టీ.బిల్లుపై నేడు లోక్సభలో చర్చ
న్యూఢిల్లీ : తెలంగాణ బిల్లుపై లోక్‌సభలో నేడు చర్చ జరగనుంది. యూపీఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ తెలంగాణ బిల్లుపై మాట్లాడే అవకాశంకూడా ఉంది. మొత్తానికి పార్లమెంట్ చివరి సమావేశాలు ముగింపుకు చేరనుండడంతో.. తెలంగాణ బిల్లు విషయంలో కేంద్రం మరో అడుగు ముందుకు వేసేందుకు సిద్ధమైంది. ఈరోజు ఉదయం 11 గంటలకు లోక్ సభ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 12 గంటల నుంచి విభజన బిల్లుపై చర్చ మొదలు కానుంది.
మరోవైపు రాష్ట్ర విభజన బిల్లుపై ఈరోజు లోక్‌సభలో చర్చ జరగనున్న నేపథ్యంలో లోక్‌సభ సచివాలయం అందుకు తగిన సరంజామా సిద్దం చేస్తోంది. ఈ మేరకు విభజన బిల్లుపై లోక్‌సభ సచివాలయం ఆరు పేజీల బులెటిన్ విడుదల చేసింది. గతంలో రాష్ట్రాల విభజన సమయంలో ఎలా వ్యవహరించారో, ఏ చట్టాల ప్రకారం రాష్ట్రాలు ఎలా విడిపోయాయో ఆ బులెటిన్‌లో పేర్కొన్నారు. బులెటిన్ ప్రతులను లోక్‌సభ ఎంపీలకు అందించారు. లోక్‌సభలో టీబిల్లుపై చర్చకు నాలుగు గంటల సమయం కేటాయించే ఆలోచనలో ప్రభుత్వముంది. వివాదాస్పద తెలంగాణ బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.