బీజేపీ రంగు తేలుద్దాం!
వ్యూహానికి పదును పెడుతున్న కాంగ్రెస్
టీ బిల్లు ఆమోదం పొందకుంటే బీజేపీపైనే నెపం
పైకి మద్దతిస్తున్నా బిల్లును అడ్డుకునేందుకే మెలికలు పెడుతోందనే అనుమానం
ఏదిఏమైనా తెలంగాణ విషయంలో వెనక్కి తగ్గకూడదని నిర్ణయించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఇకపై బీజేపీ లక్ష ్యంగా వ్యవహరించనుంది. పార్లమెంటులో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు మద్దతు ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే ఆ పార్టీ మెలికలు పెడుతోందని భావిస్తున్న కాంగ్రెస్.. ఈ విషయం పార్లమెంటు వేదికగానే బయటపెట్టాలనే వ్యూహంతో ఉంది. ఒకవేళ ఏ కారణాల వల్లనైనా తెలంగాణ బిల్లు ఆమోదం పొందకుంటే బీజేపీపైనే నెపం మోపే విధంగా ప్రణాళిక రచించింది. ఇందులో భాగంగా శనివారం నుంచే ప్రధాన ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకుని వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
తెలంగాణ బిల్లు పార్లమెంటులో చర్చకు రాకుండా, బిల్లుపై ఓటింగు జరిగే పరిస్థితి లేకుండా చూడాలనే వ్యూహంతో బీజేపీ ఉందని కాంగ్రెస్ భావిస్తోంది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణకు మద్దతు ఇస్తే తమకు రాజకీయ ప్రయోజనం ఏమీ ఉండదనే భావనలో బీజేపీ ఉందనే సంకేతాలు కాంగ్రెస్ నేతలకు చేరాయి. ప్రధానంగా ఆ పార్టీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్రమోడీయే మోకాలడ్డుతున్నారని తెలిసింది. ఈ పరిస్థితుల్లోనే.. టీ బిల్లుకు బీజేపీ మద్దతివ్వదనే అంచనాకు కాంగ్రెస్ పెద్దలు వచ్చారు.
శుక్రవారం కేంద్ర కేబినెట్ భేటీ అనంతరం సీనియర్ మంత్రి ఒకరు మీడియాతో ముచ్చటిస్తూ.. ‘తెలంగాణ విషయంలో పైకి మద్దతిస్తామంటున్నా అంతర్గతంగా మాత్రం బిల్లు సభకు రాకుండా చేయాలని వ్యూహంతో బీజేపీ ఉంది. అలాగని బిల్లు పెట్టకుంటే కాంగ్రెస్ మాట తప్పినట్టు అవుతుంది. అందుకని మేం బిల్లును పెడితే బీజేపీ మద్దతు ఇవ్వనిపక్షంలో ఆ పార్టీ అసలు రంగు బయట పడుతుంది. సభను అదుపు చేయూలని, ఆ తరువాతనే టీ బిల్లును పెట్టాలని బీజేపీ నేతలు చెబుతున్నారు. మరోవైపు సీమాంధ్ర ఎంపీలను సస్పెండ్ చేస్తే అంగీకరించేది లేదనీ అంటున్నారు. ఏదిఏమైనా మేము బిల్లు పెడితే ఇప్పటిదాకా మద్దతు ఇస్తామని చెప్పిన బీజేపీ అసలు రంగు ఏమిటో బయటకు వస్తుంది’ అని వివరించారు.
బీజేపీ వైఖరి వల్లే తొలుత రాజ్యసభలో..
తెలంగాణ బిల్లును తొలుత రాజ్యసభలో ప్రవేశపెట్టాలనే కాంగ్రెస్ నిర్ణయూనికి కూడా బీజేపీ వైఖరే కారణమని తెలుస్తోంది. రాజ్యసభలో బిల్లును ప్రవేశపెడితే అభ్యంతరం లేదని బీజేపీ సంకేతాలివ్వడం.. లోక్‌సభలో మాత్రం సభను పూర్తిగా అదుపులోకి తేవాలంటూ మెలిక పెట్టడం.. వీటన్నిటి వెనుక బిల్లును అడ్డుకునే ఆ పార్టీ వ్యూహం దాగి ఉందని గ్రహించినందువల్లే తొలుత రాజ్యసభ ముందుకు బిల్లును తేవాలని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. కనీసం రాజ్యసభలోనైనా బిల్లు గట్టెక్కితే పార్టీపరంగా కొంత మేలు జరుగుతుందని వారు ఆశిస్తున్నట్టు చెబుతున్నారు. లోక్‌సభలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందడం అత్యంత క్లిష్టమైన అంశంగా కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాదిరిగా లోక్‌సభలోనూ తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టి మూజువాణి ఓటుతో ఆమోదింపజేయాలని కొందరు తెలంగాణ నేతలు వారికి సూచించారు. అరుుతే ‘ప్రధాన ప్రతిపక్షం ఒప్పుకోకుండా, సభ సజావుగా లేకుండా ఏ ఒక్క బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించే సాంప్రదాయం లోక్‌సభలో లేదు. అలాచేస్తే రాజ్యాంగాధిపతి రాష్ట్రపతి గౌరవానికి భంగం వాటిల్లినట్లే. లోక్‌సభ స్పీకర్ దీనికి అంగీకరించరు. కాంగ్రెస్ కూడా అందుకు సిద్ధంగా లేదు’’అని సీనియర్ కేంద్రమంత్రి ఒకరు పేర్కొన్నారు.
రెండుచోట్లా రాజకీయ లబ్ధిపై కన్ను: ఒకవేళ రాజ్యసభలో బిల్లు ఆమోదం పొంది లోక్‌సభలో మాత్రం పాస్ చేసుకోలేని పక్షంలో ఏ విధంగా ప్రజల్లోకి వెళ్లాలనే అంశంపైనా కాంగ్రెస్ పెద్దలు కసరత్తు చేసినట్లు తెలిసింది. రాజ్యసభలో బిల్లును పెట్టడం ద్వారా తెలంగాణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని ఆ ప్రాంత ప్రజలకు సంకేతాలను పంపవచ్చని, తద్వారా ఓట్లు సాధించుకోచ్చని వారు భావిస్తున్నట్టు పార్టీవర్గాల సమాచారం. అదే సమయంలో సీమాంధ్ర నేతలవల్లే బిల్లు ఆగిందని ప్రచారం చేయడం ద్వారా ఆ ప్రాంతంలో కూడా రాజకీయ లబ్ది పొందవచ్చనేది కాంగ్రెస్ వ్యూహమని చెబుతున్నారు.
కాంగ్రెస్, బీజేపీ మ్యాచ్‌ఫిక్సింగ్!: వామపక్షాల నేతలు మాత్రం తెలంగాణ విషయంలో కేంద్రంలోని అధికార, ప్రధానపక్ష పార్టీలు రెండూ అంతర్గత అవగాహనతో ముందుకు వెళుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఒక సభలో బిల్లు ప్రక్రియను ముగించి మరోసభలో నిలిపివేసేందుకు పథక రచన చేస్తున్నాయని అంటున్నారు. రెండు పార్టీలూ తమ రాజకీయ లబ్ది కోసమే ప్రయత్నిస్తున్నారుు తప్ప రాష్ట్ర ప్రజల భవిష్యత్‌ను పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు.
టీఆర్‌ఎస్, టీ జేఏసీలో ఆందోళన: ప్రస్తుత గందరగోళ పరిస్థితి, బీజేపీ వైఖరి టీఆర్‌ఎస్, తెలంగాణ జేఏసీ నేతలను ఆందోళనకు గురిచేస్తున్నారుు. టీ బిల్లుకు మద్దతిస్తామని ఇప్పటిదాకా స్పష్టంగా చెప్పిన బీజేపీ జాతీయ నేతలు ఇప్పుడు పలు షరతులు, నిబంధనలను సాకుగా చూపుతుండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. తెలంగాణ బిల్లుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, కేవలం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టి రాజకీయ ప్రయోజనం పొందడమే ఆ పార్టీ లక్ష ్యమని చెప్పిన బీజేపీ నేతలే.. తెలంగాణ బిల్లును వ్యతిరేకించే సీమాంధ్ర ఎంపీలను పార్లమెంటు నుండి సస్పెండ్ చేస్తే అంగీకరించేది లేదని చెబుతుండటంపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ నేతల్ని కలవండి: జైపాల్
ఆర్‌ఎస్‌ఎస్ నేతలను కలసి మరోసారి బీజేపీపై ఒత్తిడి తీసుకురావాల్సిందిగా టీ జేఏసీ నేతలకు కేంద్రమంత్రి ఎస్.జైపాల్‌రెడ్డి సూచించారు. జేఏసీ చైర్మన్ కోదండరాం తదితరులు శుక్రవారం జైపాల్‌రెడ్డితో ఆయన నివాసంలో భేటీ అయ్యూరు. ఈ సందర్భంగా తెలంగాణ విషయంలో కేంద్రం, కాంగ్రెస్ పార్టీ దృఢంగా ఉన్నాయని చెప్పిన మంత్రి.. బీజేపీ వైఖరిలోనే చాలా మార్పు కనిపిస్తున్నదని చెప్పినట్టు సమాచారం. పార్లమెంటులో బీజేపీ వైఖరి చాలా కీలకమని, ఈ పరిస్థితుల్లో బీజేపీ వెనుకడుగు వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలంగాణ ఉద్యమనేతలదేనని ఆయన చెప్పారు.