
దోమల హేమంత్
సాక్షి, కాజీపేట: ఏడ్చీ ఏడ్చీ ఇంకిపోయిన కన్నీళ్లు.. తమ వారేమయ్యారోనని అంతు లేని ఎదురుచూపులు.. సురక్షితంగా బయటపడిన వారు ఎలా ఉన్నారోనని ఆవేదన.. వచ్చివెళ్లే వారి పరామర్శలు.. రాత్రి మొత్తం జాగారం.. ఇదీ కడిపికొండ గ్రామంలోని పరిస్థితి! పాపికొండల విహారయాత్రకు వెళ్లి తూర్పుగోదావరి జిల్లాలో గోదావరిలో బోటు బోల్తా పడిన ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లా కడిపికొండ వాసులు 14 మంది చిక్కుకున్న విషయం తెలిసిందే. వీరిలో ఐదుగురు సురక్షితంగా బయటపడగా, ఇంకో ఇద్దరి మృతదేహాలు లభించాయి. మిగతా ఏడుగురి ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబాలు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నాయి. కాగా, హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తూ పాపికొండలకు వెళ్లి ప్రమాదంలో చిక్కుకున్న వారిలో న్యూశాయంపేట వాసి హేమంత్ కూడా ఉన్నట్లు తెలియడంతో గల్లంతైన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది. కాగా, బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృతదేహాలు సోమవారం అర్ధరాత్రి 2.30 గంటలకు స్వస్థలానికి చేరగా కుటుంబీకులకు అప్పగిం చారు. దీంతో గ్రామంలో రోదనలు మిన్నంటాయి. అలాగే, సురక్షితంగా బయటపడిన ఐదుగురికి రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స చేసిన అనంతరం అంబులెన్స్‌లో ఇక్కడకు పంపించగా మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఇక సోమవారం ఉదయం వరకు రంపచోడవరం చేరుకున్న రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్‌లు అక్కడి మంత్రులు, అధికారులతో మాట్లాడుతూ మృతదేహాల తరలింపు, గల్లంతైన వారి గాలింపు చర్యలను సమీక్షించారు.
కాజీపేట మండలంలోని కడిపికొండ కన్నీటి సంద్రంగా మారింది.. గ్రామంలో ఎవరిని కదిలించినా కన్నీళ్లే.. ‘అంతు’చిక్కని తమ వారి ఆచూకీ కోసం రోదనలు.. మృతి చెందినట్లు తేలిసిన వారి కుటుంబాల్లో మిన్నంటిన ఆర్తదానాలు.. సురక్షితంగా బయటపడిన వారి బంధువులు తమ వారు ఎప్పుడొస్తారా అని ఎదురుచూస్తూనే.. సహచరులు గల్లంతు కావడంపై ఆవేదన... ఇదీ గ్రామంలో సోమవారం నెలకొన్న పరిస్థితి! తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం మండలం కచ్చులూరు వద్ద గోదావరిలో ఆదివారం చోటు చేసుకున్న బోటు ప్రమాదంలో కడిపికొండకు చెందిన 14 మంది చిక్కుకుకోవడం తెలిసింది. ఇందులో ఐదుగురు సురక్షితంగా బయటపడగా మరో ఇద్దరి మృతదేహాలు ఆదివారం రాత్రే బయటపడ్డాయి. ఇక మిగిలిన ఏడుగురి ఆచూకీ లేకపోవడంతో వారి కుటుంబాలు టీవీలు చూస్తూ.. పరామర్శకు వచ్చిన వారిని ఆరా తీస్తూ రాత్రంగా గడిపారు.
వెలగని పొయ్యి
గల్లంతైన వారితో పాటు మృతి చెందిన వారి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు. అలాగే, సురక్షితంగా బయటపడిన వారి కుటుంబీకులు తమ వారి కోసం ఎదురుచూడడం కనిపించింది. దీంతో ఆదివారం రాత్రి నుంచి సోమవారం రాత్రి వరకు గ్రామంలోని వారి గృహాల్లో పొయ్యి వెలగలేదు. మిగతా గ్రామస్తులు ముందుండి వంటలు చేయించి భోజనాలు పెట్టిస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు.
