కొత్త లాంచీలే కొంప ముంచుతున్నాయ్‌ | Boat Accidents with new boats itself majorly | Sakshi
Sakshi News home page

కొత్త లాంచీలే కొంప ముంచుతున్నాయ్‌

Published Wed, Sep 25 2019 4:27 AM | Last Updated on Wed, Sep 25 2019 5:21 AM

Boat Accidents with new boats itself majorly - Sakshi

కొత్తగా తయారు చేసిన ఏసీ బోట్‌

కొత్త లాంచీలే పర్యాటకుల ప్రాణాల్ని హరిస్తున్నాయా. నిండు గోదారిలోనూ దశాబ్దాల తరబడి సాఫీగా ప్రయాణించిన పాత లాంచీ డిజైన్లను పక్కనపెట్టి.. కొత్త డిజైన్లతో రూపొందించటం వల్లే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయా.. అవుననే సమాధానమిస్తున్నారు సీనియర్‌ సరంగులు. తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం కచ్చులూరు వద్ద ఇటీవల జరిగిన ప్రమాదానికి లాంచీ బరువు, డిజైన్‌ కూడా ప్రధాన కారణమని విశ్లేషిస్తున్నారు.

వేలేరుపాడు (పశ్చిమ గోదావరి జిల్లా): రహదారి వ్యవస్థ లేనికాలంలో.. 1986 వరకు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో లాంచీలే ప్రజల రవాణా అవసరాలు తీర్చేవి. భద్రాలం నుంచి రాజమండ్రి (150 కిలోమీటర్లు), కూనవరం నుంచి రాజమండ్రి (100 కిలోమీటర్లు), కూనవరం నుంచి భద్రాచలం (50 కిలోమీటర్లు), కూనవరం నుంచి ఛత్తీస్‌గఢ్‌లోని కుంట (15 కిలోమీటర్లు) మధ్య లాంచీలు పెద్దఎత్తున తిరిగేవి. అప్పట్లో ప్రతి లాంచీలో 200 మంది ప్రయాణికులతోపాటు విత్తనాలు, ఎరువులు, కిరాణా సామగ్రి, నిత్యావసర సరుకుల వంటివి టన్నుల కొద్దీ రవాణా చేసేవారు. అధిక లోడు ఉన్నప్పుడు ఫుట్‌ బోర్డును సైతం గోదావరి నీరు తాకుతూ ఉండేది. అయినా ఏనాడూ ప్రమాదాలు సంభవించలేదు.

ఆ‘రామ్‌’గా వెళ్లొచ్చేవారు..
1917లో ఆయిల్‌ ఇంజిన్‌తో నడిచే ‘శ్రీరామ’ అనే లాంచీ ఉండేది. ఆ తర్వాత చాలా లాంచీలు గోదావరిలోకి వచ్చాయి. వీటిలో ప్రధానమైనవి ఝాన్సీరాణి, ఉదయ భాస్కర్, శ్రీరాములు, రాజేశ్వరి, ముద్దుకృష్ణ, మురళీకృష్ణ, సావిత్రి, విజయలక్ష్మి, స్వరాజ్యలక్ష్మి పేర్లతో లాంచీలు నడిచేవి. గోదావరిలో సుడిగుండాలు కొత్త కాదు.  పాత లాంచీలు ఉన్నప్పుడు ఏనాడూ సుడిగుండాల ప్రాంతంలో ఇలాంటి ప్రమాదాలు జరగలేదు. ఇప్పుడు ఇక్కడే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి.

కళ్లు మూసుకుని కొత్త బోట్లకు అనుమతి
అధికారులు కళ్లు మూసుకుని కొత్త బోట్లకు అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొత్త బోటు తయారు చేయించేటప్పుడు సదరు యజమాని పోర్టు అధికారులకు దరఖాస్తు చేయాలి. బోటు డిజైన్‌ను పోర్టు అధికారులు పరిశీలించి అనుమతి ఇవ్వాలి. కానీ.. ఎలాంటి డిజైన్‌ ఉన్నా గుడ్డిగా అనుమతులు ఇస్తున్నారు. బోటు బరువు ఎంత ఉండాలన్నది చెప్పడం లేదు. ఫలితంగా పర్యాటకుల ప్రాణాలు గంగ పాలవుతున్నాయి.

మారిన డిజైన్లతో కొత్త చిక్కులు
పూర్వం లాంచీలు ‘యూ’ ఆకారంలో ఉండేవి. వాటి ముక్కు సూదిగా ఉండేది. లాంచీ తయారీకి ఎక్కువగా టేకు. ఇనుము తక్కువగా వినియోగించేవారు. రహదారి సౌకర్యం అందుబాటులోకి వచ్చాక లాంచీలన్నీ పర్యాటక రంగానికే పరిమితమయ్యాయి. వీటి డిజైన్లు మారిపోయాయి. ఇప్పటి బోట్లు, లాంచీల ఎత్తు భారీగా పెంచారు. లాంచీపై మరో అంతస్తు నిర్మిస్తున్నారు. పర్యాటకులు లాంచీ పైభాగంలో కూర్చుని సుందర ప్రదేశాలను తిలకించేందుకు వీలుగా సిట్టింగ్‌ సౌకర్యం కల్పించారు. దిగువ భాగంలో ఏసీ సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో వాటి బరువు భారీగా ఉంటోంది. ఎత్తు పెరగడం వల్ల బ్యాలెన్స్‌ లేకుండా పోతోంది. ఎటు బరువు పెరిగితే అటు ఒరిగే పరిస్థితి తలెత్తుతోంది. పాత లాంచీల బరువు 15 నుంచి 20 టన్నులకు మించి ఉండేవి కావు. ప్రస్తుత లాంచీలు 35 నుంచి 40 టన్నుల వరకు బరువుంటున్నాయి. 

సరంగు నిర్లక్ష్యం.. డిజైన్‌ లోపాలే కారణం
కచ్చులూరు వద్ద ప్రమాదానికి గురైన లాంచీని అనుభవం లేని సరంగు నడిపాడు. అతడి నిర్లక్ష్యం వల్ల ప్రమాదం జరిగింది. లాంచీ డిజైన్‌ లోపం కూడా ప్రమాదానికి మరో కారణం. ఆ లాంచీకి తల బరువు ఎక్కువగా ఉంది. మరోవైపు ప్రమాద ప్రాంతంలో రెండు కొండలు దగ్గరగా ఉంటాయి. అక్కడ నదిలో నీటి వడి ఎక్కువ. సరంగు ఈ విషయాలను గమనించకుండా నడపడం వల్లనే లాంచీ పల్టీ కొట్టింది. పాత లాంచీలు బరువు తక్కువ కావటం వల్ల సునాయాసంగా ప్రయాణిస్తాయి. 1986, 1990 సంవత్సరాల్లో సంభవించిన వరదల్లో వేల కుటుంబాలను పాత లాంచీలతోనే కాపాడాం.
– చవ్వాకుల ప్రకాశరావు, సీనియర్‌ సరంగు, కూనవరం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement