లైఫ్‌ జాకెట్లు తీసేసిన సమయంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో ఎక్కువ మంది మృత్యువాత పడ్డారు. గోదావరి నది చరిత్రలో ఇప్పటి వరకు జరిగిన అతి పెద్ద ప్రమాదాలలో ఇది రెండోది. ప్రమాద ఘటన గురించి తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగాన్ని వెంటనే అప్రమత్తం చేశారు. యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టేలా ఆదేశించారు. హెలికాఫ్టర్లు, నేవీ, ఎన్‌డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక బృందాలను రంగంలోకి దించారు. రాత్రి సైతం గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. 


ఆదివారం తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన వశిష్ట బోటు
అనుమతి లేదని ఆపేసినా..
గోదావరిలో వరద కారణంగా నెల రోజులుగా పాపికొండలకు బోటు ప్రయాణాన్ని నిలిపివేశారు. ప్రస్తుతం గోదావరి వరద కొద్దిగా నెమ్మదించింది. ఆదివారం కావడంతో పాపికొండలు చూడటం కోసం పర్యాటకులు గండిపోశమ్మ గుడి వద్దకు వచ్చారు. రాయల్‌ వశిష్ట అనే రెండు అంతస్తుల ప్రైవేట్‌ బోటులో వివిధ ప్రాంతాలకు చెందిన 63 మంది  పర్యాటకులు, 8 మంది సిబ్బందితో కలిసి మొత్తం 71 మంది ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆక్కడి నుంచి బయలుదేరారు. దేవీపట్నం వద్ద పోలీసులు తనిఖీ నిర్వహించారు. అనుమతి లేదంటూ దేవీపట్నం ఎస్‌ఐ నాగదుర్గాప్రసాద్‌ బోటును నిలిపివేశారు. అయితే తమకు పోలవరం పోలీసుల నుంచి అనుమతులు వచ్చాయంటూ బోటు నిర్వాహకులు బోటును తీసుకుని ముందుకు సాగారు.

బోటు అక్కడి నుంచి బయలుదేరిన మూడు గంటల తర్వాత 1.45 గంటల ప్రాంతంలో కచ్చులూరు మందం వద్దకు చేరుకుంది. అక్కడ కొండ మలుపు ఉండటం వల్ల గోదావరి కొండను తాకుతూ ఉధృతంగా ప్రవహిస్తోంది. సాధారణంగా బోట్‌ నిర్వాహకులు ఆ వైపుగా కాకుండా పశ్చిమగోదావరి జిల్లా వైపుగా తీసుకువెళ్తుంటారు. అయితే బోట్‌ డ్రైవర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించి వడి ఉధృతంగా ఉన్న వైపుగా బోటును తీసుకెళ్లారు. ఆ సమయంలో బోటు పై అంతస్తులో ప్లాస్టిక్‌ కుర్చీలలో కూర్చున్న పర్యాటకులు అక్కడ జరుగుతున్న వినోద కార్యక్రమాలను ఆస్వాదిస్తున్నారు. మరికొందరు కింది అంతస్తులో భోజనాలు చేస్తున్నారు. అంతలో బోటు ఒక్కసారిగా కుదుపునకు లోనవడంతో పైన ఉన్న పర్యాటకులు అందరూ ఒక్కసారిగా వెనక్కి పడిపోయారు. వారిలో కొంతమంది కుర్చీలతో సహా బోట్‌లో నుంచి నదిలోకి పడిపోయారు. అదే సమయంలో బోటును ముందుకు తీసుకువెళ్లేందుకు డ్రైవర్‌ ఇంజన్‌ను ఒక్కసారిగా రైజ్‌ చేయడంతో ఒక్కసారిగా వెనక్కి ముందుకు ఊగింది. దీంతో మరికొందరు నదిలో పడిపోయారు. అంతలో బోటు నీట మునిగిపోయింది. 



