బోటు మునిగిన ప్రదేశంలో ఐరన్ తాడుతో లంగరు వేస్తున్న ధర్మాడి సత్యం బృందం
రంపచోడవరం/దేవీపట్నం: గోదావరిలో గల్లంతైన ప్రైవేట్ టూరిజం బోటు ‘రాయల్ వశిష్ట పున్నమి’ వెలికితీత పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. దేవుడు గొంది వద్ద గోదావరి వైపు గల ఇసుక మేటను వేదికగా చేసుకుని ధర్మాడి సత్యం బృందం బోటును వెలికితీసే పనులు చేపట్టింది. బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రాంతానికి ఐరన్ పంటు, ఏపీ టూరిజం బోటు సహాయంతో వెళ్లి ఐరన్ రోప్‌లను బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రాంతంలో వలయం మాదిరిగా నదిలోకి జారవిడిచి ఉచ్చులా బిగించారు. దానికి బలమైన వస్తువు చిక్కుకున్నట్టు గుర్తించారు. ఆ వస్తువు బోటా లేక కొండ రాయా అనేది ఇంకా తేలలేదు. అది ఏమిటనేది మంగళవారం తేలుతుందని చెబుతున్నారు.
సోమవారం ఉదయం 8 గంటలకు బోటును వెలికి తీసేందుకు అవసరమైన రోప్‌లు, కప్పీలతో దేవీపట్నం నుంచి సత్యం బృందం బయలుదేరింది. దేవుడు గొంది ఇసుక దిబ్బల నుంచి ఏపీ టూరిజం బోటు, ఐరన్ పంటు సహాయంతో రెండు వేల అడుగుల పొడవున్న ఐరన్ రోప్‌ను బోటు ఉన్నట్టు గుర్తించిన ప్రాంతం మీదుగా వలయంలా గోదావరిలోకి విడిచిపెట్టారు. రోప్‌కు ఒకవైపు గల చివరి భాగాన్ని (కొస) గోదావరి ఒడ్డున ఉన్న బలమైన చెట్టుకు కట్టారు. రెండో కొసను ఒడ్డున ఉన్న మెషిన్ సహాయంతో బిగించుకుంటూ వచ్చారు. అప్పటికే సమయం సాయంత్రం 5 గంటలు కావడంతో బోటును వెలికి తీసే పనులు నిలిపివేశారు. గోదావరి శాంతించడంతో భయంకరమైన సుడులు తగ్గాయి. నీటి ప్రవాహం సాధారణ స్థాయిలో ఉండటంతో బోటును వెలికి తీసేందుకు అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
Comments
Please login to add a commentAdd a comment