పాండవుల గుట్టల్లో పాపికొండలు ప్లాన్ కడిపికొండకు చెందిన బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, సివ్వి వెంకటస్వామి, బస్కే రాజేంద్రప్రసాద్, బస్కే అవినాష్, దర్శనాల సురేష్, ఆరెపల్లి యాదగిరి, గొర్రె రాజేందర్, కొండురి రాజ్‌కుమార్, కొమ్ముల రవి, గొర్రె ప్రభాకర్, బస్కే ధర్మరాజు, బస్కే రాజేందర్, బస్కే వెంకటస్వామి ఐదేళ్లుగా వాకింగ్ చేస్తున్నారు. వీరిలో సివ్వి వెంకటస్వామి, బస్కే వెంకటస్వామి రిటైర్డ్ రైల్వే ఉద్యోగులు కాగా గొర్రె ప్రభాకర్ రైల్వే బుకింగ్ క్లర్క్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. మిగతా వారిలో కొందరు టీఆర్‌ఎస్‌లో కొనసాగుతుండగా.. ఇంకొందరు ఆటో డ్రైవర్లు, పెయింటర్లుగా జీవనం కొనసాగిస్తున్నారు. ప్రతీరోజూ కడిపికొండ నుండి రాజీవ్‌గృహ కల్ప సముదాయం వరకు వాకింగ్ చేయడం ఆనవాయితీ. ఆ సమయంలో ఏర్పడిన పరిచయం స్నేహంగా మారింది. అందరూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో మాదిగ మహరాజ్ కుల సంక్షేమ సంఘాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ సంఘం ద్వారా పాపికొండల టూర్‌కు వెళ్లాలని రెండు నెలల క్రితమే నిర్ణయించుకున్నారు. రైలు టికెట్లు కూడా బుక్ చేసుకున్నప్పటికీ ఆ సమయంలో భారీ వర్షాలు కురవడంతో టికెట్లు రద్దు చేసుకున్నారు. అయినా విహారయాత్రకు వెళ్లాలనే కాంక్షతో పాండవుల గుట్టకు వెళ్లారు. ఆ సమయంలోనే అక్కడే మాట్లాడుకునే క్రమంలో ఎలాగైనా పాపికొండలు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు మళ్లీ టూర్‌ను ప్లాన్ చేసుకుని సరదాగా వెళ్లి వచ్చారు. అనంతరం పాండవుల గుట్ట టూర్ నుండి పాపికొండల టూర్‌కు ప్లాన్ వేసారు. ఇటీవల వాతావరణం అనుకూలించగా రైల్వే బుకింగ్ క్లర్క్ గొర్రె ప్రభాకర్ 14 మందికి రైలు టికెట్లు బుక్ చేశారు.
కంటిమీద కునుకులేదు..
కడిపికొండకు చెందిన 14 మంది పాపికొండల టూర్‌కు వెళ్లి బోటు ప్రమాదంలో చిక్కుకోవడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులు, బంధువులు, గ్రామస్తులు తమ వారి ఆచూకి లభిం చిందా లేదా.. మృతి చెందారా, ఏదైనా సమాచారం అందుతుందా అంటూ ఆదివారం రాత్రంతా జాగారం చేశారు. వీరికి తోడు కడిపికొండ వాసులు కూడా ఉండడంతో ఊరంతా జాగారం చేసినట్లయింది.
మృత్యుంజయులు
పాపికొండల విహారయాత్రకు వెళ్లిన కడిపికొండకు చెందిన 14 మందిలో సురక్షితంగా బయటపడ్డ బస్కే దశరథం, బస్కే వెంకటస్వామి, ఆరెపల్లి యాదగిరి, గొర్రె ప్రభాకర్, దర్శనాల సురేష్‌ను రంపచోడవరం ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందజేయగా... సోమవారం ఉదయకల్లా అక్కడకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పువ్వాడ అజయ్, వరంగల్ ఎంపీ పసునూని దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పరామర్శించారు. తక్షణ వైద్యఖర్చుల నిమిత్తం రూ.10వేలు అందజేయడంతో పాటు వైద్యులు మాట్లాడారు. అనంతరం వరంగల్ నుంచి వెళ్లిన కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు, ఇన్‌స్పెక్టర్ అజయ్ తదితరులు అంబులెన్స్‌లో తీసుకురాగా.. సోమవారం రాత్రి 11.30 గంటలకు హన్మకొండకు చేరుకోగానే మ్యాక్స్‌కేర్ ఆస్పత్రిలో చేర్పించారు.
టూర్‌సాగిందిలా..
కాజీపేట నుంచి శుక్రవారం రాత్రి గౌతమి ఎక్స్‌ప్రెస్ లో బయలుదేరిన వారు శనివారం ఉదయం 5.45 నిమిషా లకు రాజమండ్రి చేరుకున్నారు. ఓ లాడ్జిలో సేద తీరి.. గైడ్ సాయంతో రూ.3వేల టూర్ ప్యాకేజీ మాట్లాడుకున్నారు. శనివారం ఉదయం రాజమండ్రి పరిసర ప్రాంతాలను సందర్శించారు. ఆదివారం ఉదయం 11.30 నిమిషాలకు దేవిపట్నం ప్రాంతానికి చేరుకుని బోటులో పాపికొండల టూర్‌కు బయలుదేరారు. మధ్యాహ్నం 12.35 నిమిషాలకు కచ్చులూరుకు బోటు చేరుకోగా గోదావరి ఉగ్రరూపానికి మునిగిపోయింది. దీంతో లైఫ్ జాకెట్లు ధరించిన ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. మిగతా వారు గల్లంతు కాగా.. బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృతదేహాలు మాత్రమే వెలుగు చూశాయి.
ప్రమాద ఘటనలో న్యూశాయంపేట వాసి
గోదావరిలో బోటు మునిగిన ఘటనలో వరంగల్ అర్బన్ జిల్లాకు చెందిన మరొకరు కూడా ఉన్నట్లు సోమవారం సాయంత్రానికి తెలిసింది. హన్మకొండ హంటర్‌రోడ్డులోని న్యూశాయంపేటకు చెందిన దోమల హేమంత్ గల్లంతైన వారిలో ఉన్నట్లు సమచారం. హైదరాబాద్‌లోని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో విధులు కొనసాగిస్తున్న హేమంత్ స్నేహితులతో కలిసి పాపికొండలు టూర్‌కు వెళ్లాడు. బోటు ముగినిపోయినట్లు తెలియడంతో హేమంత్ తండ్రి భూమయ్య, తల్లి పద్మావతి కన్నీరుమున్నీరయ్యారు. కాగా, భూమయ్య టైలరింగ్ వృత్తి కొనసాగిస్తూ ముగ్గురు కుమారులను చదివించారు. ఇప్పుడు హేమంత్ గల్లంతైనట్లు తెలియడంతో ఆయన రోదిస్తున్నారు.
బస్కే అవినాష్ మృతదేహం వద్ద రోదిస్తున్న తల్లి ; బస్కే రాజేందర్ కుటుంబీకులు
రెండు మృతదేహాలు కుటుంబ సభ్యులకు అప్పగింత
గోదావరి బోటు ప్రమాదంలో మృతి చెందిన బస్కే రాజేందర్, బస్కే అవినాష్ మృత దేహాలు కూడా కడిపికొండకు చేరుకున్నాయి. ఈ మేరకు రంపచోడవరం ఆస్పత్రిలో పోస్టుమార్టం కార్యక్రమాలు త్వరగా పూర్తయ్యేలా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సమీక్షించారు. ఆతర్వాత అంబులెన్స్‌లో కడిపికొండకు తీసుకురాగా కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మృతదేహాలు చేరుకోగానే కుటుంబీకులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.
పరామర్శించిన మంత్రులు
గోదావరి నదిలో బోటు ప్రమాదంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడ్డ బస్కే దశరధం, బస్కే వెంకటస్వామి, గొర్రె ప్రభాకర్, దర్శనాల సురేష్, ఆరెపల్లి యాదగిరి రంపచోడవరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితులు సమీక్షిచేందుకు వెళ్లిన రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ వారిని పరామర్శించి ధైర్యం చెప్పారు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి బాధితులను పరామర్శించిన సమయంలో తెలంగాణ మంత్రులు కూడా ఉన్నారు. ఇక కాజీపేట ఇన్‌స్పెక్టర్ అజయ్ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారితో మాట్లాడి ఘటన వివరాలు తెలుసుకన్నారు.
రెండు శాఖలు 13 మంది ఇంజనీర్లు....
వరంగల్: పాపికొండల విహార యాత్రకు రెండు ప్రాంతాలు, రెండు శాఖలకు చెందిన 13 మంది ఇంజనీర్లు వెళ్లిన ట్లు తెలిసింది. ఇందులో హైదరాబాద్ పోలీసు హౌజింగ్ శాఖకు చెందిన ఏఈలు ఏడుగురు ఉండగా ఆదిలాబాద్ జిల్లాకు విద్యు త్ శాఖ ఏఈలు ఆరుగురు ఉన్నట్లు సమాచారం. హైదరాబాద్ హౌజింగ్ ఏఈల్లో ప్రమాదం నుంచి నలుగురు బయట పడగా ముగ్గురు గల్లంతయ్యారు. వీరిలో హన్మకొండ న్యూశాయంపేటకు చెందిన హేమంత్ కూడా ఉన్నట్లు తెలియడంతో ఆ కుటుంబంలో విషాదం అలుముకుంది.
ఐదు అంబులెన్స్‌లు... అధికారులు
తూర్పుగోదావరి జిల్లా దేవిపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాదంలో చిక్కుకున్న జిల్లా వాసులను అండగా నిలిచేందుకు ఇక్కడి నుంచి అధికారులు ఆదివారం రాత్రే వెళ్లారు. జిల్లా నుంచి ఐదు అంబులెన్స్‌లతో పాటు కాజీపేట తహసీల్దార్ బండి నాగేశ్వర్‌రావు, ఇన్‌స్పెక్టర్ అజయ్ వెళ్లారు. ఈ మేరకు ఓ అంబులెన్స్‌లో బస్కె రాజేందర్, బస్కె అవినాష్ మృతదేహాలతో పాటు సురక్షితంగా బయటపడిన మరో ఐదుగురికి ఇంకో అంబులెన్స్‌లో పంపించారు.
నదిలో పడ్డాక లైఫ్ జాకెట్ దొరికింది..
రాజమండ్రి నుంచి పాపికొండలు.. అక్కడి నుంచి భద్రాచలం వెళ్లాలన్నది మా ప్లాన్. బోటు ప్రయాణం సాగుతుండగా ఒక్కసారిగా కుదిపినట్లు అయ్యింది. అందులో ఉన్నవారంతా కేకలు పెడుతుండగానే బోటు మనిగిపోయింది. మునిగిన బోటు ఒక్కసారిగా పైకి లేచింది. ఆ క్షణంలోనే నాతో పాటు కొందరం బయటపడ్డాం. అప్పటి వరకు నాకు లైఫ్ జాకెట్ లేదు. బోటులో ఉన్న కొన్ని జాకెట్లు నీటిపై తెలియడుతుండగా ఒక్కటి వేసుకుని ఈదడం మొదలు పెట్టాను. సుమారు 15 నిమిషాల తరువాత స్థానిక జాలర్లు నన్ను రక్షించారు. అలా నేను బతికి బయట పడ్డాను. నదిలో పడ్డాక మళ్లీ ఈ లోకాన్ని చూస్తాననని ఊహించ లేదు.
– బస్కే వెంకటస్వామి, రిటైర్డ్ రైల్వే ఉద్యోగి
సంబంధిత వార్తలు...
నిండు గోదారిలో మృత్యు ఘోష
Comments
Please login to add a commentAdd a comment