లైఫ్‌ జాకెట్లు అందరూ వేసుకుని ఉండుంటే..
బోటు నీట మునిగిన సమయంలో లైఫ్‌ జాకెట్లు వేసుకున్నవారు మాత్రమే మృత్యువు నుంచి తప్పించుకున్నారు. మిగిలిన వారు నీట మునిగారు. భోజన సమయం కావడంతో ఎక్కువ మంది లైఫ్‌ జాకెట్లు వేసుకోలేదని ప్రత్యక్ష సాక్షి ఒకరు చెప్పారు. బోటు మునిగిపోతుండటం చూసిన పశ్చిమగోదావరి జిల్లా తూటు కుంట గ్రామస్తులు, దేవీపట్నం మండలం కచ్చులూరు గిరిజనులు ఐదు ఇంజన్‌ బోట్లలో సంఘటనా స్థలానికి చేరుకుని 27 మందిని ఒడ్డుకు తీసుకొచ్చారు.  ఈ ప్రమాదంలో గల్లంతైనవారిలో ఎక్కువ మంది తెలంగాణాకు చెందిన వారు ఉన్నారు. హైదరాబాద్, వరంగల్, ఖాజీపేట, హయత్‌నగర్, ఎల్‌బీనగర్, కృష్ణాజిల్లా బాపులపాడు, పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం, విశాఖపట్నం జిల్లా వేపగుంట, అరిలోవ, గుంటూరుజిల్లా మంగళగిరి ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. తమతోపాటు వచ్చినవారు తమ కళ్లముందే నీట మునిగి పోవడంతో ప్రమాదం నుంచి తప్పించుకున్న వారు కన్నీటి పర్యంతమయ్యారు. రక్షించిన వారిలో 16 మందిని రంపచోడవరం ఏరియా అసుపత్రిలో ప్రాథమిక చికిత్స చేసి రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలిలో మొబైల్‌ ఫోన్లు పనిచేయక పోవడంతో సమాచారం అందడంలో జాప్యం చోటు చేసుకుంది.


రంపచోడవరం ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తున్న మంత్రులు ఆళ్ల నాని, కన్నబాబు 
యుద్ధప్రాతిపదికన కదిలిన యంత్రాంగం
ప్రమాదం విషయం తెలియగానే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి వెంటనే స్పందించారు. మంత్రులను, అధికారులను సంఘటనా స్థలానికి పంపి సహాయక చర్యలను చేపట్టాలని ఆదేశించారు. హెలికాఫ్టర్లను, వివిధ బృందాలను వెంటనే రంగంలోకి దింపారు. ఉభయగోదావరి జిల్లాల కలెక్టర్లు మురళీధరరెడ్ది, రేవు ముత్యాలరాజు, ఎస్పీలు నయీమ్, నవదీప్‌సింగ్, పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ వేణుగోపాలరెడ్డి ఇతర అధికారులు రంగంలోకి దిగి సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఉప ముఖ్యమంత్రులు ఆళ్లనాని, పిల్లి సుభాష్‌ చంద్రబోస్, మంత్రులు కురసాల కన్నబాబు, ఎమ్మెల్యేలు తెల్లంబాలరాజు, నాగులపల్లి ధనలక్ష్మి, కాపు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ జక్కంపూడి రాజా తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. మృతుల్లో ఎక్కువ మంది తెలంగాణకు చెందిన వారు ఉండటంతో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు కూడా జరిగిన సంఘటనపై ఆరా తీశారు. రంపచోడవరం ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణాకు చెందిన క్షతగాత్రుల పరిస్థితిని వ్యవసాయశాఖా మంత్రి కన్నబాబుతో తెలంగాణా మంత్రులు కేటీఆర్, ఎర్రబల్లి దయాకరరావు మాట్లాడి పరిస్థితి తెలుసుకున్నారు. ప్రధాని మోదీ ప్రమాద ఘటనపై ట్విటర్‌లో సంతాపం తెలిపారు. 

చదవండి : 10 లక్షల పరిహారం

గల్లంతైనవారిలో తెలంగాణవాసులే అధికం

మేమైతే బతికాం గానీ..

ముమ్మరంగా సహాయక చర్యలు

ఆపద్బాంధవులు.. అడవి బిడ్డలు

తండ్రి అస్థికలు కలుపుదామని వచ్చి..

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/4

ప్రమాదానికి ముందు వశిష్ట బోటులో వెళ్తున్న పర్యాటకులు

2
2/4

ఘటనా స్థలం వద్ద మృతదేహాలు

3
3/4

హెలికాఫ్టర్లు, ప్రత్యేక బృందాలతో ఆగమేఘాలపై సహాయక చర్యలు చేపట్టిన ప్రభుత్వం

4
4/4

దేవీపట్నం వద్ద గాలింపు చర్యలు చేపడుతున్న సహాయక బృందాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement