సాక్షి , రాజమహేంద్రవరం: దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన వారి ఆచూకీ కోసం సంబంధిత బంధువులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితులు, స్నేహితుల ఆర్తనాదాలతో ప్రభుత్వాసుపత్రిలో ఆవరణలో ఇంకా విషాద వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఎటునుంచి ఏ ప్రభుత్వ వాహనం వచ్చినా అందులో తమవారి మృతదేహం వచ్చిందేమోనని ఆశతో పరుగులు తీయడం పలువురిని కలచి వేస్తోంది.
‘డాడీ’ పచ్చబొట్టు ... కానరాదు ఇక ఎప్పటికీ
బోటు ప్రమాదంలో మృతి చెందిన మృతురాలు మంచిర్యాల గ్రామానికి చెందిన కాకునూరు రమ్యశ్రీ ఇంజినీర్ చదివి హైదరాబాద్‌లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో ఇంజినీర్‌గా పని చేస్తోంది. తండ్రిపై ప్రేమతో తన చేతిపై ‘డాడీ’ అంటూ పచ్చబొట్టు పొడిపించుకుంది. దీనిని తలుచుకుంటూ రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ విలపిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది. ‘ఉద్యోగం వచ్చింది కదా డాడీ...అమ్మ మొక్కుకున్న మొక్కులన్నీ తీర్చుతున్నానని’ చెప్పిన తన చిట్టి తల్లి విహార యాత్రకు వచ్చి కనీసం కడచూపుకు కూడా నోచుకోకుండా చేస్తుందని అనుకోలేదని రమ్యశ్రీ తండ్రి సుదర్శన్ బోరున విలపిస్తున్నారు. ఆదివారం ప్రభుత్వ ఆసుపత్రికి రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి, తండ్రి దర్శన్, కలసి కంటతడిపెట్టుకున్నారు. తమ కుమార్తె మృతదేహం కోసం ఎనిమిది రోజులుగా ప్రభుత్వ ఆసుపత్రిలో నిరీక్షిస్తునే ఉన్నారు.
చదవండి: రమ‍్య కోసం ఎదురుచూపులు
నా తండ్రి ఆచూకీ తెలపండి
బోటు డ్రైవర్ నూకరాజు కుమారుడు ధర్మారావు, బంధువులు, మహిళలు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విలపిస్తున్నారు. తన తండ్రికి బోటు నడపడంలో నైపుణ్యం ఉందని, ఇలా జరిగిందని, తమ తండ్రి మృతదేహం ఆచూకీ చెప్పాలంటూ వేడుకుంటున్నారు. మరో డ్రైవర్ పోతాబత్తుల సత్యనారాయణ కుటుంబీకులు కూడా ప్రమాదం జరిగినప్పటి నుంచి ప్రభుత్వ ఆసుపత్రిలో పడిగాపులు కాస్తున్నారు.
మా మేనల్లుడేడండీ
బోటు ప్రమాదం జరిగిన మొదటి రోజు నుంచీ హైదరాబాద్ ఉప్పల్‌కు చెందిన రాజేంద్ర ప్రసాద్ అనే 70 ఏళ్ల వృద్ధుడు ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంటున్నాడు. తన మేనల్లుడు అంకెం పవన్ కుమార్, అతని భార్య అంకెం భవానీల ఆచూకీ తెలియజేయాలంటూ వేడుకుంటున్నాడు. ఆదివారం రమ్యశ్రీ తల్లి భూలక్ష్మి రోదిస్తుండగా అక్కడకు వెళ్లిన రాజేంద్ర ప్రసాద్ తన కుటుంబంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారని, దుఖాన్ని దిగమింగుకోవాలని సముదాయించిన తీరు అక్కడున్నవారికి కన్నీళ్లను రప్పించింది.
మా కుమారుడి ఆచూకీ చెప్పరూ
బోటులో సహాయకుడిగా పని చేసిన పాతపట్టి సీమకు చెందిన మణికంఠ ఆచూకీ చెప్పరూ అంటూ అతని తండ్రి నరసింహారావు, బాబాయిలు, బంధువులు ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పడిగాపులు పడుతున్నారు. అంబులెన్స్ వచ్చిందంటే దానిలో మృతదేహాలు ఉంటాయేమో అని పరుగులు తీసుస్తున్నారు.
మేనల్లుడి కోసం...
విహారయాత్రలో కుటుంబం మొత్తం గల్లంతుకాగా అందులో బావమరిది, అతని భార్య, కుమార్తెల మృతదేహాలు లభ్యమైనా మేనల్లుడు కర్నూల జిల్లా నంద్యాలకు చెందిన బాచిరెడ్డి విఖ్యాతరెడ్డి(6) మృతదేహం ఇప్పటివరకూ దొరకలేదని అతని మేనమామ చంద్రశేఖరరెడ్డి ఎదురుచూస్తున్నాడు. ఇంటి నుంచి తన మామ అస్తమానూ ఫోన్ చేస్తున్నాడని ఏమి సమాధానం చెప్పాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment